మహిళను మభ్యపెట్టి.. లైంగిక దాడి
నేరస్తుడిగా ధ్రువీకరించిన కోర్టు వచ్చేవారం జైలు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ : ఓ మహిళను పెళ్లి చేసుకొంటానని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన వివాహితుడిని కోర్టు నేరస్తుడిగా పరిగణిస్తూ, జైలు శిక్షను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు చంద్రహాస్ యాదవ్‌ను నేరస్తుడిగా ప్రకటిస్తూ బుధవారం అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ తీర్పు చెప్పారు. ‘యాదవ్.. బ్రహ్మచారినని పరిచయం చేసుకొని మహిళ పట్ల లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విజయవంతమైందని’ జడ్జి అన్నారు. ఇదే సమయంలో ‘ బ్రహ్మచారినని.. పెళ్లి చేసుకొంటానని నిందితుడు మభ్యపెట్టాడు. ఈ కారణంగానే బాధితులు నిందితుడితో శారీరక సంబంధాలకు అంగీకరించినట్లు పరిశీలనలో వెల్లడైంది. అంతేకాదు.. నిందితుడి పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి, మోసగించాలనే దురుద్దేశంతోనే బాధితురాలిని నమ్మించినట్లు కోర్టు విశ్వసించదని’ పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి ఐదు సంవత్సారాలుగా నిందితుడు యాదవ్‌తో పరిచయం ఉన్నది. ఈ క్రమంలోనే బ్రహ్మచారినని చెప్పి.. మొదటి సారిగా.. ఫిబ్రవరి 14వ తేదీ 2008లో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు... నవంబర్, 2013లో పెళ్లి అయిన నిజాన్ని వెల్లడించి, ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయాన్ని బాధితురాలు పశ్చిమ ఢిల్లీలోని దాబ్రీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 29వ తేదీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు విచారించిన కోర్టు నిందితుడు నేరం చేసినట్లుగా ప్రకటి స్తూ వచ్చే వారం జైలు శిక్ష వివరాలను వెల్లడించనున్నట్లు ప్రకటించింది.