దర్యాప్తులో నిర్లక్ష్యం.. బాధితులకు శాపం
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసిన వారికి శిక్ష పడినప్పుడే నేరాలు...ఘోరాలు తగ్గడంతో పాటు బాధితులకు కొంతమేర ఊరట కలుగుతుంది. అయితే పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో నిందితులకు ఎలాంటి శిక్ష పడటం లేదు. దీంతో వారు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తమ కళ్లముందే నిందితులు తిరుగుతుండటం చూసి బాధితులు కుమిలిపోతున్నారు. నగరంలో గత ఆరేళ్లలో నమోదైన లైంగిక దాడి కేసులు.. నిందితులకు పడిన శిక్షలును పరిశీలిస్తే ఇదే విషయం వెల్లడవుతోంది.
సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఆరేళ్లలో 371 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వారున్నారు. అయితే కోర్టులో శిక్ష పడింది మాత్రం ఏడు కేసుల్లోనే, 39 కేసులు కోర్టులో వీగిపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారు. దీనిని బట్టి చూస్తే శిక్షల శాతం 15కు మించి పెరగడం లేదు. 85 శాతం కేసులు కోర్టులో వీగిపోవడం ఆందోళన కలిగించే అంశం. సంఘటన జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం, ఆ తర్వాత దర్యాప్తుకు అవసరమైన సాక్ష్యాధారాలను సరైన రీతిలో సేకరించకపోవడంతోనే నిందితులు కేసుల నుంచి సులువుగా బయటపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
దరాప్తు మరింత దారుణం...
శిక్షల శాతం ఇంత దారుణంగా ఉంటే.. ఇక నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో పోలీసుల పని తీరు మరింత దారుణంగా ఉంది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్లు వేయడంలేదు. ఆరేళ్లలో నమోదైన 371 కేసుల్లో కేవలం 237 కేసులకు సంబంధించి మాత్రమే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌లు దాఖలు చేశారు. ఇంకా 122 కేసులో దర్యాప్తు పూర్తి కాలేదు. ఉదాహరణకు 2008లో 52 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు కేసుల్లో ఇంకా చార్జిషీట్లు వేయలేదు. ఏళ్లు గడుస్తున్నా.. చార్జిషీట్‌కే నోచుకోక పోతే ఇక కోర్టులో విచారణ ఎప్పుడు జరుగుతుంది? నిందితులకు ఎప్పడు శిక్ష పడుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక కోర్టుకావాలి...
లైంగిక దాడికి గురైన బాధితులు విచారణ సమయంలో కోర్టుకు రావడం, అందరి ముందు నిల్చుని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం సాహసోపేత చర్యే. ఢిల్లీ నిర్భయ కేసులో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసులు త్వరితగతిన చార్జిషీట్ దాఖలు చేసి.. వేగంగా విచారణ పూర్తి చేయడంతో కొద్ది నెలల్లోనే నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. నిర్భయ కేసులో తీసుకున్న చర్యలనే ఇక్కడి ప్రభుత్వం కూడా తీసుకొని తమకు బాసటగా నిలవాలని బాధితులు కోరుతున్నారు. అవినీతి నిరోధక శాఖ కేసులు, సీబీఐ కేసులు విచారణ కోసం ఉన్నట్టే లైంగికదాడి కేసుల విచారణకూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారుల్లో చలనం రావడమే కాకుండా కేసుల దర్యాప్తు, విచారణ వేగవంతం అవుతుందని, తద్వారా శిక్షల శాతం పెరిగి నేరాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
పరువు పోతుందనే భయంతో కొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రావడంలేదు. ధైర్యం చేసి వచ్చినా.. పోలీసులు వారికి న్యాయం అం దించకపోవడం దురదృష్టకరం. నిందితుల నుంచి డబ్బులు తీసుకుంటున్న పోలీసులు చార్జిషీట్‌ను బలహీనంగా, లోపభూయిష్టంగా తయారు చేస్తున్నారు. ఇదే శిక్షల శాతం తగ్గడానికి ప్రధాన కారణం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా శిక్ష వేయవచ్చని ఒక పక్క చట్టం చెప్తున్నా.. బాధితులనే సాక్షాధారాలు తీసుకురావాలని పోలీసులు వేధించడం పరోక్షంగా నిందితులకు సహకరించినట్లే అవుతుంది. శిక్షల శాతం రోజు రోజుకూ తగ్గిపోవడానికి పోలీసులే ప్రధాన కారణం.
- వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల మహిళా సంఘం