అమెరికా నర్సునంటూ తీయని మాటలు | Woman cheats sixty people | Sakshi
Sakshi News home page

అమెరికా నర్సునంటూ తీయని మాటలు

Published Sun, Nov 19 2017 10:20 AM | Last Updated on Sun, Nov 19 2017 10:20 AM

Woman cheats sixty people - Sakshi

జయనగర: అమెరికాలో నర్సు, ఆర్‌బీఐ ఆఫీసర్, కస్టమ్స్‌ అధికారి తదితర పేర్లతో ఒక మాయలేడి నగరానికి చెందిన టెక్కీకి తీయని మాటలు చెప్పి దఫదఫాలుగా రూ.9.02 లక్షల నగదును తన అకౌంట్‌కు జమచేసుకుని మోసగించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అశోకనగర పోలీసుల కథనం ప్రకారం....నెలమంగలకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తి నగరంలో ఓ ప్రముఖ సాప్ట్‌వేర్‌ కంపెనీలో టెక్కీ. ఇతడికి ఫేస్‌ బుక్‌లో రచనా కరం అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ మొబైల్‌ నెంబర్లు మార్చుకుని కబుర్లు చెప్పుకోవడం ఆరంభించారు. 

బెంగళూరుకు వస్తానని.. 
తాను అమెరికాలో నర్సుగా పనిచేస్తున్నట్లు, త్వరలో బెంగళూరుకు వస్తానని, పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి తాను బసచేయడానికి ఇంటిని చూడాలని రమేశ్‌కు తెలిపింది. ప్రస్తుతానికి తన వద్ద  డబ్బులేదని రమేశ్‌ ఆమెతో చెప్పాడు. అమెరికా డాలర్లు, బంగారు ఆభరణాలు పార్శిల్‌ ద్వారా పంపిస్తానని, డాలర్లను రూపాయిల్లోకి మార్చుకోవాలని రచనా కరం అతణ్ని బుట్టలోకి వేసింది. ఇది నమ్మిన రమేశ్‌ కొన్నిరోజులకు ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.4లక్షల 70 వేల నగదు జమచేశాడు. 

అనంతరం అక్టోబరు 2వ తేదీన ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారి నిషా కుమారి పేరుతో రమేశ్‌కు ఫోన్‌ వచ్చింది. అమెరికా నుంచి పార్శిల్‌ వచ్చిందని, కస్టమ్స్‌ సుంకాన్ని విమానాశ్రయ అధికారి సుమన్‌దేవి ఖాతాకు జమ చేస్తే, పార్శిల్‌ను మీకు పంపిస్తానని చెప్పింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్‌ అక్టోబరు 3వ తేదీన నిషా కుమారి ఖాతా కు రూ.1.62 లక్షల నగదు పంపారు. పార్శిల్‌ బరువు ఎక్కువగా, పన్నులు కట్టాలని రమేష్‌కు మళ్లీ నిషాకుమారి ఫోన్‌ చేసింది, మాన్‌సింగ్‌ ఖరే అనే అధికారి అకౌంట్‌కు రూ.2.70 లక్షల నగదు జమచేయాలని సూచించింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్‌ ఆమె చెప్పిన ఖాతాలోకి ఆ సొమ్మును జమచేశాడు.

మరో రూ.4.70 లక్షలు పంపాలని ఫోన్‌ 
 చివరికి అక్టోబరు 25 తేదీన ఆర్‌బీఐ ప్రధానాధాకిరాఇ స్వరబ్‌ జోషిననే పేరుతో ఫోన్‌ చేసిన వ్యక్తి అమెరికా పార్శిల్‌ కోసం మీరు పంపిన డబ్బు ఆ అకౌంట్లలోకి జమ కాలేదని, మళ్లీ రూ.4.70 లక్షల నగదు అకౌంట్‌కు జమచేయాలని తెలిపాడు. దీంతో అప్పటికే నగదు పంపీ పంపీ విసిగిపోయిన రమేశ్‌కు అనుమానం వచ్చి ఆర్‌బీఐ కార్యాలయానికి వెళ్లి విచారించగా, ఇదంతా ఫ్రాడ్, ఎవరో నిన్ను తెలివిగా మోసగించారని వారు స్పష్టంచేశారు. బాధితుడు రమేశ్‌ లబోదిబోమంటూ శనివారం అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్‌ క్రైం పోలీసుల సహాయంతో వంచకురాలి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement