లైంగికదాడి కేసులో యువకుడికి ఏడేళ్ల జైలు
Published Fri, Jan 24 2014 12:40 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడి పెళ్లికి నిరాకరించిన ప్రియుడికి ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమనంబేడు గ్రామానికి చెందిన ధనపాలన్ కుమార్తె జీవా. అదే ప్రాంతానికి చెందిన పీజీ విద్యార్థి నాగదాస్‌ల మధ్య ప్రేమ వ్యవహరం నడిచింది. 14.09.2002లో అనారోగ్యంతో ఉన్న జీవాకు, నాగ్‌దాస్ మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో గర్భం దాల్చిన జీవా, పెళ్లి చేసుకోవాలని నాగదాస్‌ను కోరింది. ఇందుకు నాగదాస్ తిరస్కరించడంతో బాధితురాలు పొన్నేరి మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును పూందమల్లి మహిళా కోర్టు విచారించిస్తున్న సమయంలో జీవా మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కవరపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
ఈ నేపథ్యంలో కేసును విచారించిన పూందమల్లి కోర్టు జీవాపై లైంగికదాడి జరిపిన కేసులో నాగదాసుకు సంబంధం లేదని తీర్పును ఇస్తూ నిం దితులను విడుదల చేసింది. అయితే పూందమల్లి కోర్టు ఇచ్చిన తీర్పులో పలు విషయాలను న్యాయమూర్తి విస్మరించారని వివరిస్తూ బాధితురాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ప్రత్యేకంగా విచారించిన హైకోర్టు, సంబంధిత కేసును పూర్తిగా విచారించడంతో పాటు జీవా కుమారుడుకి డీఎన్‌ఎ పరీక్షలు చేయించాలని ఆదేశిస్తు తిరువళ్లూరు మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కొడుక్కి డీఎన్‌ఏ పరీక్షలు చేయించడంతో పాటు, కేసును ప్రత్యేకంగా స్వీకరించి న్యాయమూర్తి మురుగన్ విచారణ చేపట్టారు. డీఎన్‌ఏలో పరీక్షలో బాలుడి తండ్రి నాగదాస్ అని తేలింది. దీంతో పాటు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు లభించడంతో నిం దితుడు నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.30 వేల అపరాధం, జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు కోర్టు తీర్పును వెలువరించింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు.
Advertisement