మోనిక దారుణ హత్య
టీనగర్: గోవాలో సుగంధ ద్రవ్యాల తయారు చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గోవాలో కలాన్‌క్యూట్ బీచ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో సంగోల్టా ఉంది. ఇక్కడున్న ఒక అపార్ట్‌మెంట్ లో మోనిక(39) అనే మహిళ ఒంటరిగా నివసిస్తున్నారు. గతంలో చాయాగ్రాహకురాలిగా పనిచేసిన ఈమె అనంతరం సెంట్స్ తయారీపై విదేశాల్లో విద్య నభ్యసించారు. ఈమె తయారు చేసే సెంట్స్‌కు భారత్, అమెరికాలో మంచి డిమాండ్ ఉంది.
ఇదిలావుండగా గురువారం రాత్రి ఈమె ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బెడ్‌పై కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం పడివుందని, ఆమెపై అత్యాచారం జరిపిన అనంతరం హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. దీంతోపాటు హంతకుడు ఇంట్లో నగలు, నగదు దోచుకువెళ్లినట్లు తెలిపారు.
మృతురాలు చెన్నై ఫొటోగ్రాఫర్ సతీమణి: హత్యకు గురైన మోనిక చెన్నైకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ సతీ మణిగా తెలిసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఈమె చెన్నైకు చెందిన ఫొటోగ్రాఫర్ భరత్ రామామృతం(58) వద్ద సహాయకురాలిగా చేరింది. ఆ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారడంతో 2004లో వివాహం చేసుకున్నారు.
2011లో గోవాలో నివాసం ఏర్పరచుకున్న వీరు ఏడాది క్రితం అభిప్రాయభేదాలు ఏర్పడడంతో విడిపోయారు. వీరింకా విడాకులు కూడా తీసుకోలేదు. వీరికి సంతానం లేదు. మోనిక హత్య సమయంలో భరత్ చెన్నైలో ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు భరత్‌వద్ద విచారణ జరుపుతున్నారు.