న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మలివిడత జాబితాను శనివారం విడుదల చేసింది. ఇందులో మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, రాఖీబిర్లాలకు చోటుదక్కింది. పత్పర్‌గంజ్ నియోజకవర్గంనుంచి సిసోడియా, మంగోల్‌పురి నియోజకవర్గం నుంచి రాఖీ బిర్లా పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గాలనుంచి వీరిరువురు విధానసభకు ప్రాతినిథ్యం వహించిన సంగతి విదితమే. పార్టీ సభ్యులంతా కలిసి సీఎం అభ్యర్థిగా అరవింద్‌ను ఎన్నుకున్న తర్వాత ఆయన పేరు మరో విడత జాబితాలో విడుదల అవుతుంది. ఇదిలాఉంచితే తాజా జాబితాలో మాజీ శాసనసభ్యులు మదన్‌లాల్, దినేష్ మోహనియా, ప్రకాష్ జర్వాల్‌లకు కూడా చోటుదక్కింది.
వీరు కస్తూర్బానగర్, సంగంవిహార్, దేవ్లి నియోజకవర్గాలకు గతంలో ప్రాతినిథ్యం వహించిన సంగతి విదితమే. త్రిలోక్‌పురి స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన రాజు ధింగన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. పటేల్‌నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బరిలోకి దిగిన వీణా ఆనంద్‌కు ఈ జాబితాలో చోటుదక్కలేదు. బాబుర్‌పూర్ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్‌రాయ్‌కి కేటాయించారు. బల్లిమర స్థానాన్ని ఇమ్రాన్ హుస్సేన్, మటియామహల్ టికెట్‌ను ఆసిం ఆహ్మద్ ఖాన్‌లకు కేటాయించింది. షహదారా, నంగ్లోయ్ నియోజకవర్గాలను రాంనివాస్ గోయల్, రఘవేంద్ర షకీన్‌లకు కేటాయించింది. ఇక రిఠాలా నియోజకవర్గం టికెట్‌ను కొత్త అభ్యర్థి మహేంద్ర గోయల్‌కు కేటాయించింది. ఇదిలాఉంచితే ఆప్ ఇప్పటివరకూ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 35కు చేరుకుంది.
ప్రచార పర్వం ప్రారంభం
త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పకడ్బందీ ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో తన ప్రచారహోరుతో అత్యధిక స్థానాలను ఆప్ కైవ సం చేసుకున్న సంగతి విదితమే. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన తొలి జాబితాలో అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని తెలియజేయడంతోపాటు ఆప్ సర్కారు చేసిన పనుల్ని వివరిస్తున్నారు. కాగా కేజ్రీవాల్ నుపలాయనవాదిగా చిత్రీకరిస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పకొట్టాల్సిన అవసరాన్ని ఆప్ గుర్తించింది.
కాంగ్రెస్, బీజేపీ ప్రచారం వల్ల కేజ్రీవాల్‌పై ఏర్పడిన దురభిప్రాయాన్ని ప్రజల మదిలోనుంచి తొలగించి ఆయన సమర్థ పాలనను అందజేయగలరంటూ వివరించాలని ఆప్ తన లక్ష్యంగా పెట్టుకుంది. విధానసభ ఎన్నికల నోటిఫికే షన్ వెలువడేలోపల పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ రేడియో, టెలివిజన్ మొదలుకుని రహదారులు, కాలనీలు అన్ని చోట్లా దర్శనమివ్వాలనేది పార్టీ వ్యూహంగా ఉంది. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలను కేజ్రీవాల్ తన సందేశాల ద్వారా నగరవాసులకు గుర్తుచేస్తారు. 49 రోజుల తమ పాలన కాలంలో తగ్గిన అవినీతిని, బీజేపీ150 రోజుల పాలనతో పోల్చనున్నారు. మళ్లీ అధికారానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.
విధానసభ ఎన్నికలు ఆప్ మలి జాబితాలో సిసోడియా, రాఖీ
Published Sun, Nov 30 2014 12:25 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement