
షాడో సీఎం !
జైలు నుంచి ఆదేశాలను అందుతున్న ఆదేశాల ప్రకారం రాష్ట్రాన్ని పాలించడం అభ్యంతరకరమని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు కోర్టుకెక్కాడు.
⇒ చిన్నమ్మ డైరెక్షన్..ఎడపాడి యాక్షన్
⇒ తమిళనాడు సీఎం, మంత్రులకు హైకోర్టు నోటీసులు
⇒ ఖైదీ శశికళ సూచనల మేరకు పాలనపై పిటిషన్
తమిళనాడును పాలిస్తున్నది ఎవరు. ఎడపాడా లేక శశికళనా? జైల్లో ఖైదీగా ఉంటూనే షాడో సీఎంగా మారిన శశికళ కనుసన్నల్లో నడుస్తున్న సీఎం, నలుగురు మంత్రులు ఎమ్మెల్యేలుగా అనర్హులు అంటున్నారు అన్నాడీఎంకే సీనియర్ నేత ఆనగళన్. అంతేకాదు వారిపై కోర్టులో పిటిషన్ దాఖలుచేసి గురువారం నోటీసులు కూడా ఇప్పించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి ఆదేశాలను అందుతున్న ఆదేశాల ప్రకారం రాష్ట్రాన్ని పాలించడం అభ్యంతరకరమని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు కోర్టుకెక్కాడు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన వెంటనే సీఎం పీఠంపై శశికళ కన్నుపడింది. జయ మరణించి నిండా నెలరోజులు కూడా కాక ముందే పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
ఈ బాధ్యతలు స్వీకరించి నెలరోజులు పూర్తికాక ముందే పన్నీర్‌సెల్వం చేత సీఎం పదవికి రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా మారిపోయారు. స్వతహాగా సాధుస్వభావి అయిన పన్నీర్‌సెల్వంలో కూడా కోపం కట్టలు తెంచుకుంది. చిన్నమ్మపై తిరుగుబాటుచేసి పార్టీని రెండుగా చీల్చారు. అయితే విధి వక్రీకరించగా సీఎంగా సచివాలయానికి వెళ్లాల్సిన చిన్నమ్మ ఖైదీగా జైలు బాటపట్టారు. సీఎం కుర్చీలో ఎడపాడిని కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను టీటీవీ దినకరన్‌కు అప్పగించారు.
ఆరోజుల్లో అమ్మకు ఈరోజుల్లో చిన్నమ్మకు విశ్వాపాత్రులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి కొన్ని నెలల క్రితం బృందంగా ఏర్పడి చిన్నమ్మను చూసేందుకు జైలుకెళ్లగా అ«ధికారులు తరుముకోవడంతో దేవుడా అంటూ చెన్నైకి చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత ఎడపాడి బెంగళూరు జైలుకెళ్లకున్నా ఆయన తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు చిన్నమ్మ ఆశీస్సులు పొందివచ్చారు.
శిక్షపడిన ఖైదీ నేతృత్వంలో పాలనా ?
ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన సీఎం, మంత్రులు జైలు ఖైదీ శశికళ నుంచి ఆదేశాలు పొందడం అభ్యంతరకరమని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే నేత ఆనళగన్ మార్చిలో మదురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ సూచనలు, ఆదేశాలను అనుసరించి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు పార్టీ అధికారప్రతినిధి గౌరీశంకర్ ఫిబ్రవరి 22న ప్రకటించారు. మంత్రులు సెంగొట్టయ్యన్, సెల్లూరురాజా, దిండుగల్లు శ్రీనివాసన్, కామరాజ్ పదవీ ప్రమాణం చేసిన తరువాత బెంగళూరు జైలు కెళ్లి శశికళ ఆశీర్వాదం పొందారు. ఇంత జరుగుతున్నా సీఎం చేష్టలుడిగి చూస్తున్నారు.
రాష్ట్రంలో పాలనను జైలు ఖైదీ చేతుల్లో పెట్టిన సీఎం ఎడపాడి, నలుగురు మంత్రులను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్, శాసనసభా కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పిటిషన్‌ను గవర్నర్‌కు పంపి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. ఆనగళన్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చిం ది. పిటిషనర్ వాదనను విన్న అనంతరం న్యాయమూర్తులు కేకే శశిధరన్, జి.ఆర్.స్వామినాథన్ వివరణ కోరుతూ ఆ ఐదుగురికి నోటీసులు జారీచేశారు.