బోగస్ రుణాలపై క్రిమినల్ కేసులు పెట్టారా...?
పార్వతీపురం: సీతానగరం మండలంలో ఇటీవల వెలుగు చూసిన నకిలీ 1–బి, బోగస్ రుణాలకు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టారా...? అని వైఎస్సార్ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ రమేష్‌ను కలిసిన ఆయన కార్పొరేషన్ బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు పొందిన లబ్ధిదారుల జాబితా కావాలని సమాచార హక్కు చట్టం ప్రకారం కోరారు.
అనంతరం మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు, సీతానగరం తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులతో కుమ్మక్కై, అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో దాదాపు రూ.6కోట్ల వరకు పలు బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు ఆరోపణలు వెలుగు చూశాయన్నారు. ఆయనతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బ్యాంకు ముందు కాసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వాధికారులు, బ్యాంకులు స్పందించని పక్షంలో తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్లు గొల్లు వెంకట్రావు, ఓ. రామారావు, ఎంపీటీసీలు గండి శంకరరావు, చింతల జగన్నాధం, బడే రామారావు, సర్పంచ్‌లు యాండ్రాపు తిరుపతిరావు, బొమ్మి రమేష్ ,బైరిపూడి కరుణేశ్వరరావు, గణేష్‌లతో పాటు ఆపార్టీ నాయకులు చుక్క లక్షు్మంనాయుడు, పాలవలస గోవింద్, నరసన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు.