
సాక్షి, చెన్నై: అమ్మ జయలలితకు సంవత్సరిక తిథి కార్యక్రమాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించేందుకు వెళ్లిన పురోహితుల్ని గార్డెన్‌లోని వేదానిలయంలోకి అనుమతించక పోవడం వివాదానికి దారి తీసింది. చివరకు దినకరన్ పిలుపుతో పరిస్థితి సద్దుమణిగింది.
వివరాలివీ.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి చెంది ఏడాది కావస్తోంది. ఆ కుటుంబ సంప్రదాయం మేరకు సంవత్సరిక తిథిని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. చిన్నమ్మ శశికళ, దినకరన్ ఆదేశాలతో పురోహితులు మంగళవారం తిథి ఇవ్వడానికి అవసరమైన సామగ్రితో పొయేస్ గార్డెన్‌లోని వేద నిలయానికి చేరుకున్నారు. అయితే, వారిని అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం పళనిస్వామి ఆదేశాల మేరకు లోపలికి ఎవ్వరినీ అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పురోహితులు వెనక్కు తగ్గారు.
అయితే, సంఘటనను దినకరన్ శిబిరం తీవ్రంగా పరిగణించింది. ఇదేనా అమ్మ మీదున్న భక్తి, గౌరవం అంటూ సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంపై దుమ్మెత్తి పోస్తూ బుధవారం పొయేస్ గార్డెన్ వైపు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు ఆ పరిసరాల్లో భారీ ఎత్తున బలగాల్ని మోహరింప చేశారు. వేద నిలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో దినకరన్ జోక్యం చేసుకుని అక్కడున్న మద్దతుదారు వెట్రివేల్‌తో ఫోన్లో మాట్లాడారు. అసలే పరిస్థితులు బాగా లేదని, వెనక్కు వచ్చేయాలని సూచించడంతో అక్కడున్న వారంతా తగ్గారు. గార్డెన్ నుంచి వెనక్కు వచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment