సాక్షి ప్రతినిధి, చెన్నై : వృత్తిరీత్యా అతనో దొంగ.. అయితేనేం తనలోనూ ఓ ప్రేమికుడున్నాడని చూపించాడు. ప్రేమికురాలు వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలను ఫొటో ఫ్రేంలో ‘బంగారం’లా పదిలం చేసుకున్నాడు. అయితే, ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని ప్రేమగాథను విన్న పోలీసులు అవాక్కయ్యారు. చెన్నై సైదాపేట ఉత్తర జోన్స్ రోడ్డులోని ఒక అపార్టుమెంటులో సెల్వ గణేష్, గుణసుందరి ఉంటున్నారు. ఈనెల 21న గుణసుందరి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక అగంతకుడు ఆమె తలపై కొట్టి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయాడు. ఆఫీసు నుంచి వచ్చిన భర్త రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడ్ని పాత నేరస్తుడు జాన్సన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని గొలుసు గురించి విచారించారు. నిందితుడు పోలీసులను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చైనును ఒక పెద్ద ఫొటో ఫ్రేంలో పెట్టి గోడకు తగలించి ఉండడాన్ని చూసి బిత్తరపోయారు. ఇలా తగిలించుకున్నావేమిటని పోలీసులు ప్రశ్నిస్తే తన ప్రేమగాథను చెప్పుకొచ్చాడు. ‘నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా ప్రేమించింది. అయితే, మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఆ బాధను భరించలేక మరో ప్రాంతానికి వెళ్లిపోయా. అయినా, ఆమెను మర్చిపోలేకపోతున్నా. ఈ మధ్యే ఒక ఇంట్లో ఆమెను చూసి కోపంతో కొట్టి బంగారు చైనును తెచ్చేశా. అందుకే దానిని అమ్మకుండా ఆమె గుర్తుగా ఫొటో ఫ్రేంలో పెట్టుకున్నా’నని వివరించాడు. దొంగ ప్రేమకథతో విస్తుపోయిన పోలీసులు ఆమె నీ ప్రేయసి కాదని చెప్పడంతో, చీకట్లో పొరపడ్డానని వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని శుక్రవారం కటకటాల వెనక్కు నెట్టారు.
ప్రేమ బంగారంగానూ..!
Published Sat, Jan 27 2018 7:37 AM | Last Updated on Sat, Jan 27 2018 7:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment