నడిరోడ్డుపై ఘోరం
నడిరోడ్డుపై ఘోరం
Published Fri, Mar 31 2017 11:19 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
► కడ్డీలకు గొంతు గుచ్చుకుని లారీ క్లీనర్ బలవన్మరణం
► బళ్లారి రాయల్ సర్కిల్‌లో దుర్ఘటన
బళ్లారి: పదునైన కడ్డీలకు చేయి తగిలితేనే అమ్మో అంటాం. అలాంటిది వాటి మీద గొంతును బలంగా గుచ్చి తనువు చాలించాడో యువకుడు. ఎంత కష్టమొచ్చిందో ఏమో కానీ ఒక యువకుడు పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కాంపౌండ్ వాల్ గ్రిల్‌కు అమర్చిన పదునైన కడ్డీలకు గొంతు గుచ్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బళ్లారిలో జరిగింది. రాయల్ సర్కిల్ సమీపంలో గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎస్‌బీఐ బ్యాంకు కాంపౌండ్ వాల్‌కు అమర్చిన బలమైన కడ్డీలకు గుచ్చుకుని సమీర్ షేక్ (28) అనే లారీ క్లీనర్ ప్రాణాలు తీసుకున్నాడు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన సమీర్ షేక్ స్టార్‌లైన్ అనే ట్రాన్స్‌పోర్టు లారీలో అనంతపురం మీదుగా బళ్లారికి వచ్చాడు. నాలుగు రోజులుగా అటు, ఇటూ తిరుగుతూ ఉండేవాడు. గురువారం వందలాది మంది సంచరిస్తుండగా ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ ఎవరూ అడ్డుకోక పోవడం బాధాకరమని పోలీసులు అన్నారు. లారీ డ్రైవర్ తమ క్లీనర్ తప్పిపోయాడని ఫిర్యాదు చేయడంతో తాము శవాన్ని చూపించగా, వారు గుర్తు పట్టారని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసికంగా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కూడా కారణం కావచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై బ్రూస్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి పెళ్లయి, పదేళ్ల కొడుకు ఉన్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement