‘పులులను’ బతకనివ్వండి
- చిత్రకళా పోటీల్లో నినదించిన చిన్నారులు
సాక్షి, బెంగళూరు : ‘వణ్య ప్రాణుల సంరక్షణను మరిచి పోతే ప్రకృతి వినాశనానికి దోహదం చేసినట్లే’, చిన్నారులంతా ముక్తకంఠంతో నినదించిన మాట ఇది. ‘వరల్డ్ టైగర్ డే’ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్ చిన్నారులకు ‘సేవ్ అవర్ టైగర్’ పేరిట చిత్రకళా పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ శాండల్‌వుడ్ నటి రమ్య ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఉత్సాహ పరిచారు.
లాల్‌బాగ్ ప్రాంగణంలోని మరిగౌడ హాల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేవలం చిత్రకళతోనే కాక ఫేస్ పెయింటింగ్‌ల ద్వారా కూడా పులుల సంరక్షణపై విద్యార్థులు చైతన్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నటి రమ్య మాట్లాడుతూ...వన్యప్రాణి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా దేశంలో పులుల సంఖ్య రోజు రోజుకూ క్షీణిస్తోందని, వేటగాళ్ల బారిన పడి ఎన్నో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ చిత్రకళా పోటీల్లో జూనియర్ విభాగంలో బీఎన్‌ఎం స్కూల్‌కు చెందిన దీప్తి మొదటి బహుమతిని గెలుచుకోగా, సీనియర్ విభాగంలో కేంద్రీయ విద్యాలయకు చెందిన శార్వరి జ్యోతి మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఎయిర్‌సెల్ కర్ణాటక విభాగం బిజినెస్ హెడ్ కె.కదిరవన్ విజేతలకు బహుమతులను అందజేశారు.