
టీవీ యాంకర్‌ను మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఓ తెలుగు టీవీ చానల్ యాంకర్‌ను ప్రేమించి మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
సంజీవరెడ్డినగర్: ఓ తెలుగు టీవీ చానల్ యాంకర్‌ను ప్రేమించి మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాకినాడ ఉప్పాడ జంక్షన్‌కు చెందిన మల్లికార్జున్ అలియాస్ అర్జున్ ఇదే ప్రాంతానికి చెందిన అనుశ్రీలు ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు.
2009లో నగరానికి వచ్చిన వీరు బోరబండ జనతానగర్‌లో కలిసి ఉంటున్నారు. అర్జున్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, అనుశ్రీ ఓ చానెల్‌లో యాంకర్. కొంతకాలంగా అనుశ్రీ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుండగా..అర్జున్ సరియైన సమాధానమివ్వకుండా దాటేవేస్తూ వస్తున్నాడు. కాగా శనివారం తెల్లవారుజామున విశాఖపట్టణంలోని మర్రిపాలెంలో మరో యువతితో వివాహం జరగబోతుండగా..నగర పోలీసులు,అనుశ్రీ వెళ్లి అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఓ ఇంట్లో దాక్కున్న ఆయన్ను పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. పోలీసుస్టేషన్‌కొచ్చి తనను పెళ్లి చేసుకోవాలని అనుశ్రీ ఎంత ప్రాధేయపడినా నిరాకరించడంతో పోలీసులు మల్లికార్జున్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.