బహుముఖ ప్రతిభాశాలి దాసరి
వివేక్‌నగర్, న్యూస్‌లైన్: దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు బహుముఖ ప్రతిభాశాలి అని వక్తలు ప్రస్తుతించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, మాటలు, పాటల రచయితగా ఆయన సినీ రంగంలో తన ప్రతిభను బహుముఖీనంగా విస్తరించారని అన్నారు. దాసరి నారాయణ రావు 70వ జన్మదినోత్సవం సందర్బంగా ఫిలిం ఎనలిటికల్ అండ్ అఫ్రిసియేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం కళాసుబ్బారావు కళావేదికలో ప్రారంభమైన రెండురోజుల అభినందన ప్రసంగాల సభలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు రేలంగి నరసింహరావు మాట్లాడుతూ.. దాసరి నారాయణరావు 1973లో తాతామనవడు చిత్రంతో దర్శకుడిగా మారి 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డ్సులో తన పేరు నమోదు చేసుకున్నారని అన్నారు. వినోదాత్మక చిత్రాలతోపాటు సామాజిక, ప్రేమకథాచిత్రాలను నిర్మించి చరిత్ర సృష్టించారన్నారు.
ఎందరో నూతన నటీనటులకు, దర్శకులకు సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పించారని ఆయన వద్ద పనిచేపసిన ఎందరో నేడు ప్రముఖ దర్శకులుగా ప్రఖ్యాతి పొందారని వివరించారు. సభలో పాల్గొన్న నటులు మాడా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను నటుడిగా స్థిరపడటానికి దాసరి సినిమాలు దోహదపడ్డాయన్నారు.
ఆయన సృష్టించిన మాడా పాత్ర తన ఇంటి పేరుగా మారి పోయిందన్నారు. సభలో పాల్గొన్న సినీ పాత్రికేయులు పర్చా శరత్‌కుమార్ దాసరి సినీ రచనలపై ప్రసంగించారు. సభలో వంశీరామరాజు, సంస్థ అధ్యక్షులు కె.ధర్మారావు, సినీ దర్శకులు ఎన్.గోపాలకష్ణ, డా.కె.భాస్కరరెడ్డి, ఎస్.వి.రామారావు, ఆర్.ఎన్.సింగ్, డా.పి.కమలాప్రపాదరావు, ప్రసాదరావు, మంత్రి భుజంగరావు, కె.మూర్తి, కళాదీక్షితులు తదితరుల పాల్గొని దాసరి నిర్మాతగా నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలపై ప్రసంగించారు.