గజరాజుల బీభత్సం: నలుగురు మృత్యువాత
తమిళనాడులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
కోయంబత్తూరు: తమిళనాడులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నిద్రిస్తున్న వారిపై ఏనుగుల దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లలూరు పట్టణ శివారులో శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక ఉంది. వరండాలో నిద్రిస్తున్న బాలికపై దాడి చేసిన ఏనుగులు అనంతరం పక్కనే ఉన్న మరో ముగ్గురిని తొక్కి తీవ్రంగా గాయపరిచాయి.
స్థానికులు అప్రమత్తమై ముగ్గురినీ స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని ఏనుగులను దగ్గరలో ఉన్న మాడుక్కురై అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగులను శాంతింపజేసేందుకు మరో ఏనుగుల గుంపును సంఘటనాస్థలానికి తీసుకువచ్చారు. అప్పటి వరకు ప్రజలు బయటప్రదేశాల్లో నిద్రించవద్దని హెచ్చరించారు.