ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు | Woolen Art Work: Dhulipalla Manasa Priya Inspiring Journey | Sakshi
Sakshi News home page

Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు

Published Thu, Dec 8 2022 3:45 PM | Last Updated on Thu, Dec 8 2022 5:24 PM

Woolen Art Work: Dhulipalla Manasa Priya Inspiring Journey - Sakshi

ఊలు ఉన్నది వెచ్చని స్వెట్టర్‌లు అల్లడానికే కాదు. చక్కగా చిత్రంగా బొమ్మలు వేయడానికి కూడా. ఊలు బొమ్మలంటే ఊలుతో అద్దిన బొమ్మలు కాదు. ఊలుతో అల్లిన చిత్రాలు... ఉలెన్‌ ఆర్ట్‌ కళారూపాలు. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు.

అది నవంబర్‌ 17. బెంగళూరు, కర్నాటక చిత్రకళా పరిషత్‌తోని దేవరాజ్‌ అర్స్‌లో ఓ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌. అది సోలో ఎగ్జిబిషన్‌. అందులో వినూత్నమైన చిత్రాల ప్రదర్శన. రంగు అద్దుకున్న కుంచె నుంచి కాన్వాస్‌ మీద రూపుదిద్దుకున్న రూపమేనా? సందేహం కలుగుతుంది. కళ్లు భ్రమకు గురి చేస్తున్నాయా అనే అనుమానం కూడా. భ్రుకుటి ముడిచి నిశితంగా చూస్తే తెలుస్తుంది అది దారాలు చేసిన మాయ అని.

పోరింగ్‌ ఆర్ట్‌ను తలపిస్తూ రంగుల దారాలు పెయింటింగ్‌ ఫ్రేమ్‌ నుంచి కిందకు జాలువారి ఉన్నాయి. మొత్తం 14 చిత్రాలవి. అన్నింటిలోకి పెద్ద చిత్రం పదకొండు అడుగుల ఎత్తు, ఏడున్నర అడుగుల వెడల్పు ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్‌తో ఉన్నాయి. కానీ ప్రధానంగా ‘అమ్మ’ మనసును ప్రతిబింబిస్తున్నాయి. అమ్మ బొమ్మ కనిపించదు, నిద్రపోతున్న బిడ్డను సంతృప్తిగా చూసుకునే భావం బొమ్మల్లో ద్యోతకమవుతుంది.

ఆ చిత్రాల రూపకర్త ఓ తెలుగు మహిళ. పేరు మానసప్రియ. ఆమె ఈ కళారూపాల కోసం ఐదేళ్లు నిరంతరంగా శ్రమించారు. పిన్నికి ఇచ్చిన మాట కోసం ఆమె జీవించి ఉండగానే ప్రదర్శించడం కోసం రెండేళ్ల పాటు నిద్రను త్యాగం చేస్తూ పని చేశారు.

ఆమె పని చేస్తున్న వేగం కంటే పిన్నిని ఆవరించిన క్యాన్సర్‌ ఇంకా వేగంగా విస్తరించింది. పిన్నిని తీసుకువెళ్లి పోయింది. పిన్ని సీత ప్రథమ వర్థంతికి మానస ప్రియ ఇచ్చిన కన్నీటి కళాసుమాంజలి ఈ ప్రదర్శన. తాను ఆర్టిస్ట్‌ అయిన నేపథ్యాన్ని, చిత్రకళలో చేస్తున్న ప్రయోగాలను సాక్షితో పంచుకున్నారామె.

ప్రకాశం నుంచి బళ్లారి
‘‘మా తాతలు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా నుంచి కర్నాటకలోని బళ్లారికి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను బళ్లారిలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. పెన్సిల్‌తో చక్కటి రూపాన్ని తీసుకురాగలిగేదాన్ని.  స్కూల్‌లో ప్రైజ్‌లు కూడా వచ్చాయి. అయితే నాకు పెద్ద అడ్డంకి చదువే.

ఎంత ప్రయత్నించినా మార్కులు పెద్దగా వచ్చేవి కాదు. అందులో నా అదృష్టం ఏమిటంటే... మార్కులు రావడం లేదని చదువు మానిపించకుండా ఫైన్‌ ఆర్ట్స్‌లో (బి.ఎఫ్‌.ఏ) చేర్పించడం. హైదరాబాద్‌లో లాలాపేట నుంచి ఉదయం ఐదింటికి ఉప్పల్‌కి వెళ్లి అక్కడి ప్రకృతి దృశ్యాలను బొమ్మలు వేశాను. పదిరోజులు వైజాగ్‌లో కాలేజ్‌ బల్లల మీద పడుకుంటూ ప్రాజెక్ట్‌ చేశాను.

బీఎఫ్‌ఏ పూర్తయిన తర్వాత బెంగళూరులో విజువల్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందే లోపే పెళ్లి. పిల్లల కోసం కొంత గ్యాప్‌ తీసుకున్నాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత రేఖ అనే ఫ్రెండ్‌ ఆహ్వానంతో కేరళ, ఫోర్ట్‌ కొచ్చిలో నా చిత్రాలను ప్రదర్శించాను. అప్పటికి ఉలెన్‌ పెయింటింగ్స్‌ మొదలు పెట్టలేదు.

అయితే ఆర్టిస్ట్‌గా ఊరికే ఉండకుండా ఏదో ఒక ప్రయోగం చేసేదాన్ని. అలా టెర్రారియమ్‌ అని గాజు సీసాల్లో మొక్కలను పెంచడం వంటి హాబీలు ప్రాక్టీస్‌ చేశాను. ఆ తర్వాత పెయింటింగ్‌లో ఇప్పుడు మీరు చూస్తున్న ఉలెన్‌ ప్రయోగం మొదలు పెట్టాను. మా వారి ఉద్యోగరీత్యా ఇప్పుడు పూనాలో ఉంటున్నప్పటికీ నా ఆర్ట్‌ ప్రయోగాలు మానలేదు. 

నా పేరు మీద మొక్క
బెంగళూరులో ఎగ్జిబిషన్‌ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు అరవై దాటిన మహిళలు ఐదుగురు వచ్చారు. ‘మేము అక్కాచెల్లెళ్లం. ఓ సిస్టర్‌ ఈ రోజే కెనడా నుంచి వచ్చింది. ఈ ఎగ్జిబిషన్‌ చూసి తీరాలని తనను నేరుగా తీసుకువచ్చాం’ అని చెప్పారు.  

అలాగే ఎగ్జిబిషన్‌ చివరి రోజు ఆర్ట్‌ గ్యాలరీ ప్రెసిడెంట్‌గారు వచ్చి ‘వాళ్ల కాలేజ్‌లో రెండు రోజులు ఎగ్జిబిషన్‌ కావాల’ని అడిగారు. ఆరు వందల మంది విద్యార్థుల మధ్య నాతోనే ప్రారంభోత్సవం చేయించి, కాలేజ్‌ ప్రాంగణంలో నా పేరు మీద మొక్క నాటారు. ఐదేళ్లు నేను ఇంటి నాలుగ్గోడల మధ్య పడిన శ్రమ నాకో ప్రత్యేకతను తెచ్చింది. నేను అభ్యసించిన కోర్సుకి మరో కొత్త ఆర్ట్‌ ఫార్మ్‌ను జత చేయగలుగుతున్నాననే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు మానస ప్రియ.

నా బొమ్మల్లో అమ్మ ఉంది
నేను ఆర్టిస్ట్‌ని, తల్లిని. ఉలెన్‌ ఆర్ట్‌ మాధ్యమంగా అమ్మ మనసును ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. పిల్లలు మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఉలెన్‌ ఆర్ట్‌లో పిల్లల ముఖంలో ప్రసన్నత కోసం నేను శ్రద్ధగా పని చేయడాన్ని మా సీత పిన్ని చాలా ఇష్టంగా చూసేది.

‘ఈ కళాఖండాలతో ఎగ్జిబిషన్‌ పెడితే చూడాలని ఉంది’ అని చెప్పిందోసారి. ‘అలాగే చూస్తావు పిన్నీ’ అన్నాను. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే తెలిసింది పిన్నికి క్యాన్సర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉందని. అప్పటి వరకు మామూలుగా ప్రాక్టీస్‌ చేసిన నేను త్వరగా పూర్తి చేయాలని చాలా దీక్షగా పనిచేశాను. రెండేళ్లపాటు రోజుకు నాలుగు గంటలే నిద్రపోయాను.

నేనెంత ఆత్రుత పడినప్పటికీ పిన్ని ఉండగా ఆ పని చేయలేకపోయాను. గత ఏడాది పిన్ని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. పిన్ని తొలి వర్ధంతి నాటికి ఎగ్జిబిషన్‌ పెట్టి తీరాలని ఈ ఏడాది నవంబర్‌లో ఆ పని చేయగలిగాను. ఈ ప్రక్రియలో నాకు చాలా మంది సహాయం చేశారు. అంజలి పట్వర్ధన్‌ నా ప్రతి బొమ్మకు ఒక పోయెమ్‌ రాశారు. ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటులో ఫ్రెండ్‌ తేజస్విని సహాయం చేసింది.  – ధూళిపాళ్ళ మానస ప్రియ,  ఉలెన్‌ ఆర్టిస్ట్‌ 
– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement