
కుమారుడితో ధర్నా చేస్తున్న శుభ
అన్నానగర్: తిరునల్వేలి సమీపంలో ప్రియుడితో కలపాలని కోరుతూ యువతి సోమవారం సాయంత్రం అతని ఇంటి ముందు బిడ్డతో ధర్నాకు దిగింది. తిరునెల్వేలి జిల్లా శ్రీ వైకుంఠం సమీపం ఉడైయాన్‌కుడికి చెందిన సముద్ర పాండియన్ కుమార్తె శుభ (21). ఈమెకు వివాహమై మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ సమస్యల కారణంగా భర్త నుంచి విడాకులు పొంది తండ్రి ఇంట్లో ఉంటోంది. ఈ స్థితిలో ఫేస్‌బుక్ ద్వారా తిరుచ్చి ముత్తరసనల్లూర్ బాలాజీనగర్‌కు చెందిన సంతోష్‌కుమార్ (26)తో శుభకి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. సంతోష్‌కుమార్ చెన్నైలో ఓ ఆలయంలో అర్చకుడిగా ఉన్నాడు. ఈ స్థితిలో శుభని వివాహం చేసుకుంటానని చెప్పి సంతోష్‌కుమార్ తిరునెల్వేలికి వెళ్లి ఆమెని తిరుచ్చి తీసుకొచ్చి ఓ స్థలంలో ఉంచాడు.
తరువాత బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఈ క్రమంలో సంతోష్‌కుమార్‌కు మరొక మహిళతో వివాహం జరగనుందని శుభకు తెలిసింది. దీనిపై ఆమె గత శుక్రవారం జయపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ స్థితిలో సోమవారం సాయంత్రం ముత్తరసనల్లూర్ బాలాజీ నగర్‌లో ఉన్న ప్రియుడి ఇంటి ముందు తన కుమారుడితో ధర్నాకు దిగింది. దీంతో సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న జీయపురం పోలీసులు వచ్చి శుభ వద్ద విచారణ చేశారు. తనను ప్రియుడితో కలపాలని శుభ కోరింది. పోలీసులు ఆమెతో చర్చలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment