అప్ప హ్యాపీ!
శివమొగ్గ, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గెలుపు ఖాయమని గూఢచార విభాగం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. సుమారు 40 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం ఖాయమని తేల్చింది. మరో ఏజెన్సీ కూడా యడ్యూరప్ప విజయాన్ని ఖరారు చేసింది. 2009 ఎన్నికల్లో ఆయన కుమారుడు రాఘవేంద్ర 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారని, ఈసారి యడ్యూరప్పకు కూడా ఇంచు మించుగా అంతే మెజారిటీ లభించవచ్చని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
నటుడు శివ రాజ్ కుమార్ సతీమణి గీతా జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని అందరూ ముందే భావించారు. ఎన్నికలకు నెల రోజుల ముందు గూఢచార విభాగం యడ్యూరప్ప గెలవడం కష్టమని పేర్కొన్నట్లు తెలిసింది. పోలింగ్ అనంతరం ఆయనకు విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంచనా వేసింది.
నరేంద్ర మోడీ ప్రభావం, నిర్దుష్ట సామాజిక వర్గాల మద్దతు, సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ఏకతాటిపై నడవడం లాంటి అంశాలు యడ్యూరప్ప విజయానికి దోహద పడ్డాయని గూఢచార విభాగం విశ్లేషించినట్లు సమాచారం. గీతా శివ రాజ్ కుమార్ రెండో స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి మంజునాథ్ భండారీ మూడో స్థానంతో తృప్తి పడాల్సి ఉంటుందని పేర్కొంది.