పోలీసుల అలసత్వంతోనే బాలికల బలి
యూపీలో గ్యాంగ్‌రేప్, హత్య ఘటనపై తల్లిదండ్రుల ఆవేదన
నివేదిక కోరిన కేంద్ర హోం మంత్రి
బదౌన్/లక్నో/ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా కాత్రా సదత్‌గంజ్ గ్రామంలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య సంఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఢిల్లీలో స్పందించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, స్థానిక పోలీసుల అలసత్వం వల్లే తమ బిడ్డల జీవితం అర్ధంతరంగా ముగిసిపోయిందని ఆ బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులతో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ బాలిక తండ్రి శుక్రవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ... ఈ కేసులో నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిందితులు ఈ నేరానికి పాల్పడేలా కాత్రా సదత్‌గంజ్ ఔట్‌పోస్టులోని పోలీసులు సహకరించారని ధ్వజమెత్తారు. వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే 14-15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి తమ ఇళ్ల నుంచి అదృశ్యమై మర్నాడు విగతజీవులై మామిడిచెట్టుకు వేలాడుతూ కనిపించిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఏడుగురు నిందితుల్లో సర్వేశ్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను, పప్పూ యాదవ్, అవధేశ్ యాదవ్ అనే ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.
పప్పూ, అవధేశ్‌ల సోదరుడు ఊర్వేశ్ సహా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితులందర్నీ తక్షణమే అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దోషులకు తగిన శిక్ష విధించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాత్రా సదత్‌గంజ్ పోలీసు ఔట్‌పోస్టు ఇన్‌చార్జ్ రామ్‌విలాస్ యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే సర్వేశ్ యాదవ్, ఛత్రపాల్ యాదవ్ అనే కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించినట్లు జిల్లా ఎస్పీ సక్సేనా వెల్లడించారు.
తక్షణ చర్యలకు ప్రత్యేక విభాగం: మేనకాగాంధీ
బాలికలు, మహిళలపై అత్యాచారం వంటి ఘటనల్లో తక్షణ చర్యలు తీసుకొనేలా ప్రత్యేక విభాగం (రేప్ క్రైసిస్ సెల్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ వెల్లడించారు. బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తే సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తానని తెలిపారు. గ్యాంగ్ రేప్‌నకు గురైన బాధితుల కుటుంబ సభ్యులను శనివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించనున్నారు.
మరో ఇద్దరు బాలికలపై..: ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దారుణ ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలోనే యూపీలో మరో ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అజాంగఢ్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులు పరారీలో ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు.