పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెడతారు: వైఎస్ జగన్ | ys jagan mohan reddy demand special status for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెడతారు: వైఎస్ జగన్

Published Thu, Sep 22 2016 1:56 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ys jagan mohan reddy demand special status for Andhra Pradesh

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటిసాకులు చెబుతున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాలులో జరిగిన యువభేరిలో ఆయన ప్రసంగించారు.


ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మార్చారని దుయ్యబట్టారు. హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటిస్తే స్వాగతిస్తున్నామని చంద్రబాబు చెప్పడం దారుణమని అన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో ఒనగూరే ప్రయోనాలను వైఎస్ జగన్ సవివరంగా వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు.


వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..

  • యువభేరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, కింద ఫ్లోర్‌లో కూడా విద్యార్థులు టీవీలలో చూస్తున్నారు.. అక్కడున్న విద్యార్థులందరికీ పేరుపేరునా ఇక్కడికి వచ్చినందుకు, తోడుగా నిలుస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
  • ఇక్కడ ఆదరణ చూసిన తర్వాత.. ఇంతకన్నా పెద్ద కళ్యాణమండపం ఏలూరులో లేదా అని నానిని అడిగాను.. ఇదే పెద్దదని ఆయన చెప్పారు
  • ఏలూరులో పోరాటం కొనసాగిస్తూ ముందడుగు వేద్దాం
  • ప్రతిచోటా యువభేరి ద్వారా ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలేంటో చెబుతున్నాం
  • ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం
  • బీజేపీ, టీడీపీలు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం, పోరాడుతున్నాం
  • ఢిల్లీ వరకు అందరం వెళ్లి ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు, ధర్నాలు, బంద్‌లు అన్నీ చేస్తున్నాం
  • ప్రత్యేక హోదా మనకు ఎందుకింత అవసరం.. దానివల్ల జరిగే మేలేంటో పలుదఫాలుగా చెబుతున్నాం
  • ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు మన ప్రమేయం ఏమీ లేకపోయినా ఇష్టారాజ్యంగా విడగొట్టారు
  • అప్పుడు మనం ఒప్పుకోకపోయినా మన ఎంపీలందరినీ లోక్‌సభ నుంచి బయటకు పంపి, సస్పెండ్ చేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు
  • ఆరోజు లోక్‌సభ నుంచి రాజ్యసభకు బిల్లును తీసుకెళ్లారు
  • అక్కడ... రాష్ట్రాన్ని విడగొడుతున్నందుకు అన్యాయం జరుగుతోందని, హైదరాబాద్ లేకపోవడం వల్ల చదువుకున్న పిల్లలు హైదరాబాద్‌కే వెళ్తారని తెలుసని చెప్పారు.
  • హైదరాబాద్‌లోనే 95 శాతం ఐటీ పరిశ్రమలున్నాయి, హైదరాబాద్, దాని చుట్టుపక్కలే ఉత్పాదక పరిశ్రమల్లో 70 శాతం ఉన్నాయని తెలుసని అన్నారు
  • అందుకే దానికి బదులు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు
  • అధికార, ప్రతిపక్షాలు ఏకమై.. రాష్ట్రాన్ని విడగొడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు
  • ఎన్నికలు అయిపోయాయి.. పార్లమెంటులో ఆరోజు ఓటు వేశామన్న సంగతి మర్చిపోయారు
  • కాంగ్రెస్ వాళ్లు ఐదేళ్లు హోదా ఇస్తామంటే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీలు ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని అన్నారు
  • ఇదే బీజేపీ.. ఇదే అరుణ్ జైట్లీ ఆరోజు రాజ్యసభలో ప్రతిపక్ష నేత. ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలన్నారు
  • ఇదే చంద్రబాబు ఎన్నికల సభలో పదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలని ఊదరగొట్టారు
  • ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
  • ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల్లో చెప్పారు
  • ఓట్లు వేయించుకున్న తర్వాత నాయకులు ప్లేట్లు మారుస్తున్నారు
  • జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ అనిపిస్తుంది
  • అప్పుడు హోదా వల్లనే ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టిన వీళ్లే ప్లేట్లు మారుస్తున్న తీరుచూసి బాధనిపిస్తుంది
  • రెండున్నరేళ్ల తర్వాత.. మొన్న జైట్లీ సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టారు
  • చంద్రబాబుకు సంబంధించిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎంపీలు, మంత్రులు కూడా ఆయనతో ఉన్నారు
  • ప్రెస్‌మీట్ జరుగుతోందని ఏడోతేదీ పొద్దున్న నుంచి తెగ హడావుడి, డ్రామా చేశారు
  • చివరకు జైట్లీ మాత్రం దమ్మిడీ ఇస్తామని చెప్పలేదు గానీ, హోదా ఇవ్వబోమని చెప్పారు.. జరిగింది అది!
  • అదేరోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారు వెంటనే పిక్చర్ లోకి వచ్చారు.. నేను స్వాగతిస్తున్నాను అంటాడు
  • నాకైతే ఆశ్చర్యం అనిపించింది. వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబితే.. ఈ మనిషికి కాస్తో కూస్తో ఇంగ్లీషు వస్తుందా అని కూడా అనిపిస్తుంది
  • అంతటితో చంద్రబాబు ఆగలేదు.. తర్వాత అసెంబ్లీలో మేం నిలదీశం.. స్వాగతించడానికి నువ్వెవడివని అడిగాం
  • ప్రత్యేక హోదా మీ నాయనగారి సొత్తా, మీ అత్తగారి సొత్తా అని ప్రశ్నించాం
  • ఐదున్నర కోట్ల మంది జీవితాలు దానిమీద ఆధారపడ్డాయి
  • మాకెవరికీ ఇష్టం లేకపోయినా నువ్వెవడివయ్యా స్వాగతించడానికని నిలదీశాం
  • అందుకని ఇక్కడ మాట్లాడే ధైర్యం లేక శాసనమండలికి వెళ్లాడు
  • అక్కడ ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడాడు
  • ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తాయని అడుగుతున్నాడు.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు ఏం మేలు జరిగిందన్నాడు
  • ఇదే మనిషి రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు 15 ఏళ్లు కావాలంటాడు.. ఈయనే అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం కూడా చేసి పంపాడు
  • తర్వాత ఇదే మనిషి రెండున్నరేళ్ల తర్వాత ప్లేటు మార్చి.. ఏం ఒరుగుతుందని పట్టపగలు అబద్ధాలు ఆడతాడు
  • ప్రధానమంత్రికి ఫోన్ చేసి థాంక్యూ చెప్పాడు
  • చంద్రబాబు చేస్తున్న మోసం ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగడం సమంజసమా
  • వెంకయ్య నాయుడు.. మొన్నటివరకు తనవల్లే ప్రత్యేక హోదా వస్తోందని ఊదరగొట్టాడు.. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని చెప్పాడు
  • అలాంటి వెంకయ్య నాయుడు.. ప్లేటు మార్చాడు. ఈయనే బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఫేస్ అని తెలిసి, ఆయనకు చంద్రబాబు నాయుడు తన మంత్రులతో విజయవాడలో సన్మానం చేయించాడు
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండమైన ప్యాకేజి ఇచ్చారంటాడు
  • ఇదే చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లి, జైట్లీకి శాలువా కప్పి, థాంక్యూ అని చెప్పి వచ్చాడు
  • ఎన్నికలకు ముందు సంజీవనిగా కనిపించిన హోదా.. వీళ్లు ఇప్పుడు దానివల్ల ఏం మేలు జరుగుతుందని అంటారు
  • వెంకయ్య నాయుడైతే.. ఆరోజు ఏదో వేడిమీద అడిగానంటారు. ఆరోజు సాయంత్రానికే మిగిలిన రాష్ట్రాల ఎంపీలు తన వద్దకు వచ్చారని, నీకేమైనా బుద్ధుందా అని అడిగారని చెబుతున్నారు
  • వెంకయ్య వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని చాలా బాధపడ్డారట
  • ఆ మాట రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు చెబుతున్నారు
  • ఆరోజు హోదా సంజీవని అని చెప్పిన వెంకయ్య.. మేకకు వేలాడేవే హోదా అని అంటారు.
  • ఎన్నికల తర్వాత ప్రజలతో పని అయిపోయిందని.. పార్లమెంటులో ఇచ్చిన హామీలను నీరుగారుస్తూ గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారు
  • ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఏమైనా మేలు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు..
  • ఇలాంటివాళ్లు నాయకులని చెప్పుకోడానికి ఎవరైనా ఇష్టపడతారా
  • రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడే వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి
  • ప్రత్యేక హోదాను ఢిల్లీ వాళ్లు ఇవ్వరు.. చంద్రబాబు అడగలేని, అడగని పరిస్థితి ఉంది
  • చంద్రబాబు ఏ స్థాయిలో రాజీ పడిపోయారంటే.. ఢిల్లీ వాళ్లు ఏమిచ్చినా, ఏం ఇవ్వకపోయినా తాను మాత్రం వాళ్ల కాళ్లు వదలనంటారు
  • వ్యక్తిత్వాన్ని అమ్మేసి.. ఈ స్థాయిలో దిగజారిపోడానికి చంద్రబాబు  ఈరెండున్నరేళ్లలో ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కోవడమే కారణం
  • ముఖ్యమంత్రి నల్లధనాన్ని సూట్ కేసుల్లో ఇస్తూ ఆడియోటేపుల్లో అడ్డంగా దొరికిపోయినా ఆయన అరెస్టు కాలేదంటే, ఆయన రాజీనామా చేయలేదంటే.. మన దేశంలో, అదికూడా చంద్రబాబు విషయంలో మాత్రమే జరుగుతుందేమో
  • ఆయన అంత గొప్పగా వ్యవస్థలను మేనేజ్ చేయడలడు, తన స్వార్థం కోసం రాష్ట్రానికి కూడా వెన్నుపోటు పొడుస్తాడు
  • అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచినట్లు, ప్రజలంటే చంద్రబాబుకు లెక్కలేదు
  • ఇదే చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు
  • 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కావడంలేదని టీడీపీ, బీజేపీ వాళ్లు చెప్పారు
  • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు వ్యత్యాసం చూపించడం మానేసిందని, వాళ్లు ఇవ్వద్దన్నారని చెబుతున్నారు
  • అసలు ఆ సంఘం పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచడంపైనే నిర్ణయం తీసుకుంటుంది
  • ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు
  • రాష్ట్రాలు రుణాలు, నాన్ ప్లాన్ గ్రాంటు తీసుకోవాలంటే దానికి సంబంధించిన సూత్రాలు మాత్రమే చూస్తారు
  • ఇంతకుముందు 32.5 శాతం పన్నులు రాష్ట్రాలకు ఇచ్చేవారు.. అందులో మన రాష్ట్రానికి 4.31 శాతం వస్తుంది
  • పన్నుల ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని.. తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఉంటే, దాన్ని పూడ్చాలని.. హోదా ఉన్నా, లేకపోయినా తాము పూడుస్తామని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. వాళ్లు చెప్పింది ఇంతే తప్ప, ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికీ ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు
  • ఆంధ్రరాష్ట్రంతో పాటు మరో 11 రాష్ట్రాలు దీనిద్వారా లబ్ధిపొందుతాయి. కేరళ, పశ్చిమబెంగాల్‌లకు కూడా రెవెన్యూలోటు పూడుస్తున్నారు
  • ప్రత్యేక హోదాను రద్దుచేయాలని తాము చెప్పలేదని అభిజిత్ సేన్ కూడా చెప్పారు
  • మరి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నా
  • అనవసరంగా 14వ ఆర్థిక సంఘం మీద అబద్ధాలు చెప్పడం న్యాయమేనా
  • ప్రణాళికా సంఘం రద్దయింది, నీతి ఆయోగ్ రావడం వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మరో అబద్ధం చెబుతున్నారు
  • ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఉన్నది కేవలం నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కే. దాని అధ్యక్షుడు ప్రధాని.
  • ప్లానింగ్ కమిషన్‌కు, నీతి ఆయోగ్‌కు, ఎన్‌డీసీకి కూడా అధ్యక్షుడు ప్రధానమంత్రే
  • అన్నింటికీ ఆయనే అయినప్పుడు.. ఆయన ఒక సంతకంతో చేసే నిర్ణయాన్ని కేబినెట్ నిర్ణయం అంటారా.. వేరే ఏమైనా అంటారా
  • ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు. ఉత్తరాఖండ్‌కు కేవలం వాజ్‌పేయి సంతకంతో ప్రత్యేక హోదా ఇచ్చారు
  • అదే మాదిరిగా మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని ప్రణాళికా సంఘానికి ఆదేశాలిచ్చారు
  • 2014 మార్చి 2న కేబినెట్ సమావేశమైంది.. అప్పుడే ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలిచ్చింది
  • ప్లానింగ్ కమిషన్‌లో మనకు హోదా ఇవ్వాలన్న ఆదేశాలు మూలుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు
  • కేబినెట్ ఆమోదించినా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వరా?
  • ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ లో 490 శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయి
  • ఉత్తరాఖండ్ లో 2 లక్షల 45 వేల మంది, హిమచలప్రదేశ్ లో లక్షా 30 వేల మందికి ఉపాధి లభించింది
  • ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు 100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు వస్తుంది
  • 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు కూడా వస్తుంది
  • 50 శాతం రేటుకే పరిశ్రమలకు కరెంట్ ఇస్తారు
  • ఇలా బెనిఫిట్స్ వస్తే వేలాదిగా పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి లభించదా?
  • పారిశ్రామిక రాయితీలతో పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెట్టరా?
  • వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు
  • మనహక్కు ప్రకారమే నిధులిస్తామంటే స్పెషల్ ప్యాకేజీ ఎలా అవుంది?
  • పోరాటంతో ప్రత్యేక హోదా సాధించుకుందాం
  • ప్రతేక హోదా పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement