
గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.
‘‘శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి చేయడం అత్యంత బాధాకరం. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’’ అని వైఎస్ జగన్ కోరారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి.