చెన్నై: తన తల్లి శవంపై కూర్చుని ఓ అఘోరా అంత్యక్రియలు నిర్వహించడం తమిళనాడులో కలకలం సృష్టించింది. తిరుచ్చి జిల్లా, తిరువెరుంబూర్ సమీపంలోని అరియమంగళంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ ప్రాంత వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అరియమంగళంకు చెందిన మేరీ అనే మహిళ మృతిచెందింది. దీంతో ఆమె అంత్యక్రియలు కుమారుడైన మణికంఠన్ నిర్వహించాడు. అయితే మణికంఠన్ వారణాసిలో అఘోరాగా శిక్షణ తీసుకుని అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు.
మణికంఠన్ అఘోరా కావటంతో వారణాసిలోని తన మిత్రులను రప్పించి తన తల్లి అంత్యక్రియలు తమ శైలిలో నిర్వహించాడు. ఇందులో భాగంగా మణికంఠన్ తన తల్లి మేరి శవంపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం అఘోరాలే సమాధి చేశారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న గ్రామస్తులంతా భయాందోళన చెందారు. క్షుద్రపూజల తరహాలో అఘోరాలు శవంపై కూర్చుని అంత్యక్రియలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment