
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన నడుస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం చెన్నై వచ్చిన ధర్మాన ప్రసాదరావు ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయామని బాధపడుతున్న ప్రజలకు టీడీపీ పాలనలో ఊరట లభించకపోగా.. మరిన్ని అగచాట్లు పడాల్సి వస్తోందన్నారు. మరోవైపు గవర్నర్ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టిపోయిందన్నారు.
వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించడం కంటే దుర్మార్గమన్నారు. ‘స్పీకర్ వ్యవస్థ కూడా బ్రష్టుపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ కిందే చూపిస్తున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తుంటారు..’అని ధర్మాన మండిపడ్డారు. సింగపూర్‌కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీకి వేలాది ఎకరాలను ధారాదత్తం చేసి.. గొప్ప రాజధాని నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధులు టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని ఆరోపించారు. దీనిపై కేంద్రం దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment