ధనవంతుల కోసం పనిచేసేదే టీడీపీ ప్రభుత్వం
♦ ప్రతీ కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పాలి
♦ రానున్నది రాజన్న రాజ్యం
♦ మన ఆశాజ్యోతి జగన్
♦ పాలకొండ ప్లీనరీలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
♦ కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
సీతంపేట: రాష్ట్రాన్ని ముంచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ధనవంతుల కోసం పని చేస్తోందని మండిపడ్డారు. సీతంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వైఎస్‌ఆర్‌సీపీ పాలకొండ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలివచ్చారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి ప్రతిమకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబు హానీమూన్ పిరియడ్ అయిపోయిందన్నారు.
మూడేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. ప్రభుత్వాన్ని భరించలేని ప్రజలు ఆయన్ని ఇంటికి పంపించేయాలని అనుకుంటున్నారన్నారు. ఇటీవల తాను చాలా ప్లీనరీ సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రజలంతా చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తున్న విషయం బహిర్గతమైందన్నారు. చంద్రబాబు పాలనలో గిరిజనులకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. టీడీపీకి గిరిజన ఎమ్మెల్యేలు లేరనే కోపంతో గిరిజన సలహా సంఘాన్ని కూడా నియమించలేదని పేర్కొన్నారు. గిరిజన ఎమ్మెల్యే గిరిజన మంత్రిగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతీ కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజల తరఫున పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పార్టీ కమిటీలన్నీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బాధ్యతలు పంచుకోవాలన్నారు.
ఎన్నికలకు సిద్ధం కండి
ఇప్పటి నుంచే కార్యకర్తలు, నాయకులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. చంద్రబాబు టక్కు, టమారా, గజకర్ణ, గోకర్ణ వేషాలు వేయగల వ్యక్తి. రకరకాల ప్రలోభాలతో లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ముఖ్య మంత్రిని చేసుకోవాలి. కలిసి కట్టుగా అందరం పనిచేసి ధైర్యవంతుడైన జగనన్నకు పట్టం కట్టాలి. గిరిజనులంటే జగన్‌కు ఎనలేని ప్రేమ. నీతినిజాయితీకి మారుపేరైన కళావతికి భవిష్యత్‌లో సముచిత స్థానం వస్తుంది.
– ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు
టీడీపీని భూస్థాపితం చేయాలి
టీడీపీని భూస్థాపితం చేయాలి. గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలపై ఎమ్మెల్యే కళావతి అనునిత్యం పోరాడుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడును వ్యతిరేకిస్తూ అనేక సమావేశాల్లో సమస్యలపై కళావతి పోరాడారు. కంబాల జోగులు, కళావతిలు నీతి, నిజాయితీలకు కట్టుబడిన నాయకులు. తమ పార్టీ తరఫున గెలిచిన అరుకు ఎంపీ, పాతపట్నం ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడు పోయారు. ఇటువంటి వారికి గిరిజనులు బుద్ధి చెప్పాలి. రానున్న ఎన్నికల్లో ఐకమత్యంతో పనిచేసి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దాం.
– రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
అభివృద్ధికి అడ్డుతగులుతున్నారు
జన్మభూమి కమిటీల పేరుతో అడుగడుగున టీపీపీ నాయకులు అభివృద్ధికి అడ్డుతగులుతున్నారు. గిరిజనులు తాగు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీ జరగలేదు. ఏజెన్సీలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు ఇంకాఉన్నాయి. 8 పంచాయతీలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చకుండా ప్రభుత్వం అడ్డుతగులుతోంది. షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలంటే తప్పనిసరిగా గిరిజన సలహా మండలి ఉండాలి. దాన్ని నియమించకపోవడం విడ్డూరంగా ఉంది. ఏనుగుల సమస్యను పరిష్కరించలేదు. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు లేవు. ఐటీడీఏను టీడీపీ నాయకులు వారి కనుసన్నల్లో నడిపిస్తున్నారు. కొండపోడు పట్టాలు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఐటీడీఏలో జరుగుతున్న అవినీతిని మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదు. గిరిజన గ్రామాలకు రహదారుల్లేవు. తాగునీటి సమస్య ప్రజలను వెంటాడుతోంది.
– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలని చెప్పి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ప్రలోభాలను పక్కనబెట్టి మీతోనే ఉంటామన్న ఎమ్మెల్యే కళావతి, జోగులను అభినందిచాలి. 2019లో అత్యధిక మోజార్టీతో వీరిని గెలిపించాలి. రానున్నది రాజన్న రాజ్యం. మన ఆశాజ్యోతి జగన్.
– పాలవలస రాజశేఖరం, వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు
ప్రత్యేకహోదా కోసం పోరాటం
ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన పోరాటానికి మనమంతా మద్దతు ఇవ్వాలి. యువభేరీల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబులా అబద్ధాలాడితే జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో సీఎం అయ్యేవారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదు.
– కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే