చెన్నై : కడైయమ్ సమీపంలో బుధవారం భర్త ఇంటి ముందు పసికందుతో మహిళా ఇంజినీర్ ధర్నాకు దిగింది. తెన్‌కాశి జిల్లా కడైయమ్ సమీపం కట్టెలి పట్టి కీళ వీధికి చెందిన పరమశివన్ కుమారుడు మురుగన్ (30). ఇంజినీర్ అయిన ఇతను ఇండోనేషియాలో పనిచేస్తూ వస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గురుస్వామి కుమార్తె, ఇంజినీర్ అయిన తేన్‌మొలి (27)తో గత ఫిబ్రవరిలో వివాహమైంది. తరువాత మురుగన్ పనికోసం ఇండోనేషియాకి బయలుదేరి వెళ్లాడు. ప్రస్తుతం అతను అక్కడ పనిచేస్తున్నాడు. తేన్‌మొలి కోవైలో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. గర్భంతో ఉండడంతో ఆమె పనిని వదిలి ఊరుకి తిరిగి వచ్చింది. తరువాత కన్నవారి ఇంట్లో నివసిస్తూ వచ్చింది.
అప్పుడప్పుడూ ఆమె భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండేది. నవంబర్‌లో తేన్‌మొలికి ఆడ బిడ్డ పుట్టింది. అదే రోజు ఈ విషయం ఇండోనేషియాలో ఉన్న భర్తకి సమాచారం తెలిపింది. ఇంకా బిడ్డని చూడడానికి సెలవు తీసుకొని ఊరుకి రమ్మని ఆమె చెప్పింది. అతను వెంటనే సెలవు తీసుకుని రాలేను అని చెప్పాడు. ఈ స్థితిలో హఠాత్తుగా ఒక రోజు, బిడ్డ తనకు పుట్టలేదని, ఆ బిడ్డని చూడడానికి రాను అంటూ మురుగన్ చెప్పడంతో తేన్‌మొలి దిగ్భ్రాంతి చెందింది. బుధవారం మురుగన్ ఇంటికి ఆమె తన బిడ్డతో వచ్చి ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న కడైయమ్ పోలీసులు, గ్రామ నిర్వాహక అధికారి సుడర్‌సెల్వన్ సంఘటనా స్థలానికి చేరుకుని తేన్‌మొలితో చర్చలు జరిపారు. ఆమె మాట్లాడుతూ ఈ బిడ్డ తనకు పుట్టలేదని భర్త చెబుతున్నాడని, నేను డీఎన్‌ఏ పరిశోధనకి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆమెని కడైయమ్ పోలీసు స్టేషన్‌కి తీసుకుని వెళ్లి పోలీసులు విచారణ చేశారు. నీ భర్త నెలలో ఊరికి వస్తాడు.. అతనితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment