సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలకు, వ్యవహరిస్తున్న తీరుకు పొంతనే ఉండడంలేదని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి లోక్‌సభ టికెట్ ఇవ్వబోమని ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు రాఖీబిర్లాను లోక్‌సభకు పంపే యోచనలో ఉన్నట్లు తెలిసిందని, ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో శనివారం న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించిన కార్యకర్తలు రెండోరోజైన ఆదివారం కూడా నిరసన ప్రదర్శన కొనసాగించారు. దాదాపు 30 మంది ఆప్ కార్యకర్తలు హనుమాన్ రోడ్డులో ఉన్న ఆప్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రాఖీ బిర్లాకు టికెట్ ఇవ్వనున్నట్లు తమకు తెలిసిందని, పార్టీ నిర్ణయం పట్ల తమ వ్యతిరేకతను తెలియచేయడం కోసం ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆప్ కార్యాలయ మందు ధర్నా జరిపిన కార్యకర్తలు తెలిపారు. శాసనసభ్యులుగా ఎన్నికైనవారిలో ఎవరికీ అసెంబ్లీ టికెట్ ఇవ్వమని ప్రకటించిన కేజ్రీవాల్ రాఖీ బిర్లాకు టికెట్ ఇవ్వాలనుకోవడాన్ని వారు ప్రశ్నించారు. బిర్లా కనీసం లోక్‌సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వారు ఆరోపించారు. అటువంటప్పుడు పార్టీ నియమాలను పక్కనబెట్టి రాఖీ బిర్లాకు టికెట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. వలంటీర్ల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రొటొకాల్‌ను పాటించిన దరఖాస్తుదారులకే పార్టీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం మిగతా పార్టీల కంటే ముందుగానే సమాయత్తమవుతోంది. ఇందులోభాగంగా తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. రెండో జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ జాబితాలో రాఖీ బిర్లా పేరుందనే వార్త పార్టీవర్గాల ద్వారా బయటకు పొక్కడంతో కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.