City Police Commissionerate
-
‘ఉత్తరాన’ నేరాలు... ‘పశ్చిమాన’ నేరగాళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిన జరిగిన అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వారు నగరంలోని పశ్చిమ మండల పరిధిలో తలదాచుకుంటూ పోలీసులకు చిక్కుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బైరాగిపట్టి మసీదు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న ఆర్మీ మాజీ డాక్టర్ అష్వఖ్ ఆలం అరెస్టు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. వీఐపీ జోన్‌గా పరిగణించే వెస్ట్‌జోన్ అనేక సంచలనాత్మక నేరాలకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. విజయవాడకు చెందిన చలసాని పండు, అనంతపురం జిల్లాకు చెందిన మద్దెలచెర్వు సూరి, పల్లంరాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సమీప బంధువు హత్య, ఇందుకు నిదర్శనాలు. కేవలం ఈ తరహా సంచలనాలు మాత్రమే కాకుండా ఈ జోన్ ఉగ్రవాదులకు సైతం డెన్‌గా మారిపోయింది. కలిసివస్తున్న అంశాలెన్నో... నగర కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో పశ్చిమ మండలానికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా నగర వ్యాప్తంగా ఉన్న వీఐపీల్లో 80 శాతం ఈ జోన్ పరిధిలోనే ఉంటారు. మరోపక్క నగరంలో ఉన్న లైసెన్డŠస్ ఆయుధాల్లో మూడొంతులు ఇక్కడే ఉన్నాయి. అయితే ఈ వీఐపీ జోన్లో ముష్కరులు తలదాచుకునేందుకు ఉపకరించే అంశాలూ అనేకం ఉన్నాయి. ఓ పక్క ఖరీదైన ప్రాంతాలతో పాటు మధ్య తరగతి ప్రజలు నివసించే కాలనీలు, సామాన్యులు ఉండే బస్తీలు సైతం ఈ మండలంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ తరహాకు చెందిన వారైనా ఇక్కడ తేలిగ్గా ఆశ్రయం పొందే అవకాశం ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకున్న ముష్కరులు ఈ మండలాన్ని తమకు అనుకూలంగా వాడుతున్నారు. విద్య, ఉద్యోగ కారణాలు చూపిస్తూ... పశ్చిమ మండల పరిధిలో పలు విద్యాకేంద్రాలు సైతం ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు, పలు వ్యాపార, ఉద్యోగ సంస్థలు ఉన్నాయి. వీటికితోడు అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాలు విద్యా సంస్థలకు పెట్టింది పేరు. అకడమిక్ విద్యతో పాటు సాంకేతిక విద్యనూ బోధించే పలు సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన మాదాపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలున్న సైబరాబాద్ సైతం దీనికి సరిహద్దుగా ఉండటం కూడా వారికి కలిసి వస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ముష్కరులు ఆయా సంస్థల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేస్తున్నట్లు చెప్పుకుని ఈ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. దీనికితోడు వెస్ట్‌జోన్ పరిధిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు వలస వచ్చి నివసిస్తుండటంతో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ జీవనం సాగించడం తేలిగ్గా మారిపోయింది. పరారీకి మార్గాలు ఎన్నో... సిటీలో ఆశ్రయం పొందిన ముష్కరులు ఏదైనా ఘాతుకానికి పాల్పడినా, తమను ఎవరైనా అనుమానిస్తున్నారని, గమనిస్తున్నారని గుర్తించినా, పట్టుకోవడానికి వస్తున్నట్లు తెలిసినా తప్పించుకునేందుకు అవకాశాలు ఎక్కువ. ఒక్క జల మార్గం మినహా మిగిలిన అన్ని రకాల రవాణా సౌకర్యాలు, అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటాయి. వీటికితోడు వివిధ పనులపై నిత్యం నగరానికి వచ్చిపోయే ఇతర ప్రాంత, రాష్ట్రాల వారి సంఖ్య లక్షల్లో ఉండటంతో ముష్కరులు ఎవరి దృష్టిలోనూ పడకుండా తప్పించుకుని పారిపోయేందుకు అవకాశం ఉంది. వీటన్నింటికీ తోడు ఏ భాషలో మాట్లాడినా ప్రత్యేకంగా చూసే అవకాశం లేకపోవడం కూడా వారికి కలిసి వస్తోంది. కేవలం కొన్ని గంటల్లో రాష్ట్ర, నిమిషాల్లో జిల్లా సరిహద్దులను దాటే సౌలభ్యం ఉండటం కూడా వారికి షెల్టర్ జోన్లా ఉపయోగపడుతోంది. వెస్ట్‌జోన్‌కు ‘మచ్చ’ తునకలు ఇవీ.. 1992లో టోలిచౌకీలోని బృందావన్‌కాలనీలో తలదాచుకున్న ముజీబ్ మాడ్యుల్‌ను పట్టుకునేందుకు వెళ్లిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్మెన్లు హత్యకు గురయ్యారు. ఐసిస్‌తో లింకులు ఉన్నాయనే ఆరోపణలపై గత నెలలో డిపోర్టేషన్‌కు గురైన కెన్యా యువతి అమీనా నివసించింది టోలిచౌకీ ప్రాంతంలోనే. 2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అమీర్‌పేటలోని ఓ సంస్థలో విద్యార్థులుగా ‘ముసుగు’ వేసుకున్నారు. ఇదే ఉగ్రవాద సంస్థకు చెందిన మన్సూర్ అస్ఘర్ పీర్భాయ్, ఎజాజ్ షేక్ బంజారాహిల్స్‌లోని సాఫ్ట్వేర్ సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటూ, ఆ ప్రాంతంలోనే నివసించారు. గుజరాత్ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ అయిన గులాం జాఫర్ గులాం హుస్సేన్ షేక్ సుదీర్ఘకాలం హకీంపేటలోని ఐఏఎన్ కాలనీలో టైలర్‌గా ‘అజ్ఞాతవాసం’ చేస్తూ 2015లో పోలీసులకు చిక్కాడు. ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన సల్మాన్ మొహియుద్దీన్ హబీబ్‌నగర్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన వాడు. 2015లో చిక్కిన ‘ఐసిస్ త్రయం’లో ఒకడైన మాజ్ హసన్ హుమాయున్‌నగర్‌కు చెందిన వాడు. సిటీలో చిక్కిన ‘పరాయి వారు’ ఎందరో... టోలీచౌకీలోని ఈస్ట్ జానకీనగర్‌లో నివసిస్తున్న ఆర్మీ మాజీ డాక్టర్ అష్వఖ్ ఆలంను యూపీ ఏటీఎస్ అధికారులు పట్టుకెళ్లారు. ముంబై లోకల్ రైళ్లల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు నవీద్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నేరేడ్మెట్లో అరెస్టు చేశారు. బెంగళూరు వరుస పేలుళ్ల కేసులో నిందితులైన అబ్దుల్ సత్తార్, అబ్దుల్ జబ్బార్ అత్తాపూర్ పరిధిలో చిక్కారు. దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది మహ్మద్ తల్హా శ్రీ మెహదీపట్నంలో తలదాచుకున్నాడు. బీహార్ పోలీసులకు పట్టుబడిన అల్‌ఖైదా ఉగ్రవాది మీర్జా ఖాన్ అలియాస్ గులాం శ్రీరసూల్ ఖాన్ సిటీలోనే షెల్టర్ తీసుకున్నాడు. డాక్టర్ జలీస్ అన్సారీ మాడ్యుల్‌కు చెందిన మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది సయ్యద్ ముసద్ధిక్ వహీదుద్దీన్ ఖాద్రీ టోలిచౌకి ప్రాంతంలోనే నివసించాడు. కర్ణాటక పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న లష్కరేతోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ సైతం సిటీలోనే చిక్కాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్ పేలుళ్ల కేసులో నిందితులైన డానిష్ రియాజ్, అన్వర్ అలీ భగ్వాన్ చాలాకాలం నగరంలోనే తలదాచుకున్నారు. -
కనీసం.. పిల్లనివ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్ : జీతాలు పెరిగినా తమ జీవితాలు మారలేదని అంటున్నారు కానిస్టేబుళ్లు. అనేక మంది ఈ స్థాయి నుంచి ఒక్క ప్రమోషనూ లేకుండా పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్‌లో పని చేసే ఓ కానిస్టేబుల్ అనివార్య కారణాల వల్ల తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ఆంగ్లంలో లేఖ రాశారు. చార్మినార్ ఠాణాలో పని చేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ ఈ నెల7న బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ఇన్వార్డ్ సెక్షన్లో రాజీనామా లేఖను అందించారు. నగర పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి రాసిన లేఖ ఇలా... ‘నా పేరు సిద్ధాంతి ప్రతాప్ (పీసీ నెం.5662) చార్మినార్ పోలీసుస్టేషన్లో పని చేస్తున్నా. కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 2014లో కానిస్టేబుల్‌గా చేరా. పోలీసు డిపార్ట్మెంట్ మీద ఉన్న అమితాసక్తితో అడుగుపెట్టిన నేను నా విధుల్ని త్రికరణ శుద్ధితో నిర్వహిస్తున్నా. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నా. కొన్నాళ్లుగా నా సీనియర్లను పరిశీలించిన నేపథ్యంలో అనేక మంది 35 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించా. ఇలాంటి సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ లభిస్తోంది. సబ్–ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్ అలవెన్సులు వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివి మచ్చుకైనా లేవు. ప్రస్తుతం నా వయస్సు 29 ఏళ్లు కావడంతో వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా. నేను కానిస్టేబుల్ అని తెలియడంతో ఓ సంబంధం చెడిపోయింది. ఆ తర్వాత నా బంధువుల ద్వారా ఆ యువతి నన్ను తిరస్కరించడానికి కారణాలు ఏమిటని అడిగా. కానిస్టేబుళ్లు 24 గంటలూ పని చేయాల్సి వస్తుందని, సరైన బాధ్యతలకు ఆస్కారం ఉండదని, అదే హోదాలో పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని, ఆ ఉద్యోగంలో ఎదుగుబొదుగూ ఉండదని యువతి భావించినట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నేను తీవ్రంగా మనస్తాపం చెందడంతో పాటు నా ఉద్యోగం పట్ల డిప్రెస్ అయ్యా. ఈ నేపథ్యంలోనే నా రాజీనామా ఆమోదించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.’అని రాశారు. ఇబ్బందులు నిజమే... పోలీసు విభాగంలో కలకలం సృష్టించిన ఈ విషయంపై పోలీసు అధికారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సిబ్బంది సంఖ్యతో ఉన్న ఇబ్బంది వల్ల వీక్లీ ఆఫ్‌ల విధానం అమలుకావట్లేదని చెప్తున్నారు. మరోపక్క ఎస్సై, డీఎస్పీ ఆపై పోస్టులు రిక్రూట్మెంట్ ప్రతి బ్యాచ్‌లోనూ గరిష్టంగా 500లోపే జరుగుతుంది. అందుకే వీరి సర్వీసులో పదోన్నతులు తేలిగ్గా లభిస్తాయి. కానిస్టేబుళ్ల ఎంపిక ఒక్కో బ్యాచ్‌కు వేల సంఖ్యలో ఉంటుంది. ఆ స్థాయిలో పై పోస్టులు ఉండవు. అందుకే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తయారు చేసిన మెరిట్ జాబితా ఆధారంగా పదోన్నతులు వచ్చినా అనేక మంది కానిస్టేబుల్‌గానే రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ వారిని ఇబ్బంది పెడుతున్నాయి అని ఓ అధికారి అన్నారు.ప్రస్తుతం పోలీసు విభాగంలో వారికి లభిస్తున్న జీతం ఆధారంగా చూస్తే గరిష్టంగా రూ.1 లక్ష వరకు నెలసరి తీసుకునే కానిస్టేబుళ్లు ఉన్నారని, పదోన్నతులు రాకపోయినా ఇంక్రిమెంట్లు మాత్రం ఆగవన్నారు. ప్రతాప్ రాజీనామాను ఆమోదించే ఆలోచన లేదని, అతనికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. -
అదిరిపోయే రీతిలో పోలీస్ టవర్స్
ట్విన్ టవర్స్ పనుల్లో కదలిక... ఎర్త్‌వర్క్ కాంట్రాక్టు అప్పగింత పనులు పూర్తి ప్రతి 21 రోజులకు ఓ శ్లాబ్ పడేలా ప్రణాళిక 20 అంతస్తులు...83.4 మీటర్ల ఎత్తుతో ఐసీసీసీ అత్యాధునిక హంగులతో నిర్మాణం గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి! సాక్షి, సిటీబ్యూరో: ‘ట్విన్ టవర్స్’ పేరుతో నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్, ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) నిర్మాణం పనులు వచ్చే వారం ప్రారంభంకానున్నాయి. ప్రాథమికంగా రాళ్ళ తొలగింపు, భూమి చదును తదితర ఎర్త్వర్క్స్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దీని నిర్మాణానికి సివిల్ ఏవియేషన్, మున్సిపల్ శాఖల నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో గరిష్టంగా రెండు నెలల్లో భవన నిర్మాణానికీ శ్రీకారం చుట్టనున్నారు. రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ ట్విన్ టవర్స్ నగరంలోనే అతి ఎల్తైన భవనంగా రికార్డులకు ఎక్కనుంది. నిర్ణీత కాలంలో, ప్రణాళికా బద్ధంగా, అందరికీ ఉపయుక్తంగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. 83.4 మీటర్లకు పరిమితం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్ ప్రాంతంలో 15 మీటర్లకు మించిన ఎత్తులో భవనాల నిర్మాణాలు జరపకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి ఆ శాఖ అనుమతిచ్చింది. మరోపక్క ఇంత ఎల్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసులు ఆ శాఖకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 83.4 మీటర్ల ఎత్తు నిర్మించుకోవడానికి సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి సమాయత్తమైంది. ఎర్త్‌వర్క్‌ను వేరుచేసి వేగంగా... ఈ ట్విన్ టవర్స్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఆహ్వానించడం, వాటిని పరిశీలించడం, కాంట్రాక్టు అప్పగించడం తదితర వ్యవహారాలన్నింటినీ రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ భవనాల నిర్మాణాలు చేపట్టడానికి గరిష్టంగా రెండు నెలల కాలం పట్టే అవకాశం ఉంది. అప్పుడైనా తొలుత భూమి చదునుకు సంబంధించిన పనులతో ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాలయాపన జరుగకుండా ఎర్త్ వర్క్‌ను వేరుచేసి, మరో టెండర్‌ను ఆహ్వానించారు. దీన్ని ఓ ప్రైవేట్ సంస్థ దక్కించుకోవడంతో వచ్చే వారం పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఆ స్థలంలో ఉన్న రాళ్ళ తొలగింపు, నేల చదును చేయడం తదితర పనుల్ని పూర్తి చేసే ఈ సంస్థ నిర్ణీత కాలంలో పోలీసు విభాగానికి అప్పగిస్తుంది. ఈ లోపు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు, ఇతర ప్రక్రియలు పూర్తి కావడంతో తక్షణం నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రతి 21 రోజులకు ఒక శ్లాబ్... లండన్, న్యూయార్క్ తరహాలో ఉత్తమంగా తయారయ్యే ఈ ఐసీసీసీ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి చేయించడానికి పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. ఆద్యంతం ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతి 21 రోజులకు ఒక స్లాబ్ చొప్పున పూర్తి చేస్తూ గరిష్టంగా రెండేళ్ళ కాలంలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.1002 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధునాత హంగులు... ♦ ఈ ఐసీసీసీని పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్‌తో నిర్మించనున్నారు. ♦ టవర్స్‌లో ఉండే సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ. ♦ భవనం పైన హెలీప్యాడ్, భవనంలో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం. ♦ 900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి. ♦ పోలీసు శాఖకు చెందిన అన్ని విభాగాలూ ఒకే చోటకు.. ♦ కేవలం నగర పోలీసులకే కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఇందులో భాగస్వామ్యం. ♦ భవనం 18వ అంతస్తులో నగర పోలీసు కమిషనర్ అధికారిక కార్యాలయం ఏర్పాటు. -
కంట్రోల్ రూమ్‌కు అదనపు సిబ్బంది
విజయవాడ : విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌ను అంచెలంచెలుగా బలోపేతం చేస్తున్నారు. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ పోలీస్ వ్యవస్థను పరోక్షంగా నడుపుతున్న కంట్రోల్ రూమ్ బలోపేతంపై నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తాజాగా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. తద్వారా మరికొన్ని ప్రత్యేక సేవలు అందించాలని భావిస్తున్నారు. అదనంగా 53 మంది కేటాయింపు కమిషనరేట్ బలోపేతంలో భాగంగా కొత్త వింగ్‌లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కోసం 471 మంది సిబ్బందిని కేటాయించారు. వారితో పాటు మరో 378 మంది కానిస్టేబుళ్లను డిప్యుటేషన్‌పై తీసుకురానున్నారు. వారిలో 53 మంది కానిస్టేబుళ్లను కంట్రోల్ రూమ్‌కు కేటాయించనున్నారు. మాస్టర్ కంట్రోల్ రూమ్‌గా సేవలు విజయవాడ నగరంలో ల్యాండ్ మార్క్‌గా నిలిచే పోలీస్ కంట్రోల్ రూమ్ కమిషనరేట్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారింది. కమిషనరేట్‌లో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వస్తుంది. ఆ వెంటనే సిబ్బంది దానిని ఏసీపీ స్థాయి అధికారి నుంచి కమిషనర్ వరకు చేరవేస్తారు. దీంతో పాటు సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇచ్చి గంట తర్వాత అప్డేట్ సమాచారం కూడా తీసుకుంటారు. వీటితోపాటు ఇతర సేవలను కూడా కంట్రోల్ రూమ్ సిబ్బంది కొనసాగిస్తున్నారు. వాస్తవానికి కంట్రోల్ రూమ్‌ను గతేడాదే కొంత అభివృద్ధి చేసి, దానికి మరమ్మతులు నిర్వహించారు. ప్రత్యేక చాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అదనంగా సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో సీఐతో కలిపి 45 మంది సిబ్బంది రోజూ మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కార్యకలాపాల్ని సీఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుండగా నలుగురు ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు 24 గంటలూ షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నగరంలో బ్లూకోట్స్ వాహనాల సంచారం, రక్షక్ వాహనాల కదలికలను మానిటరింగ్ చేసి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సూచనలు కంట్రోల్ రూమ్ ద్వారా చేస్తుంటారు. నైట్ రౌండ్స్, పెట్రోలింగ్, వివిధ సందర్భాల్లో స్టేషన్లను అప్రమత్తం చేయటం తదితర పనులు కంట్రోల్ రూమ్ ద్వారా జరుగుతున్నాయి. ఫిర్యాదుల వెల్లువ రెగ్యులర్ విధులతో పాటు కంట్రోల్ రూమ్‌లోనే డయల్ 100ను మానిటరింగ్ చేస్తారు. నెలకు సగటున 3500కు పైగా వివిధ రకాల ఫిర్యాదులు అందుతున్నాయి. కమిషనరేట్ పోలీసులు నిర్వహిస్తున్న ఫోర్త్ లయన్ యాప్ ద్వారా నెలకు 150 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పూర్తిగా కంట్రోల్ రూమ్ పోలీసులే పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో పని భారం పెరగటంతో పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో అదనంగా 53 మంది సిబ్బందిని కేటాయించి సీఐతో పాటు ఒక ఏసీపీ స్థాయి అధికారి పూర్తిగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
బలోపేతం
471 పోస్టులు మంజూరు జాయింట్ కమిషనర్ పోస్టుకూ గ్రీన్‌సిగ్నల్ మరో రెండు ట్రాఫిక్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ స్టేషన్ రాక పోలీసులపై వత్తిడి తగ్గించేందుకే విజయవాడ : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 2095 మందికి అనదంగా మరో 471 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. విజయవాడ రాజధానిగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి సమయం ఇక్కడే ఉంటున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు వీవీఐపీలు తరచుగా నగరానికి వస్తున్నారు. ప్రధానమైన ప్రభుత్వ శాఖలన్నీ తమ కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. నిఘా కోసం, బందోబస్తు కోసం.. ఉన్న కొద్దిపాటి సిబ్బందిని కేటాయించడం ఉన్నతాధికారులకు తలకు మించిన భారంగా మారింది. వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. నగరంలో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. వైట్ కాలర్, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో జోన్ల పునర్వ్యవస్థీకరణ కొత్తగా వచ్చిన పోస్టుల ప్రకారం ప్రస్తుతం ఉన్న నాలుగు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లకు అదనంగా మరో రెండు స్టేషన్లు రానున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్లను పునర్వ్యవస్థీకరిస్తారు. స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్‌లను బలోపేతం చేస్తారు. కొత్త పోస్టులు ఇవే ఒక అడిషనల్ కమిషనర్, ఒక జాయింట్ కమిషనర్ , ఇద్దరు డెప్యూటీ కమిషనర్లు, ఒక ఎస్పీ లేదా డెప్యూటీ కమిషనర్, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు (ఏసీపీలు), 15 మంది సీఐలు, 27 మంది ఎస్ఐలు, 12 మంది ఏఎస్ఐలు, 91 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 288 మంది పోలీసు కానిస్టేబుళ్లు ఇప్పుడు ఉన్న సిబ్బందికి అదనంగా రానున్నారు. వీరేకాకుండా ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ స్టెనో, ముగ్గురు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్లు, ఆరుగురు ఆఫీసు సబార్డినేట్లు (అటెండర్లు) రానున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది కొంత ఊపిరి పీల్చుకునేందుకు వీలుంటుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సిటీ సెక్యూరిటీ వింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ 583 మంది సిబ్బందితో ఏర్పాటు విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో 583 మంది సిబ్బందితో సిటీ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డెప్యూటీ కమిషనర్ కేడర్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. ఈ వింగ్‌లో ఒక డీసీపీ, ఒక ఏడీసీపీ, నలుగురు సీఐలు, 41 మంది ఎస్సైలు, 11 మంది ఏఎస్సైలు, 40 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 345 మంది కానిస్టేబుళ్లు, 79 మంది పోలీస్ డ్రైవర్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. కార్యాలయంలో విధుల కోసం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఒకరు, సూపరిటెండెంట్లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, ఇంటెలిజెన్స్ విభాగం మేనేజర్ ఒకరు, అసిస్టెంట్ మేనేజర్లు ముగ్గురు, ఐడీ అసిస్టెంట్లు ముగ్గురు, డీటీపీ ఆపరేటర్లు ఇద్దరు, ఆఫీస్ సబార్డినేట్లు ఇద్దరు, అవుట్ సోర్సింగ్ స్వీపర్లు 10 మందిని నియమించుకోవటానికి అనుమతి ఇచ్చారు. -
క్రిమినల్స్‌కు రెక్కలు!
దుబాయ్‌కి పరారవుతున్న ఘరానా నేరగాళ్లు పొరుగు రాష్ట్రాల నుంచి మారుపేర్లతో పాస్పోర్ట్స్ మొన్న అయూబ్ ఖాన్, తాజాగా స్నాచర్ ఖలీఫా సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న, నాన్-బెయిలబుల్ వారెంట్లు పెం డింగ్‌లో ఉన్న ఘరానా నేరగాళ్లు పరారవుతున్నారు. పొరుగు జిల్లాకో, రాష్ట్రానికో కాదు... ఏకంగా దేశం దాటేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మారుపేర్లతో పాస్‌పోర్టులు తీసుకొని ఎగిరిపోతున్నారు. మొన్నటికి మొన్న కాలాపత్తర్ రౌడీషీటర్ అయూబ్ ఖాన్ దుబాయ్ వెళ్లిపోగా... తాజాగా శాలిబండకు చెందిన ఘరానా స్నాచర్ ఖలీఫా కూడా అక్కడికే చేరుకున్నట్లు సిటీ కాప్స్ గుర్తించాయి. షెల్టర్ జోన్స్ నుంచి ‘గుర్తింపులు’... సిటీకి చెందిన అనేక మంది నేరగాళ్లకు మహారాష్ట్ర, కర్ణాటకల్లో షెల్టర్స్ జోన్ ఉన్నాయి. ఇక్కడ నేరం చేసినప్పుడో, పోలీసుల నిఘా/వేట ముమ్మరమైనప్పుడో అక్కడికి వెళ్లి తలదాచుకోవడం వీరికి పరిపాటి. ప్రధానంగా నాందేడ్, గుల్బర్గా తదితరా ప్రాంతాల్లో ఈ షెల్టర్లు ఉంటున్నాయి. కొంతకాలం క్రితం వరకు ఈ ప్రాంతాలను తలదాచుకోవడానికి వినియోగించుకున్న నేరగాళ్లు తాజాగా, నకిలీ పేర్లతో అక్కడి చిరునామాలతో గుర్తింపు పత్రాలు తీసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకటి వస్తే చాలు ఇక అన్నీ... వివిధ రకాలైన గుర్తింపు పత్రాల జారీలో ఉన్న లోపాలు, పూర్తి స్థాయిలో క్రాస్ చెకింగ్ మెకానిజం లేకపోవడం ఈ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్... ఇలా ఏ ఒక్క గుర్తింపు పత్రాన్ని తీసుకున్నా మిలినవి తీసుకోవడం చాలా తేలికగా మారిపోయింది. దీంతో ఒకదాని వెంట మరోటి చొప్పున గుర్తింపు పత్రాలను తీసుకుంటున్న నేరగాళ్లు వాటి ఆధారంగా బోగస్ పేర్లతో పాస్‌పోర్టులు సైతం పొందుతున్నారు. అక్కడి పోలీసు రికార్డుల ప్రకారం వీరు నేరగాళ్లు కాకపోవడం, ఇక్కడ నేరగాళ్లనే విషయం వారికి తెలియకపోవడంతో తేలిగ్గా వెరిఫికేషన్ సైతం పూర్తయి పాస్‌పోర్టులు నేరగాళ్ల చేతికి చేరుతున్నాయి. వీటిని వినియోగించే విదేశాలకు పారిపోతున్నారని నగర పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీషీటర్ అయూబ్ ఖాన్ విశాఖపట్నం నుంచి పాస్‌పోర్ట్ పొందాడని నిర్థారణ కాగా... ఖలీఫా ఉత్తరాది నుంచి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నగర పోలీసులు నేరగాళ్లు ఇలా ఎగిరిపోతున్న విధానంతో పాటు దుబాయ్ కేంద్రంగా వీరు సాగిస్తున్న కార్యకలాపాలనూ లోతు గా ఆరా తీస్తున్నారు. అయూబ్ ఖాన్: ఫతేదర్వాజా ప్రాంతానికి చెం దిన అయూబ్ ఖాన్ 1990లో హుస్సేనీఆలంలో నేరజీవి తాన్ని ప్రారంభిం చా డు. అదే ఏడాది దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో 1991లో హుస్సేనీఆలం పోలీసులు హిస్టరీ షీట్ తెరి చారు. అయూబ్ కాలాపత్తర్‌లోని తాడ్‌బండ్‌కు మకాం మార్చడంతో ఈ షీట్‌ను ఆ ఠాణాకు బదిలీ చేశారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, అక్రమం గా ఆయుధాలు కలిగి ఉండటం తదితర ఆరోపణలపై నగరంలో వివిధ పోలీసుస్టేషన్లలో 48 కేసులు నమోదు కావడంతో గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటూ బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖలీఫా: శాలిబండలోని అలియాబాద్‌కు చెందిన మహ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ అఖీల్ అలియాస్ ఖలీఫా పేరు మోసిన స్నాచర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఇతడు ఇప్పటి వరకు 83 సార్లు పోలీ సులకు చిక్కి జైలుకెళ్లాడు. ఎస్సార్‌నగర్, పంజగుట్ట, టప్పాచబుత్ర, హుమాయూన్‌నగర్, ఛత్రినాక, సుల్తాన్‌బజార్, చిక్కడపల్లి, మలక్‌పేట, నల్లకుంట, అంబర్‌పేట, కాచి గూడ, సైదాబాద్, మహంకాళి, అఫ్జల్‌గంజ్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతగాడు దుబాయ్‌కి పారిపోయాడు. -
కమిషనరేట్‌కు కొత్తకళ
- బహుళ అంతస్తు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు - కార్యాలయాలు, అధికారులకు భవనాలు - సర్వే చేపట్టిన కోస్టల్ ల్యాండ్ సంస్థ - నెలరోజుల్లో స్పష్టత - అధునాతన భవనాలకు ప్రతిపాదనలు విజయవాడ సిటీ: నగర పోలీసు కమిషనరేట్‌ను ఆధునీకరించేందుకు పోలీసుశాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం కమిషనరేట్ ప్రాంగణంలో అధునాతన భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమిషనరేట్ ఆధునీకరణపై సర్వేకు ఉన్నత స్థాయి ఆదేశాలు వచ్చాయి. కోస్టల్ లాండ్ సర్వే సంస్థ కమిషనరేట్ స్వరూప స్వభావాలపై సర్వే చేస్తోంది. కమిషనరేట్‌లో అధికారులు, విభాగాల సంఖ్య పెరిగింది. ఇందుకు అనుగుణంగా అవసరమైన భవనాలు అందుబాటులో లేవు. 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న కమిషనరేట్‌లో నగర పోలీసు కమిషనర్ కార్యాలయం, బంగ్లాతో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, స్పెషల్ బ్రాంచి, ఫింగర్ ప్రింట్ విభాగాలు ఉన్నాయి. ప్రారంభంలో ప్రస్తుతం శాంతి భద్రతల డీసీపీ కార్యాలయం వేదికగా అర్బన్ ఎస్పీ, ఆ తర్వాత పోలీసు కమిషనర్ విధులు నిర్వహించేవారు. ఆ తర్వాత 1999లో నగర పోలీసు కమిషనర్ కోసం కొత్త కార్యాలయం ఏర్పాటు చేసి సీపీ కార్యాలయాన్ని డీసీపీకి కేటాయించారు. ఇటీవల కాలంలో పరిపాలనా విభాగం డీసీపీతో పాటు వివిధ విభాగాలకు అదనపు డీసీపీలను నియమించారు. ఇక్కడ తగిన వసతులు లేకపోవడంతో ట్రాఫిక్ విభాగాన్ని మహాత్మాగాంధీ రోడ్డులోని కె.ఎస్.వ్యాస్ కాంప్లెక్స్‌కు మార్చారు. చాలీ చాలని వసతులతో వివిధ విభాగాల అధికారులు ఉన్న భవనాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనరేట్‌ను ఆధునీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కమిషనరేట్ ప్రాంగణంలోని ఇప్పుడున్న భవనాల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. రాజధాని అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాలను ఇక్కడ నిర్మించేందుకు నిర్ణయించారు. కమిషనరేట్‌కు మూడు వైపులా రహదారులు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అధికారులందరికి అవసరమైన కార్యాలయాలతో పాటు ఉన్నతాధికారుల నివాస భవనాలు కూడా నిర్మించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఫలించిన ప్రయోగాలు
గణనీయంగా తగ్గిన స్నాచింగ్‌లు గతేడాది మొదటి నాలుగు నెలల్లో 220 కేసులు ఈ ఏడాది 103 మాత్రమే నమోదు చైన్స్నాచర్లపై పీడీ యాక్ట్ నమోదే ప్రధాన కారణం సిటీబ్యూరో: నేరాల నివారణ కోసం నగర పోలీసులు చేస్తున్న సరికొత్త ప్రయోగాలు ఫలితాలిస్తున్నాయి. చైన్‌స్నాచింగ్‌లు గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 2013 (జనవరి నుంచి ఏపిల్)్రలో 265 స్నాచింగ్ కేసులు నమోదు కాగా... 2014లో 220కి తగ్గాయి. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 103కు తగ్గింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాధారణంగా నేరాలు కూడా పెరుగుతుంటాయి. అయితే చైన్‌స్నాచింగ్‌ల విషయంలో మాత్రం పెరగాల్సిన కేసులను మరింత తగ్గించగలిగారు. కరుడుగట్టిన 33 మంది చైన్ స్నాచర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పీడీ యాక్ట్) ప్రయోగించడంతో పాటు మరో 70 మంది స్నాచర్లను జైళ్లకు పంపడమే ఇందుకు కారణం. నగర పోలీసు కమిషనర్‌గా గతేడాది జూన్ 2న బాధ్యతలు చేపట్టిన ఎం.మహేందర్ హైదరాబాద్‌ను నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగానే చైన్స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించారు. గతంలో కేవలం కరుడు గట్టిన రౌడీషీటర్లపైనే పీడీయాక్ట్ ప్రయోగించేవారు. అయితే, తొలిసారిగా మహేందర్‌రెడ్డి చైన్స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించే కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. గడిచిన 10 నెలల కాలంలో కరుడుగట్టిన 33 మంది స్నాచర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైలులో ఉన్నారు. ఏడాది పాటు వీరంతా అక్కడ ఉండాల్సిందే. గతంలో చైన్స్నాచర్లను అరెస్టు చేసి జైలుకు పంపితే ఒకటి రెండు రోజుల్లోనే వారికి బెయిల్ వచ్చేది. బెయిల్‌పై బయటకు వచ్చిన వారు మళ్లీ నేరాలు మొదలుపెట్టేవారు. దీన్ని పసిగట్టిన మహేందర్‌రెడ్డి వారికి బెయిల్ లభించకుండా ఉండేందుకు పీడీ యాక్ట్‌ను ఆయుధంగా చేసుకోవడంతో స్నాచింగ్‌లు తగ్గుతున్నాయి. గతంలో నగరంలోని 60 శాంతి భద్రతల పోలీసుస్టేషన్ల పరిధిలో రోజుకు రెండు చొప్పున స్నాచింగ్‌లు జరగగా.. ఇప్పుడు ఒకటి చొప్పున జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో స్నాచింగ్‌లను పూర్తిగా నివారిస్తామని పోలీసులంటున్నారు. పీడీ యాక్ట్ నమోదైన చైన్‌స్నాచర్లు వీరే... ఈస్ట్‌జోన్: మహ్మద్ సైఫుద్దీన్, మహ్మద్ ఇమ్రాన్, సయ్యద్ముజీబ్. సౌత్‌జోన్: షరీఫ్, అహ్మదుద్దీన్ సిద్దిఖ్, జావేద్, సాలమ్జాబ్రీ, పి.లక్ష్మణ్, సంతోష్‌కుమార్, ఎం.భాస్కర్, సయ్యద్అబ్దుల్మాజీద్, సయ్యద్ అస్లమ్. సెంట్రల్‌జోన్: మహ్మద్‌అమీర్, దాసరి సురేందర్, షేక్‌సలీం, నరేష్బాల్కీ, జి.విజయ్కుమార్చౌదరి, మహ్మద్ఫైసల్, సయ్యద్‌ఇమ్రాన్, అబ్దుల్బిన్హాజీ. వెస్ట్‌జోన్: మహ్మద్ఫైసల్, ఇర్ఫాన్‌ఖాన్, ఖాజాఫరీదుద్దీన్, మహ్మద్అబ్దుల్గఫూర్, మహ్మద్మెహరాజ్, మహ్మద్అఫ్రోజ్, మహ్మద్ఇఫ్తేకర్, మహ్మద్ఫైసల్షాఅలీజాబ్రీ, మహ్మద్ఫర్హాన్, బి.జైకిషోర్సింగ్, వెంకటేష్. నార్త్‌జోన్: మహ్మద్‌ఖలీల్, మహ్మద్ముజీబ్అహ్మద్ మరింత తగ్గిస్తాం బంగారు నగలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీసులకు అండగా ఉంటారు. మేము తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత మూడేళ్లలో చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి. రానున్న రోజుల్లో నేరాలను మరింత తగ్గిస్తాం. ఎక్కడైనా స్నాచింగ్ జరిగితే కేవలం నెలరోజుల్లోనే నిందితుడ్ని గుర్తించి బాధితులకు న్యాయం చేస్తాం. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్‌పరిధిలో సీసీ కెమెరాల ప్రాజెక్ట్ వర్క్ చురుగ్గా జరుగుతోంది. - మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
దర్యాప్తులో నిర్లక్ష్యం.. బాధితులకు శాపం
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసిన వారికి శిక్ష పడినప్పుడే నేరాలు...ఘోరాలు తగ్గడంతో పాటు బాధితులకు కొంతమేర ఊరట కలుగుతుంది. అయితే పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో నిందితులకు ఎలాంటి శిక్ష పడటం లేదు. దీంతో వారు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తమ కళ్లముందే నిందితులు తిరుగుతుండటం చూసి బాధితులు కుమిలిపోతున్నారు. నగరంలో గత ఆరేళ్లలో నమోదైన లైంగిక దాడి కేసులు.. నిందితులకు పడిన శిక్షలును పరిశీలిస్తే ఇదే విషయం వెల్లడవుతోంది. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఆరేళ్లలో 371 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వారున్నారు. అయితే కోర్టులో శిక్ష పడింది మాత్రం ఏడు కేసుల్లోనే, 39 కేసులు కోర్టులో వీగిపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారు. దీనిని బట్టి చూస్తే శిక్షల శాతం 15కు మించి పెరగడం లేదు. 85 శాతం కేసులు కోర్టులో వీగిపోవడం ఆందోళన కలిగించే అంశం. సంఘటన జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం, ఆ తర్వాత దర్యాప్తుకు అవసరమైన సాక్ష్యాధారాలను సరైన రీతిలో సేకరించకపోవడంతోనే నిందితులు కేసుల నుంచి సులువుగా బయటపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దరాప్తు మరింత దారుణం... శిక్షల శాతం ఇంత దారుణంగా ఉంటే.. ఇక నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో పోలీసుల పని తీరు మరింత దారుణంగా ఉంది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్లు వేయడంలేదు. ఆరేళ్లలో నమోదైన 371 కేసుల్లో కేవలం 237 కేసులకు సంబంధించి మాత్రమే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేశారు. ఇంకా 122 కేసులో దర్యాప్తు పూర్తి కాలేదు. ఉదాహరణకు 2008లో 52 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు కేసుల్లో ఇంకా చార్జిషీట్లు వేయలేదు. ఏళ్లు గడుస్తున్నా.. చార్జిషీట్కే నోచుకోక పోతే ఇక కోర్టులో విచారణ ఎప్పుడు జరుగుతుంది? నిందితులకు ఎప్పడు శిక్ష పడుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక కోర్టుకావాలి... లైంగిక దాడికి గురైన బాధితులు విచారణ సమయంలో కోర్టుకు రావడం, అందరి ముందు నిల్చుని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం సాహసోపేత చర్యే. ఢిల్లీ నిర్భయ కేసులో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసులు త్వరితగతిన చార్జిషీట్ దాఖలు చేసి.. వేగంగా విచారణ పూర్తి చేయడంతో కొద్ది నెలల్లోనే నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. నిర్భయ కేసులో తీసుకున్న చర్యలనే ఇక్కడి ప్రభుత్వం కూడా తీసుకొని తమకు బాసటగా నిలవాలని బాధితులు కోరుతున్నారు. అవినీతి నిరోధక శాఖ కేసులు, సీబీఐ కేసులు విచారణ కోసం ఉన్నట్టే లైంగికదాడి కేసుల విచారణకూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారుల్లో చలనం రావడమే కాకుండా కేసుల దర్యాప్తు, విచారణ వేగవంతం అవుతుందని, తద్వారా శిక్షల శాతం పెరిగి నేరాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. పరువు పోతుందనే భయంతో కొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రావడంలేదు. ధైర్యం చేసి వచ్చినా.. పోలీసులు వారికి న్యాయం అం దించకపోవడం దురదృష్టకరం. నిందితుల నుంచి డబ్బులు తీసుకుంటున్న పోలీసులు చార్జిషీట్‌ను బలహీనంగా, లోపభూయిష్టంగా తయారు చేస్తున్నారు. ఇదే శిక్షల శాతం తగ్గడానికి ప్రధాన కారణం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా శిక్ష వేయవచ్చని ఒక పక్క చట్టం చెప్తున్నా.. బాధితులనే సాక్షాధారాలు తీసుకురావాలని పోలీసులు వేధించడం పరోక్షంగా నిందితులకు సహకరించినట్లే అవుతుంది. శిక్షల శాతం రోజు రోజుకూ తగ్గిపోవడానికి పోలీసులే ప్రధాన కారణం. - వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల మహిళా సంఘం