'వైఎస్ కుటుంబం నుంచి నన్ను వేరు చేసే కుట్ర'
శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి తనను వేరు చేయడానికే కొన్ని పత్రికల యాజమాన్యాలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. గురువారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అవాస్తవ కథనాలతో వైఎస్‌ఆర్‌సీపీని బలహీన పర్చాలనుకుంటున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేంతవరకూ ప్రజాపోరాటాలు కొనసాగిస్తామని ధర్మాన స్పష్టం చేశారు. జగన్ సీఎం అయితే ఈ రెండేళ్లలో శ్రీకాకుళం జిల్లాకు ఎంతో మేలు జరిగేదన్నారు. బుధవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో తన ప్రసంగంలో వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించి వార్తలివ్వడంపై ధర్మాన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా అక్కడున్న పరిస్థితులకు తగినట్లు వ్యూహాత్మకంగా పార్టీని ఎలా బలపరచుకోవాలో పార్టీ కార్యకర్తలకు వివరించానన్నారు. కానీ తన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా వాటిని మరో అర్థం వచ్చేలా ఆపాదించి వార్తలు రాయడం సముచితం కాదన్నారు. వైఎస్సార్ కుటుంబంతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని ఇలాంటి ప్రయత్నాలతో తెంచేయాలనుకుంటే అది వృథా ప్రయాసే తప్ప మరొకటి కాదని హితవు పలికారు. తనపై ఇలాంటి కుట్రలు కొత్తేమీ కాదన్నారు.
పట్టంగట్టిన జిల్లాకు వెన్నుపోటు...
శ్రీకాకుళం జిల్లాకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఏమి చేశారో చెప్పగలరా? అని ధర్మాన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన 12 ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒక్కటైనా శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని నిలదీశారు.
జగన్‌లో వైఎస్సార్‌ను చూస్తున్నాం...
అభివృద్ధిలో అట్టడుగున ఉన్న శ్రీకాకుళం జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు ప్రతి కార్యక్రమంలోనూ పెద్దపీట వేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌లో చూసుకుంటున్నామని ధర్మాన చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదున్నరేళ్లలో శ్రీకాకుళం జిల్లాలో బోధనాసుపత్రి రిమ్స్, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, సాగునీటి ప్రాజెక్టులే కాదు ఆరోగ్యశ్రీ, 108 వంటి సంక్షేమ పథకాలనూ ఇక్కడి నుంచే ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు కొయ్య మోషేన్‌రాజు ఉన్నారు.