పెళ్లి ఆపేశారు.. మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
► పెళ్లి రద్దు ఒత్తిళ్లతో మహిళ టెక్కీ ఆత్మహత్య
► జాతకం బాగాలేదని అబ్బాయి తరపు నుంచి సూటిపోటి మాటలు
► తట్టుకోలేక తీవ్ర నిర్ణయం
► మృతురాలు ప్రముఖ సంస్ధలో టీంలీడర్
బొమ్మనహళ్లి : నిశ్చితార్థం అయ్యింది, తర్వలో మూడు ముళ్ల వేడుక జరగాల్సి ఉంది. అంతలోనే పెళ్లి రద్దు చేసుకోవాలని అబ్బాయి తరపు వారు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఒక మహిళా ఇంజనీరు ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర పోలిస్ స్టేషన్ పరిధిలోని ఐడీయల్ హోంటౌన్ షిప్‌లో చోటు చేసుకుంది. మృతురాలిని నాగలక్ష్మి (32)గా గుర్తించారు. పోలీసుల కధనం మేరకు... టౌన్‌షిఫ్‌లో నివాసముండే దేవానంద్ కుమార్తె నాగలక్ష్మి బెంగళూరు సిస్కో ఐటీ కంపెనీలో టీంలీడర్‌గా పనిచేస్తున్నారు . ఆమెకు బెంగళూరులోనే నివాసముంటూ , హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నా కార్తీక్‌తో పెళ్ళి నిశ్చయమైంది . గతేడాది నిశ్చతార్థం జరిపించారు. మే 29వ తేదీన పెళ్లికి ముహూర్తం కుదిరింది. నాగలక్ష్మి కుటుంబం సభ్యులు పెళ్ళి కోసం అన్ని ఎర్పాట్లు చేసుకుంటున్నారు .
అబ్బాయి తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడని...
20రోజుల క్రితం కార్తీక్ తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇందుకు నాగలక్ష్మి కారణమని , ఆమె జాతకం సరిగా లేదని , నిశ్చితార్థానికి అయిన ఖర్చు మొత్తం వెనక్కు ఇస్తామని , పెళ్ళి రద్దు చేయాలని కార్తీక్ కుటుంబ సభ్యులు నాగలక్ష్మి కుటుంబాని డిమాండ్ చేశారు . దాంతో ఆవేదనకు లోనైన నాగలక్ష్మి మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నారు . అంతకుముందు నాలుగు పేజీల డెత్ నోటును రాసి ఉంచారు . జీవితం మీద విరక్తితో చనిపోతున్నట్లు పేర్కోన్నారు . స్దానిక పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డీసీపీ అనుచిత్ పరిశీలన జరిపారు.