సాక్షి, చెన్నై : ఆ బీ ఫారంలోని వేలి ముద్ర దివంగత సీఎం జయలలిత వేసిందేనా..? అని మద్రాసు హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. వాస్తవికతను ధ్రువీకరించే విధంగా వివరణ ఇవ్వాలని, కోర్టుకు హాజరుకావాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శికి బుధవారం నోటీసులు జారీ అయ్యాయి. ఇక, తమ వద్ద ఉన్న అన్ని వివరాలను విచారణ కమిషన్ ముందు ఉంచుతామని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు తామెవరూ చూడలేదని కొందరు, తాము చూశామని మరికొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అసలు అమ్మను ఎవ్వరూ కలవలేదన్నట్టుగా మరి కొందరు వివాదాస్పద వ్యాఖ్యల్ని సంధించారు. అలాగే, ఆస్పత్రిలో అమ్మకు అందిన వైద్య చికిత్సలపై అనుమానాలు రేకెత్తే రీతిలో స్పందించిన వాళ్లూ ఉన్నారు. దీంతో ప్రతిపక్షాలన్నీ మిస్టరీ నిగ్గుతేలే రీతిలో విచారణ సాగాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి.
బుధవారం మంత్రి జయకుమార్ నో కామెంట్ అంటూనే, జయలలిత మరణం మిస్టరీ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. ఇక, మరో మంత్రి ఓఎస్ మణియన్ అయితే, అమ్మకు వైద్యం అందించిన డాక్టర్ల వద్ద సమగ్ర విచారణ సాగాలని నినదించారు. చివరకు తిరుప్పర గుండ్రం ఎమ్మెల్యే బోసు అయితే, నాలుగు అడుగులు ముందుకు వేశారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ తనను చూసి చేతులు ఊపారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో జయలలిత బీ ఫారంలో చేసిన వేలి ముద్ర వ్యవహారం బుధవారం మద్రాసు హైకోర్టు ముందుకు వచ్చింది.
అన్నీ విచారణ కమిషన్ ముందు ఉంచుతాం
జయలలితకు అందించిన వైద్య పరీక్షల మీద మంత్రులు భిన్న స్వరాల్ని వ్యక్తం చేస్తుండడం, వ్యవహారం వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి , మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడారు. జయలలితకు అందించిన వైద్య వివరాలన్నీ విచారణ కమిషన్ ముందు ఉంచుతామన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్‌ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. జయలలితకు చికిత్స అందించిన గదిలో సీసీ కెమెరాలు లేవని తెలిపారు. అయితే, మంత్రులందరూ అపోలోకు వచ్చారని పేర్కొంటూ, జయలలితను ఎవరెవరు కలిశారో అన్న వివరాలన్నీ విచారణ కమిషన్‌కు సమర్పిస్తామన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఇతర సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీలను అందిస్తామన్నారు. జయలలితకు అందించిన చికిత్స, ఆహారం గురించిన సమగ్ర వివరాలన్నీ విచారణ కమిషన్‌కు సమర్పిస్తామని, సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరుకు చెందిన నర్శింహమూర్తి సమాచార హక్కు చట్టం మేరకు సేకరించిన వివరాల్లో జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో కావేరి వ్యవహారంపై అధికారులతో సమాలోచన సమావేశం నిర్వహించినట్టుగా ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ వివరాల్ని సమర్పించి ఉండడం గమనార్హం.
సీఈసీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు
జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పర గుండ్రం, పుదుచ్చేరిలోని నెల్లితోపు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల బీ ఫారంలో జయలలిత సంతకానికి బదులుగా వేలి ముద్రలు ఉండడం చర్చకు దారితీసింది. వివాదం సైతం సాగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం తిరుప్పరగుండ్రంలో ఓటమి చవి చూసిన డీఎంకే అభ్యర్థి శరవణన్ ఆ వేలి ముద్రలపై అనుమానాల్ని వ్యక్తంచేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వడానికి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని, మదురై జిల్లా ఎన్నికల అధికారి సైతం కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం పిటిషన్ విచారణకు రాగా, న్యాయమూర్తి వేల్ మురుగన్ ముందు వాదనలు సాగాయి. వాదనల అనంతరం ఆ వేలి ముద్ర జయలలితదేనా అన్న వాస్తవికతను ధ్రువీకరించే విధంగా కోర్టుకు స్పష్టత తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి కోర్టుకు వచ్చి మరీ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.