24 ఏళ్ల తరువాత విడుదలైన మహిళ
Published Sun, Dec 22 2013 1:58 AM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు సెంట్రల్ జైలులో 24 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన మహిళ శనివారం విడుదలైంది. న్యాయవాది పుగయేండి వెల్లడించిన వివరాల ప్రకారం, తిరుప్పూర్‌కు చెందిన సుబ్రమణి భార్య పక్కా అలియాస్ విజయ(60) వీధి నాటకాలు వేస్తుండేది. రాత్రి వేళల్లో ఎక్కడ చోటు ఉంటే అక్కడ నిద్రించేది. 1990 ఏప్రిల్ 24న రాత్రి నాటకం వేసి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ఒక వ్యక్తి తాగిన మైకంలో లైంగికదాడికి యత్నించాడు. దీంతో విజయ, ఆమె భర్త సుబ్రమణి ఇద్దరూ దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అరుుతే కోవై పోలీసులు మాత్రం రూ.500 కోసం హత్య చేసినట్లు వీరిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సుబ్రమణి, భార్య విజయకు యావజ్జీవ జైలు శిక్ష విధించారు.
విజయను రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని ఉండే గదిలో ఉంచారు. ఈమెకు, నళినీకి మధ్య పరిచయం ఏర్పడిం ది. ఈ క్రమంలో తమ న్యాయవాది పుగయేం డికి నళిని విషయం తెలియజేసింది. ఆమెను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ న్యాయవాది 2011లో చెన్నై హైకోర్టులో అప్పీలు చేశాడు. చెన్నై హైకోర్టు న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ పలు కోణాల్లో విచారణ జరిపి ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీలోపు విడుదల చేయాలని తీర్పు చెప్పారు. ఆ ఉత్తర్వులు జైలు అధికారులకు శనివారం అందడంతో, ఆమెను విడుదల చేసి వేలూరులోని కారుణ్య కేంద్రంలో చేర్పించా రు. 24 ఏళ్ల జైలు జీవితం అనుభవించి విడుదలైన విజయ ప్రస్తుతం మతిస్థిమితం కోల్పోవడం విచారకరం. ఇదిలా ఉండగా విజయ భర్త సుబ్రమణి మాత్రం వేలూరు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
Advertisement
Advertisement