స్త్రీలను అవమానించకండి!
ప్రేమను పంచే స్త్రీ మూర్తి ఇప్పుడే పురోగాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.అలాంటి స్త్రీ శక్తిని ప్రోత్సహించకపోయినా పర్వాలేదు. అవమానించకండి అని వేడుకుంటున్నానన్నారు నటుడు,దర్శక నిర్మాత శశికుమార్. మహిళాదినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తులకు శుభాకాంక్షలు అందిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చే శారు.
శశికుమార్ మాట్లాడుతూ మహిళాదినోత్సవం పేరుతో ఒకే ఒక్క రోజు వారిని వేడుక జరుపుకోనివ్వడం సరికాదన్నారు.ఒక తల్లిగా,చెల్లిగా,స్నేహితురాలిగా ఎందరో స్త్రీలు చూపించే ప్రేమాభిమానాలే మనల్ని జీవింపజేస్తున్నాయన్నారు. పురుషులకు సమానంగానే కాదు అంతకు మించి ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగం నుంచి విద్యుత్ రంగం వరకూ సకల వృత్తుల్లోనూ మహిళలు తమ ప్రజ్ఞా పాఠవాలతో అబ్బురపరుస్తున్నారని కొనియాడారు.
అయినా ఈ ఆధునిక యుగంలోనూ స్త్రీలను అణచి వేసే ధోరణి, అత్యాచార ఆకృత్యాలు పెరిగిపోవడం సమాజం సహించలేని వేదనను కలిగించే సంఘటనలన్నారు. ఇలాంటి దృశ్యాలను సామాజిక మాధ్యమాలు విశృంఖలంగా ప్రచా రం చేయడం దురదృష్టకరం అన్నారు. మహిళాభివృద్ధికి చేయూతనివ్వకపోయినా పర్వాలేదు గానీ వారిని అవమానపరచడం,అగౌరపరచడం మానుకోవాలని శిశికుమార్ హితవు పలికారు.