fast-track court
-
పోలీసుల అలసత్వంతోనే బాలికల బలి
యూపీలో గ్యాంగ్‌రేప్, హత్య ఘటనపై తల్లిదండ్రుల ఆవేదన నివేదిక కోరిన కేంద్ర హోం మంత్రి బదౌన్/లక్నో/ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా కాత్రా సదత్గంజ్ గ్రామంలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య సంఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఢిల్లీలో స్పందించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, స్థానిక పోలీసుల అలసత్వం వల్లే తమ బిడ్డల జీవితం అర్ధంతరంగా ముగిసిపోయిందని ఆ బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులతో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ బాలిక తండ్రి శుక్రవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ... ఈ కేసులో నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిందితులు ఈ నేరానికి పాల్పడేలా కాత్రా సదత్గంజ్ ఔట్‌పోస్టులోని పోలీసులు సహకరించారని ధ్వజమెత్తారు. వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే 14-15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి తమ ఇళ్ల నుంచి అదృశ్యమై మర్నాడు విగతజీవులై మామిడిచెట్టుకు వేలాడుతూ కనిపించిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఏడుగురు నిందితుల్లో సర్వేశ్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను, పప్పూ యాదవ్, అవధేశ్ యాదవ్ అనే ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. పప్పూ, అవధేశ్‌ల సోదరుడు ఊర్వేశ్ సహా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితులందర్నీ తక్షణమే అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దోషులకు తగిన శిక్ష విధించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాత్రా సదత్గంజ్ పోలీసు ఔట్‌పోస్టు ఇన్చార్జ్ రామ్‌విలాస్ యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే సర్వేశ్ యాదవ్, ఛత్రపాల్ యాదవ్ అనే కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించినట్లు జిల్లా ఎస్పీ సక్సేనా వెల్లడించారు. తక్షణ చర్యలకు ప్రత్యేక విభాగం: మేనకాగాంధీ బాలికలు, మహిళలపై అత్యాచారం వంటి ఘటనల్లో తక్షణ చర్యలు తీసుకొనేలా ప్రత్యేక విభాగం (రేప్ క్రైసిస్ సెల్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ వెల్లడించారు. బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తే సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తానని తెలిపారు. గ్యాంగ్ రేప్‌నకు గురైన బాధితుల కుటుంబ సభ్యులను శనివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించనున్నారు. మరో ఇద్దరు బాలికలపై..: ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దారుణ ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలోనే యూపీలో మరో ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అజాంగఢ్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులు పరారీలో ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. -
దర్యాప్తులో నిర్లక్ష్యం.. బాధితులకు శాపం
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసిన వారికి శిక్ష పడినప్పుడే నేరాలు...ఘోరాలు తగ్గడంతో పాటు బాధితులకు కొంతమేర ఊరట కలుగుతుంది. అయితే పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో నిందితులకు ఎలాంటి శిక్ష పడటం లేదు. దీంతో వారు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తమ కళ్లముందే నిందితులు తిరుగుతుండటం చూసి బాధితులు కుమిలిపోతున్నారు. నగరంలో గత ఆరేళ్లలో నమోదైన లైంగిక దాడి కేసులు.. నిందితులకు పడిన శిక్షలును పరిశీలిస్తే ఇదే విషయం వెల్లడవుతోంది. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఆరేళ్లలో 371 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వారున్నారు. అయితే కోర్టులో శిక్ష పడింది మాత్రం ఏడు కేసుల్లోనే, 39 కేసులు కోర్టులో వీగిపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారు. దీనిని బట్టి చూస్తే శిక్షల శాతం 15కు మించి పెరగడం లేదు. 85 శాతం కేసులు కోర్టులో వీగిపోవడం ఆందోళన కలిగించే అంశం. సంఘటన జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం, ఆ తర్వాత దర్యాప్తుకు అవసరమైన సాక్ష్యాధారాలను సరైన రీతిలో సేకరించకపోవడంతోనే నిందితులు కేసుల నుంచి సులువుగా బయటపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దరాప్తు మరింత దారుణం... శిక్షల శాతం ఇంత దారుణంగా ఉంటే.. ఇక నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో పోలీసుల పని తీరు మరింత దారుణంగా ఉంది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్లు వేయడంలేదు. ఆరేళ్లలో నమోదైన 371 కేసుల్లో కేవలం 237 కేసులకు సంబంధించి మాత్రమే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేశారు. ఇంకా 122 కేసులో దర్యాప్తు పూర్తి కాలేదు. ఉదాహరణకు 2008లో 52 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు కేసుల్లో ఇంకా చార్జిషీట్లు వేయలేదు. ఏళ్లు గడుస్తున్నా.. చార్జిషీట్కే నోచుకోక పోతే ఇక కోర్టులో విచారణ ఎప్పుడు జరుగుతుంది? నిందితులకు ఎప్పడు శిక్ష పడుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక కోర్టుకావాలి... లైంగిక దాడికి గురైన బాధితులు విచారణ సమయంలో కోర్టుకు రావడం, అందరి ముందు నిల్చుని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం సాహసోపేత చర్యే. ఢిల్లీ నిర్భయ కేసులో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసులు త్వరితగతిన చార్జిషీట్ దాఖలు చేసి.. వేగంగా విచారణ పూర్తి చేయడంతో కొద్ది నెలల్లోనే నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. నిర్భయ కేసులో తీసుకున్న చర్యలనే ఇక్కడి ప్రభుత్వం కూడా తీసుకొని తమకు బాసటగా నిలవాలని బాధితులు కోరుతున్నారు. అవినీతి నిరోధక శాఖ కేసులు, సీబీఐ కేసులు విచారణ కోసం ఉన్నట్టే లైంగికదాడి కేసుల విచారణకూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారుల్లో చలనం రావడమే కాకుండా కేసుల దర్యాప్తు, విచారణ వేగవంతం అవుతుందని, తద్వారా శిక్షల శాతం పెరిగి నేరాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. పరువు పోతుందనే భయంతో కొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రావడంలేదు. ధైర్యం చేసి వచ్చినా.. పోలీసులు వారికి న్యాయం అం దించకపోవడం దురదృష్టకరం. నిందితుల నుంచి డబ్బులు తీసుకుంటున్న పోలీసులు చార్జిషీట్‌ను బలహీనంగా, లోపభూయిష్టంగా తయారు చేస్తున్నారు. ఇదే శిక్షల శాతం తగ్గడానికి ప్రధాన కారణం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా శిక్ష వేయవచ్చని ఒక పక్క చట్టం చెప్తున్నా.. బాధితులనే సాక్షాధారాలు తీసుకురావాలని పోలీసులు వేధించడం పరోక్షంగా నిందితులకు సహకరించినట్లే అవుతుంది. శిక్షల శాతం రోజు రోజుకూ తగ్గిపోవడానికి పోలీసులే ప్రధాన కారణం. - వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల మహిళా సంఘం -
లైంగికదాడి కేసులో యువకుడికి ఏడేళ్ల జైలు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడి పెళ్లికి నిరాకరించిన ప్రియుడికి ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమనంబేడు గ్రామానికి చెందిన ధనపాలన్ కుమార్తె జీవా. అదే ప్రాంతానికి చెందిన పీజీ విద్యార్థి నాగదాస్ల మధ్య ప్రేమ వ్యవహరం నడిచింది. 14.09.2002లో అనారోగ్యంతో ఉన్న జీవాకు, నాగ్దాస్ మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో గర్భం దాల్చిన జీవా, పెళ్లి చేసుకోవాలని నాగదాస్ను కోరింది. ఇందుకు నాగదాస్ తిరస్కరించడంతో బాధితురాలు పొన్నేరి మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును పూందమల్లి మహిళా కోర్టు విచారించిస్తున్న సమయంలో జీవా మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కవరపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన పూందమల్లి కోర్టు జీవాపై లైంగికదాడి జరిపిన కేసులో నాగదాసుకు సంబంధం లేదని తీర్పును ఇస్తూ నిం దితులను విడుదల చేసింది. అయితే పూందమల్లి కోర్టు ఇచ్చిన తీర్పులో పలు విషయాలను న్యాయమూర్తి విస్మరించారని వివరిస్తూ బాధితురాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ప్రత్యేకంగా విచారించిన హైకోర్టు, సంబంధిత కేసును పూర్తిగా విచారించడంతో పాటు జీవా కుమారుడుకి డీఎన్ఎ పరీక్షలు చేయించాలని ఆదేశిస్తు తిరువళ్లూరు మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కొడుక్కి డీఎన్ఏ పరీక్షలు చేయించడంతో పాటు, కేసును ప్రత్యేకంగా స్వీకరించి న్యాయమూర్తి మురుగన్ విచారణ చేపట్టారు. డీఎన్ఏలో పరీక్షలో బాలుడి తండ్రి నాగదాస్ అని తేలింది. దీంతో పాటు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు లభించడంతో నిం దితుడు నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.30 వేల అపరాధం, జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు కోర్టు తీర్పును వెలువరించింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. -
నిర్భయ కేసులో 10న తీర్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున గతేడాది డిసెంబరులో ‘నిర్భయ’పై జరిగిన దారుణ కీచకకాండకు సంబంధించిన కేసులో ఈ నెల 10న తీర్పు వెలువడనుంది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ మంగళవారం పూర్తి అయింది. తీర్పును అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా ఈ నెల 10కి వాయిదా వేశారు. ఈ కేసు నిందితుల్లో దోషిగా తేలిన మైనర్‌కు ఇటీవల జువెనైల్ న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.