నటి అల్ఫోన్సా ఎక్కడ!
సాక్షి, చెన్నై: శృంగార తార అల్ఫోన్సా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆమె ఎక్కడున్నారో, జయశంకర్ కిడ్నాప్ కేసు ఎంత వరకు వచ్చిందో వివరణ ఇవ్వాలని పోలీసుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.తన భర్త జయశంకర్‌ను సినీ శృంగార తార అల్ఫోన్సా కిడ్నాప్ చేసి ఉన్నారని మైలాడుదురైకు చెందిన సుమిత్ర గత వారం చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం పోలీసులకు కొత్త సమస్యగా మారింది.
విచారణ మందకొడిగా సాగడంతో సుమిత్ర మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఆపదలో ఉన్నారని, ఆయన్ను రక్షించేందుకు పోలీసుల్ని ఆదేశించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు తమిళ్‌వన్నన్, బి రాజేంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది గణేష్ రాం తన వాదనల్ని విన్పించారు.
చివరకు అల్ఫోన్సా ఎక్కడ..?
అన్న ప్రశ్నను సంధించిన న్యాయ స్థానం, ఆమె ఆచూకీ కనుగొనడంతో పాటుగా జయ శంకర్‌ను రక్షించేందుకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఆ కేసు వివరాలతో వివరణ ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
మరోవైపు జయ శంకర్‌ను తాను కిడ్నాప్ చేయలేదని అతని చేతిలో తానే మోసపోయానని అల్ఫోన్సా వాట్సాప్‌లో తన ఆవేదనను వ్యక్తం చేసింది. సుమిత్ర బంధువు ఒకరి వాట్సాప్‌కు ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సమాచారం పంపింది. జీవితంలో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్న తనకు జయశంకర్ అండగా ఉంటాడని భావించానని పేర్కొంది.
తనను ప్రేమించినట్టు నమ్మ బలికి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. జయశంకర్ ఇక తనకు వద్దు అని సుమిత్రకు అప్పగిచ్చేస్తున్నానని పేర్కొనడం గమనార్హం. అయితే పోలీసు కేసుల నుంచి తప్పించుకునేందుకు అల్ఫోన్సా కొత్త బాణి అందుకున్నట్టు కన్పిస్తున్నది. వాట్సాప్ రూపంలో అల్ఫోన్సా తన సందేశాన్ని పంపించడంతో ఇక ఈ కథ సుఖాంతం అయ్యేనా, లేదా కొత్త మలుపులు తిరిగేనా అన్నది వేచిచూడాల్సిందే.