ఉప ఎన్నిక సందర్భంగా ఏఐఏడీఎంకే అభ్యర్థి ఏకే బోస్ సమర్పించిన జయలలిత వేలి ముద్రలున్న బీఫారం(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: దివంగత మాజీ సీఎం జయలలిత వేలిముద్రల రికార్డులను అందజేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గత ఏడాది నవంబర్‌లో తిరుప్పన్‌కుండ్రమ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఏఐఏడీఎంకే అభ్యర్థి ఏకే బోస్‌కు జయలలిత వేలి ముద్రలున్న బీఫారం అందజేశారు. ఆ సమయంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆ వేలిముద్రలపై అనుమానం వ్యక్తం చేస్తూ డీఎంకే నేత పి.శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు జయలలిత వేలిముద్రల రికార్డులను అందజేయాలంటూ బెంగళూరు జైలు అధికారులకు, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమార్జన కేసులో జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో 2014లో కొంతకాలం శిక్ష అను భవించారు. ఆ సమయంలో ఆమె వేలిముద్రలను జైలు అధికారులు సేకరించారు.
అయితే, హైకోర్టు ఉత్తర్వులపై ఏకే బోస్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వేలి ముద్రలు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కు అని, చనిపోయిన తర్వాత కూడా ఇది ఉంటుందని వీటిని వెల్లడించటం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే విధించింది. ఇదిలా ఉండగా, జయలలిత వేలిముద్రల రికార్డులను బెంగళూరు జైలు అధికారులు శుక్రవారం మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment