మందస: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని పొత్తంగిలో బుధవారం ధర్మానకు పార్టీ నాయకులు, ప్రజల తరఫున ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ధర్మాన ముందుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లకు విలువ లేకుండా చేసి, ప్రజలు తిరస్కరించిన టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించి, వారికి పెత్తనం అప్పగించిన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బడుగు, బలహీన, పేద వర్గాల ప్రజలు హాయిగా జీవించారన్నారు. టీటీడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ఈ ప్రాంతాన్ని గౌతు కుటుంబీకులు సుమారు 50 ఏళ్ళ పాటు పాలించారని, పొత్తంగి, సిరిపురం గ్రామాల మధ్య గల మహేంద్రతనయ నదిపై వంతెనను నిర్మించుకోలేక పోయారని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదాపై బాబు నోరు పెగలదేం?
రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాన మంత్రి వద్ద ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నోరుమెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు పాలనలో ఆర్‌టీసీ చార్జీలు, విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువులు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. జిల్లాపై చంద్రబాబుది కపట ప్రేమేనని, ఈ జిల్లాలో గల మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి గురించి సీఎం ఎదుట మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. అనంతరం ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి, సమన్వకర్త జుత్తు జగన్నాయకులును స్థానిక వైఎస్‌ఆర్ సీపీ నాయకులు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్‌ల సమస్యలను తెలుపుతూ ధర్మాన ప్రసాదరావుకు వినతి పత్రం అందజేశారు.
వైఎస్‌ఆర్ సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
బుడారిసింగి పంచాయతీకి చెందిన లక్ష్మీపతి పట్నాయక్, కె.కామరాజుతో పాటు 10 మంది టీడీపీ కార్యకర్తలు, సోంపేట మండలం మాకన్నపురానికి చెందిన మద్దిల శివాజీ, దీనబందు సాహులు ధర్మాన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువలను వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ నేతలు రెడ్డి శాంతి, జుత్తు జగన్నాయకులు, ధర్మాన కృష్ణదాస్‌లు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, సమన్వకర్తలు నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, పలాస ఎంపీపీ కొయ్యి శ్రీనివాసరెడ్డి, పలాస జెడ్‌పీటీసీ పేడాడ భార్గవితిలక్, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షికృష్ణారావు, జెడ్‌పీటీసీ జామి జయ, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్షన్ పిలక రాజ్యలక్ష్మి, జిల్లా కార్యద్శి మెట్ట కుమారస్వామి, మండల కన్వీనర్ గున్న శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
Published Thu, Oct 29 2015 1:32 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement