ట్రక్కు డ్రైవర్‌గా మహిళ
Published Fri, Aug 9 2013 5:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
సాక్షి, ముంబై: అన్ని రంగాల్లో మహిళలు వేగంగా దూసుకువెళ్తున్నారు. ముంబైలాంటి నగరాల్లో ఇప్పటికే మహిళలు ఆటో, ట్యాక్సీలు నడుపుతూ కనిపిస్తున్నారు. అయితే నవీ ముంబైవాసులకు బుధవారం ఓ కొత్త సంఘటన ఎదురయింది. ఒక ట్రక్కు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుంచి నాలుగు రోజులపాటు 1,500 కిలోమీటర్ల మేర ఆలుగడ్డల లోడ్‌తో ప్రయాణించి బుధవారం వాషీలోని ఏపీఎంసీ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ట్రక్కులో డ్రైవర్ స్థానంలో పురుషుడు కాకుండా ఓ మహిళ ఉండడం అందరినీ ఆకర్షించింది. యోగితా సూర్యవంశి (44) అనే మహిళ ఆ ట్రక్కు నడుపుతూ ఇంతదూరం వచ్చిందని తెలుసుకుని మార్కెట్‌లో ఉన్న పలువురు ఆమెను చూసి అభినందనలు తెలిపారు. ఈ మహిళా డ్రైవర్ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. యోగిత కూడా తన వివరాలను అంతే ఓపికగా అందరికీ తెలియజేసింది. రవాణా వ్యాపారం చేసే ఆమె భర్త 2002లో మరణించాడు.
దీంతో ఆ వ్యాపార బాధ్యతలు యోగితపై పడ్డాయి. అయితే ప్రైవేటు డ్రైవర్లకు బాధ్యతలు అప్పగిస్తే.. చాలా నష్టం వస్తోందని గమనించి రెండు ట్రక్కులను అమ్మేసింది. అనంతరం ఉన్న ఓ ట్రక్కును తానే తోలాలని నిర్ణయం తీసుకుంది. చివరికి ఆ ట్రక్కుకు ఆమే డ్రైవర్‌గా మారి తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె బీకాం, ఎల్‌ఎల్‌బీ చదివింది. పుట్టింది మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో అయినప్పటికీ వివాహం తర్వాత వీరి కుటుంబం భోపాల్‌లో స్థిరపడింది. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. చాలా రోజులుగా తాను ట్రక్కు నడుపుతున్నానని, ఎక్కువగా భోపాల్ కర్ణాటక మార్గంలో తన ట్రక్కు నడుస్తుందన్నారు. ఆగ్రా నుంచి ముంబై వరకు 1,500 కిలోమీటర్ల ప్రయాణం చేసి వాషీకి వచ్చిన ఆమె, ఆలుగడ్డ లోడ్ ఖాళీ అయిన తరువాత వెళ్లిపోయింది.
Advertisement