సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన ముంబై నగరం మహిళలపై అత్యాచారాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ నేర పరిశోధన శాఖ, మహిళా కమిషన్, మహిళల సమస్యలపై పోరాడే స్వయం సేవా సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. గత ఐదేళ్లలో మహిళలపై జరిగిన అత్యాచార సంఘటనల్లో ముంబై ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ అధ్యయనాలు ధ్రువీకరించాయి. రాష్ట్రంలో జాల్నా, బీడ్, నాగపూర్ జిల్లాల్లో వరకట్నం హత్యలు, అసభ్యకరంగా ప్రవర్తించడం తదితర కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కాని ముంబైలో మాత్రం అభం శుభం తెలియని చిన్న పిల్లలతోపాటు యువతులపై సైతం అత్యాచార సంఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి.
గతంలో మహిళలను కేవలం అదనపు వరకట్నం కోసం వేధించే కేసుల సంఖ్య అత్యధికంగా ఉండేది. కాని ఇప్పుడు అపహరణ, ఈవ్‌టీజింగ్, పనిచేసే కార్యాల యాల్లో లైంగిక వేధింపులు, అదనపు వరకట్నం, కొడుకే కావాలని పట్టుబట్టడం, ఆడ పిల్లలు పుట్టినందుకు హింసించడం లాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిలో అత్యాచారాలు, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి నేరాల సంఖ్యదే అగ్రస్థానం. కాగా, వీటిలో అత్యధిక శాతం కేసులు పోలీసు స్టేషన్ల వరకు వెళ్లడం లేదని మహిళల సమస్యలపై పోరాడుతున్న స్వయం సేవా సంస్థకు చెందిన అడ్వొకేట్ మనీషా తుల్పులే అన్నారు. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరీక్షలు, పోలీసుల ప్రవర్తనతో విసిగెత్తిన బాధితులు మనోధైర్యాన్ని కోల్పోయి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది.
ముంబైలో మహిళల భద్రతకు పెద్ద పీట వేశామని హోం శాఖ తరుచూ ప్రకటిస్తోంది. కాని దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో జరుగుతున్న నేరాలతో పోలిస్తే ముంబైలోనే మహిళలకు భద్రత క రువైందని స్పష్టమవుతోందని మనీషా ఆవేదన వ్యక్తం చేశారు. నగలు దోచుకుపోవడం, దాడులు చేయడం, యాసిడ్ పోయడం, నిప్పు పెట్టడం, నడిచే వాహనాల్లోంచి బయటకు తోసేయడం, సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమాల ద్వారా మహిళలను కించపర్చడం లాంటి నేరాలు వేగంగా పెరిగిపోతున్నాయి. 2013 జనవరి నుంచి ఆగస్టు వరకు 1,898 కేసులు నమోదయ్యాయి. అత్యాచారం, అసభ్యకరంగా ప్రవర్తించే కేసులు కేవలం ఎనిమిది శాతం మాత్రమే పరిష్కారమయ్యాయి.
మహిళకు రక్షణ కరువు
Published Fri, Mar 21 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM
Advertisement