సాక్షి, బెంగళూరు : అవినీతి అధికారులపై లోకాయుక్త దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించిన లోకాయుక్త అధికారులు నిందితుల వద్ద సంపాదనకు మించిన ఆస్తులున్నట్లు గుర్తించారు.
లోకాయుక్త దాడులు చేసిన వారిలో బళ్లారి కేయూడ బ్ల్యూఎస్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.యూనస్ బాషా, హాసన్ జిల్లా ఆలూరు తాలూకా తహసీల్దార్(గ్రేడ్-2) హొంబేగౌడ, కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ ప్రసిడెంట్ ఆర్.ఎం.మంజునాథ్ గౌడ, బీడీఏ కాంప్లెక్స్ హెడ్ క్వార్టర్స్ అసిస్థెంట్ ఎ.ఎన్.భారతి ఉన్నారు.
బళ్లారి కేయూడబ్ల్యూఎస్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.యూనస్ బాషా ఇళ్లు, కార్యాలయంపై లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో యూనస్ బాషాకు రూ.65లక్షల స్థిరాస్తులు, రూ.95 లక్షల చరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ అతని ఆదాయం కంటే దాదాపు 150శాతం ఎక్కువగా ఉన్నట్లు లోకాయుక్త తేల్చింది.
హాసన్ జిల్లాలోని ఆలూరులో తాలూకా కార్యాలయంలో తహసీల్దార్(గ్రేడ్-2)గా విధులు నిర్వర్తిస్తున్న కె.హొంబేగౌడ నివాసంతో పాటు కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో హొంబేగౌడ రూ.1.10కోట్ల స్థిరాస్తులు, రూ.26.8లక్షల చరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం ఆస్తుల విలువ నిందితుని సంపాదన కంటే దాదాపు 115శాతం అధికమని లోకాయుక్త అధికారులు తేల్చారు.
శివమొగ్గకు చెందిన ఆర్.ఎం.మంజునాథ గౌడ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అపెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నారు. శుక్రవారం ఇతని కార్యాలయం, సొంత ఇంటిలో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మంజునాథకు రూ.1.86కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, రూ.2.76కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు తేలింది. వీటి విలువ మంజునాథ ఆదాయం కంటే 70శాతం ఎక్కువగా లోకాయుక్త అధికారులు లెక్కగట్టారు.
బీడీఏ కాంప్లెక్స్ విభాగంలో హెడ్ క్వార్టర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎ.ఎన్.భారతి నివాసంతో పాటు కార్యాలయాలపై కూడా లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఈ సోదాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతున్నందున ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని కర్ణాటక లోకాయుక్త అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్.సత్యనారాయణ రావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
లోకాయుక్త వలలో అవినీతి తిమింగలాలు
Published Sat, May 31 2014 2:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement