అది చంద్రబాబు అత్తగారి సొత్తా!
‘హోదా’పై ఏలూరు యువభేరిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం
- బీజేపీ, టీడీపీ ప్రజలను వంచించాయి
- రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎక్కడిది?
- హోదా ఇవ్వకపోయినా బాబు ఢిల్లీ పెద్దల కాళ్లు వదలడం లేదు
- ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినా అరెస్టు కాని ఏకైక సీఎం చంద్రబాబే
- పోరాడి హోదాను సాధించుకుందాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను దారుణంగా వంచించాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెబితే.. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడం ఏమిటని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఏమైనా చంద్రబాబు నాన్నగారి సొత్తా? అత్తగారి సొత్తా? అని నిప్పులు చెరిగారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన యువతను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా మన హక్కు అంటూ విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ప్యాకేజీ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ప్రత్యేక హోదాపై ఎన్నికల ముందు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటలు, ఎన్నికల తర్వాత వారు మాట మార్చిన తీరును దృశ్య సహితంగా ప్రదర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, గద్దెనెక్కా వాటిని విస్మరించిన వైనాన్ని వీడియో సహితంగా ప్రదర్శించారు. యువభేరిలో వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే....
‘‘ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా యువభేరి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ప్రత్యేక హోదా వల్ల మనకు దక్కే లాభాలేంటి, హోదా రాకపోతే జరిగే నష్టాలేంటి అనే దానిపై యువతను చైతన్యవంతులను చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికే నిరాహార దీక్షలు చేశాం. ఎంపీలు, ఎమ్మెల్యేలం అంతా ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లి, అక్కడ ధర్నా చేశాం. ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నాం. మన ప్రమేయం లేకుండా, మనకు ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ, చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు.
విభజనకు సహకరించారు. విభజన వల్ల నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార కాంగ్రెస్ నేతలు అంటే.. అది సరిపోదు పదేళ్లు కావాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చే తామేనని, ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఇప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు అప్పుడు రాజ్యసభలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అన్నారు. పదేళ్లు ఏమాత్రం సరిపోదు పదిహేనేళ్లు కావాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టోలను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. తాము పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పెద్దలు, చంద్రబాబు కలిసి ఎన్నికల ప్రచార వేదికలపై హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేది కచ్చితంగా సంజీవని అని ఆ రోజు పేర్కొన్నారు. హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికలైపోయాక, ప్రజలతో అవసరం తీరాక ప్లేట్లు మార్చేస్తున్నారు.
చంద్రబాబుకు ఇంగ్లిష్ వచ్చా?
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తోంది. అప్పుడు ప్రత్యేక హోదాపై కబుర్లు చెప్పిన బీజేపీ, టీడీపీ పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. వారు గద్దెనెక్కి రెండున్నరేళ్లయి పోయింది. ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. సెప్టెంబరు 7వ తేదీని అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం పెట్టారు. చంద్రబాబు కు సంబంధించిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎంపీలు, మంత్రులు.. జైట్లీతోపాటు ఆ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంపై 7వ తేదీ ఉదయం నుంచే విపరీతమైన డ్రామా నడిపించారు. అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నారు, బ్రహ్మాండమై ప్యాకేజీ అందజేస్తున్నారని ఉదయం నుంచి టీవీ చానళ్లన్నీ ఊదరగొట్టాయి. రాష్ట్రానికి ఇక హోదా వచ్చేస్తోందని వెయ్యి కళ్లతో ఎదురుచూశాం.
చివరకు అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి ఏం చేశారంటే.. దమ్మిడీ కూడా ఇస్తామని చెప్పలేదు. పైగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. అదేరోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తెరపైకి వచ్చారు. అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాను అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా చెబుతూ ఉంటే.. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మన తరఫున పోరాటం చేయాల్సిన వ్యక్తి దాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. అసలు ఆయనకు కాస్తోకూస్తో అయిన ఇంగ్లిష్ వస్తుందా? అని అనుమానం కలిగింది. కేంద్రం చేసిన ప్రకటనను ఎందుకు స్వాగతించారో అర్థం కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీశాం. ప్రత్యేక హోదా అనేది ఏమైనా మీ నాన్నగారి సొత్తా? అత్తగారి సొత్తా? ప్రత్యేక హోదా ఇవ్వం అని కేంద్రం చెబితే, దాన్ని స్వాగతించడానికి మీరెవరు? అని ప్రశ్నించాం. మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తుండడంతో సమాధానం చెప్పే ధైర్యం లేక చంద్రబాబు శాసన మండలికి వెళ్లారు. అక్కడ ఇంకా ఆశ్చర్యకరంగా మాట్లాడారు.
ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తాయి? అని వ్యంగ్యంగా మాట్లాడారు. హోదా ఉన్న ఉత్తరాఖండ్‌కు, హిమాచల్‌ప్రదేశ్‌కు ఏం మేలు జరిగింది? అని అన్నారు. ఇదే మనిషి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ఇదే మనిషి ఎన్నికల సభల్లోనూ పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. ఇదే మనిషి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి, కేంద్రానికి పంపించారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా వెంటనే కావాలని చెప్పారు. ఇదే మనిషి రెండున్నరేళ్ల తర్వాత మాట మార్చారు. పట్టపగలే అబద్ధాలాడారు. అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రికి ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పారట. నిజంగా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సమంజసమేనా?
హోదా వద్దట.. ప్యాకేజీ చాలట!
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మొన్నటిదాకా ప్రత్యేక హోదా అనేది సంజీవని అన్నారు. తన వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాబోతోందని ప్రకటించారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా ఇస్తామని చెప్పారు. అలాంటి వెంకయ్యనాయుడు ప్లేటు మార్చారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత కూడా.. చంద్రబాబు నాయుడు తన మంత్రులతో వెంకయ్య నాయుడుకి విజయవాడలో సన్మానం చేయించారు. హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదు, ప్యాకేజీ ఇచ్చారు చాలు.. థాంక్యూ అని చెప్పించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి, అరుణ్ జైట్లీకి శాలువా కప్పి, కృతజ్ఞతలు తెలిపిరావడం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఆ రోజే వేడిమీద ప్రత్యేక హోదా గురించి అడిగానని వెంకయ్య అంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత ఆ మాట చెబుతుండడం ఆశ్చర్యకరం.
హోదాను మేనిఫెస్టోల్లో ఎందుకు పెట్టారు?
పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నీరుగార్చేస్తున్నారు. చివరకు గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారు. ప్రత్యేక హోదా చాలా గొప్పదని మొన్నటిదాకా చెప్పిన వ్యక్తులు.. దానివల్ల ఏమైనా మేలు జరుగుతుందా? అని ఇప్పుడు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అడ్డగోలుగా మాట మారుస్తున్న ఇలాంటి నాయకులు తమవారు అని చెప్పుకోవడానికి భావితరాలు ఇష్టపడతాయా? రాజకీయాల్లో ఉన్నవారికి వ్యక్తిత్వం ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక్కమాట గుర్తుంచుకోవాలి. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. నిజంగా వీళ్లకు విలువలు లేవు. విశ్వసనీయతకు అర్థం అంతకన్నా తెలియదు. ఆ రోజు వేడి మీద మాట్లాడామని చెబుతున్నవారు ప్రత్యేక హోదాను ఎందుకు వారి మేనిఫెస్టోల్లో పెట్టారు? ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల సభల్లో ఎందుకు చెప్పారు?
బాబు ఢిల్లీ పెద్దల కాళ్లు వదలరు
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అదేమిటని ప్రశ్నించలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఏ స్థాయిలో రాజీపడిపోయారంటే.. ఢిల్లీ పెద్దలు ఏపీకి ఏమిచ్చినా, ఏమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు, తాను మాత్రం వారి కాళ్లు వదలననే స్థితికి దిగజారారు. చంద్రబాబు తన వ్యక్తిత్వాన్ని అమ్మేసుకొని దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే... ఆయన ‘ఓటుకు కోట్లు’ కేసులో భాగస్వామి కావడమే. ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సూటుకేసుల్లో నల్లధనాన్ని ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపుల్లో దొరికిపోయినా కూడా అతడు అరెస్టు కాకపోవడం, రాజీనామా చేయకపోవడం కేవలం మనదేశంలో మాత్రమే జరుగుతుందేమో! లేకపోతే కేవలం చంద్రబాబు ఒక్కరి విషయంలోనే అలా జరుగుతుందేమో నాకైతే తెలియదు. ఆయన అంత గొప్పగా వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతున్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీ రామారావుకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఓ లెక్కా! రాష్ట్ర ప్రజల జీవితాలు, భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించడం లేదు.
అది ఆర్థిక సంఘం పరిధిలోని అంశం కాదు
ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు, బీజేపీ నాయకులు రకరకాలుగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు. హోదాపై వాస్తవాలను వివరిస్తూ మేము ఒక కరపత్రం రూపొందించాం. దీన్ని చదివితే చంద్రబాబు, బీజేపీ కలిసి అడుతున్న అబద్ధాలేంటో తెలిసిపోతాయి. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, హోదా లేని రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపించడం ఆర్థిక సంఘం మానేసిందని అంటున్నారు. నిజానికి ఏ రాష్ట్రానికైనా హోదా ఇవ్వాలా? వద్దా? అనేది తేల్చడం ఆర్థిక సంఘం పరిధిలోని అంశం కాదు. కేంద్రం వసూలు చేసిన పన్నులకు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే అంశాన్ని ఆర్థిక సంఘం పర్యవేక్షిస్తుంది. హోదా ఇవ్వకూడదని, దాన్ని రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు.
కేబినెట్ ఆదేశాల అమలేది?
ప్రత్యేక హోదాను రద్దు చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చారు. అయినా బీజేపీ, టీడీపీ అబద్ధాలాడుతున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటున్నారు.. మరి ఆ ఆర్థిక సంఘం ఉండగానే 11 రాష్ట్రాలకు హోదాను ఎలా కొనసాగిస్తున్నారు? ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మరో సాకు చెబుతున్నారు. హోదా ఇచ్చే అధికారం జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డీసీ)కే ఉంది. దానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. నీతి ఆయోగ్‌కు, కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షుడు కూడా ప్రధానే. ప్రధానమంత్రి ఒక సంతకంతో చేసేది నిర్ణయం కాదా? ఇప్పటిదాకా 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు.
అవి కేబినెట్ నిర్ణయాలు కావా? 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఒక్క సంతకంతో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత 2014 మార్చి 2న కేబినెట్ సమావేశమైంది. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్లానింగ్ కమిషన్ 2014 డిసెంబర్ 31 దాకా అమల్లో ఉంది. అంటే 2014 మార్చి నుంచి డిసెంబర్ దాకా.. దాదాపు 9 నెలలు ప్లానింగ్ కమిషన్ ఉంది. కేంద్ర కేబినెట్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకుండా 9 నెలలు ప్లానింగ్ కమిషన్‌లోనే మూలుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని వాదిస్తున్నారు. ఆ రోజు మన రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మిగిలిన రాష్ట్రాలు లేవా? హోదాకు మిగిలిన రాష్ట్రాలు అడ్డుతగులుతున్నాయని ఆ రోజు మీకు గుర్తుకురాలేదా? ఆ రోజు అడ్డుపడని రాష్ట్రాలు ఇప్పుడు అడ్డుపడుతున్నాయనడం సరైందేనా?
అభివృద్ధి చంద్రబాబుకు కనిపించదా?
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది? అక్కడేం ఉద్యోగాలు వచ్చాయి? అని చంద్రబాబు శాసన మండలిలో అన్నారు. చంద్రబాబుకు ఒక్కటే చెప్పదలచుకున్నా... ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఎలాంటి అభివృద్ధి సాధించాయో, ఎన్ని రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో, అక్కడి యువతకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయో ఇంటర్నెట్‌లో శోధిస్తే పూర్తిగా తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌లో ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో 30,244 పరిశ్రమలు వచ్చాయి. రూ.35 వేల కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130 శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.ఉపాధి అవకాశాలు ఏకంగా 490 శాతం పెరిగాయి. బుల్లి రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో యువతకు 2.45 లక్షల ఉద్యోగాలు లభించాయి. హోదా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 10,864 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.15,324 కోట్ల పెట్టుడులు, 1.29 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఈ సమాచారమంతా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గతంలో పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనే ఉంది. ఇది చంద్రబాబుకు కనిపించడం లేదా? ఆయన నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు, అంతా మోసమే.
హద్దుపద్దూ లేకుండా మోసాలు
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎన్నో రకాల పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. ఇలాంటి రాయితీలు ఉన్నప్పుడు ఎవరైనా పరుగెత్తుకొచ్చి మరీ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తారు. హోదా వల్ల లభించే ప్రయోజనాల గురించి చంద్రబాబుకు ఎందుకు తెలియడం లేదో అర్థం కావట్లేదు. కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చినన్ని పారిశ్రామిక రాయితీలను ఇతర రాష్ట్రాలకు ఇవ్వలేదని చంద్రబాబు బొంకుతున్నారు. అవేమిటో ఒక్కసారి చూస్తే.. శనక్కాయలకు, బెల్లాలకు కూడా సరిపోని పరిస్థితి. వాళ్లిచ్చింది ఏమిటంటే.. ఒకటి యాక్సిలరేటెడ్ డిఫ్రిసియేషన్ బెనిఫిట్, రెండోది మన లాభాల్లోంచి పెట్టే పెట్టుబడిని ఖర్చు కింద పరిగణిస్తామన్నారు. ఇవి చాలా గొప్పవని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంతో కలిపి ఈ పారిశ్రామిక రాయితీలను ఇచ్చారు. ఇలా రాయితీలను చూసి ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తారా? లేక ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలకు చూసి వస్తారా? చంద్రబాబు ఒక హద్దుపద్దూ లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్రం చాలా గొప్ప ప్యాకేజీ ఇచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఫలానా పనులు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టం ద్వారా అవన్నీ మనకు హక్కుగా సక్రమించాయి. ఆ హక్కు కంటే ఏ కొంచెం ఎక్కువైనా ఇచ్చి, దాన్ని ప్యాకేజీ అంటే అర్థం ఉంటుంది. ఆ హక్కు ప్రకారమే ఇస్తున్నప్పుడు, అన్ని రాష్ట్రాలకు జరిగే మేళ్లే మనకూ జరుగుతున్నప్పుడు... ప్రత్యేక ప్యాకేజీ ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి.
పోలవరం ప్రాజెక్టుకు చేసిందేమిటి?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని వెంకయ్య, చంద్రబాబు అంటున్నారు. ప్యాకేజీలో ఇది బ్రహ్మాండమైన అంశమని అంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 90, 91లలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దాన్ని కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, తమ పలుకుబడి వల్లే కేంద్రం ఈ ప్రాజెక్టును చేపడుతోందని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. 2010-11 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లతో సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. అయితే, రాష్ట్రం విడిపోక ముందు.. అంటే 2014 మార్చి 31 దాకా పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135 కోట్లు ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ చెప్పారు. రూ.16 వేల కోట్లలో రూ.5,135 కోట్లు ఇవ్వబోము అని కేంద్రం చెబితే అది బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు అంటున్నారు. కరెంటు, డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్ కింద ఇవ్వాల్సిన రూ.2,800 కోట్లు కూడా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెక్కన పోలవరానికి కేంద్రం ఇచ్చేది కేవలం రూ.8 వేల కోట్లే. ఇది గొప్ప ప్యాకేజీ అని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారు.
పెట్రోలియం ప్రాజెక్టు ఎక్కడా?
ఏపీకి ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎయిమ్స్ ఇస్తున్నామని అరుణ్ జైట్లీ చెబితే చంద్రబాబు ఆహా ఓహో అంటూ పొగిడారు. నేషనల్ పాలసీ ప్రకారం కోటి జనాభా కలిగిన ప్రతి రాష్ట్రానికి అనేక జాతీయ ప్రోజెక్టులు ఉన్నాయి. కోటి జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఐఐటీ, ఎయిమ్స్, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీలు ఉన్నాయి. ఇవి కేంద్రం మనకు కొత్తగా ఇస్తున్నట్లు వెంకయ్య ఎల్లో మీడియాల ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. రాష్ట్రానికి రూ.2.29 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని, ఇప్పటికే రూ.1.60 లక్షల కోట్లతో పనులు జరుగుతున్నాయని వెంకయ్య అంటున్నారు. రూ.52,120 కోట్లతో పెట్రోలియం ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. వాస్తవానికి దానికి గ్రీన్ ఫీల్డ్ రిపోర్టు రాలేదు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా పెట్రోలియం ప్రాజెక్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయా? రూ.65 వేల కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు మాదిరిగానే మనకూ రహదారుల అభివృద్ధికి నిధులు ఇస్తారు. ఇదే ప్రత్యేక ప్యాకేజీ అంటే ఎలా?
‘హోదా’ సాధించేదాకా పోరాడుదాం...
రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కాక మోసం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని యువతను మోసం చేశారు. ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసే చంద్రబాబు వంటి నాయకులను నిలదీయాలి. రాష్ట్రానికి వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఈ రోజు కాకపోతే రేపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం. మనం అడగడం మానేస్తే.. పోరాటం ఆపేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. హోదా సాధించుకునే వరకూ పోరాటం కొనసాగిద్దాం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీల అమలు కోసం ఉద్యమిద్దాం. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రమే వచ్చినప్పుడు మన హక్కు అయిన ప్రత్యేక హోదాను సాధించుకోలేమా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇద్దాం.