
ఒకప్పుడు వధువునో/వరుడినో వెతకాల్సి వస్తే హడావుడి అంతా ఇంతా కాదు. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల జాతకం క్షుణ్ణంగా చూడాలని పట్టుబట్టేవారు. అమ్మాయి/ అబ్బాయి ఇంటిల్లిపాదికీ నచ్చితేగానీ తలూపేవారు కాదు. కానీ ఇప్పుడు.. తన భాగస్వామి ఎలా ఉండాలో నేటితరం యువతీయువకులు ముందే ఊహించుకున్నారు. అలాంటి లక్షణాలున్నవారి కోసం పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లలో గాలిస్తున్నారు.
సాక్షి, బెంగళూరు: పెళ్లి కోసం భాగస్వామిని వెతికే తీరులో ఎంతో మార్పు కనిపిస్తోంది. జోడీ కోసం ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు. రాష్ట్రంలో యువత తమ జీవిత భాగస్వామిని సొంతంగా వెతుకుంటున్నట్లు ఒక సర్వేలో తేలింది. పక్క రాష్ట్రాల భాగస్వాములపై ఆసక్తి కనపరుస్తున్నట్లు తేలింది. ఒక ప్రైవేటు మ్యాట్రిమోని వెబ్‌సైట్ ఈ మేరకు సర్వే నిర్వహించింది. సర్వేలో 60 శాతం మంది యువతీ యువకులు తమ ప్రొఫైల్స్ సొంతంగా రిజిస్టర్ చేసుకుంటున్నట్లు వెల్లడైంది. 67 శాతం మంది యువతులు, 64 శాతం మంది యువకులు పొరుగు రాష్ట్రాల్లో వధూవరుళ్ల కోసం అన్వేషిస్తున్నారు.
పరాయి రాష్ట్రమైనా పర్లేదు
కేవలం 23 శాతం యువతులు, 26 శాతం మంది యువకులు మాత్రమే కర్ణాటకలోనే తమకు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. సుమారు 2 లక్షలకు పైగా ప్రొఫైల్స్‌ను క్రోడీకరించి ఈ లెక్కలను తేల్చారు. అత్యధికంగా బెంగళూరు నుంచి భాగస్వాముల కోసం మ్యాట్రిమోని వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మైసూరు, బెళగావి, తుమకూరు, హుబ్లీ నుంచి ఉన్నారు.
70 శాతం యువకులే
♦ కర్ణాటకను మినహాయిస్తే ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా యువతీ యువకులు ప్రొఫైల్స్ నమోదు చేస్తున్నారు.
♦ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 30 శాతం మంది యువతులు, 70 శాతం యువకులు ఉన్నారు. ఇందులో 44 శాతం మంది 24–27 ఏళ్ల మధ్యవారు, 37 శాతం మంది 26–29 ఏళ్లవారు.
♦ ఈ యువకుల్లో ఎక్కువ భాగం వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉండడం గమనార్హం.
♦ ఇక యువతుల విద్యా ఉద్యోగాల విషయానికి వస్తే 28 శాతం మంది ఇంజనీర్లు, 23 శాతం మంది ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ, 6 శాతం మేనేజ్‌మెంట్ పూర్తి చేసినవారు. యువకులు కూడా దాదాపు ఇదే శాతాల్లో ఉండడం విశేషం.
♦ అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ, యూకేలలోని కన్నడిగులు కూడా మాట్రిమోని వెబ్‌సైట్లను ఆశ్రయిస్తూ భాగస్వామి వేటలో పడ్డట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment