CM Palani Swamy
-
త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ‘ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రం బాధాకరం, విచారకరం. ప్రధాని మోదీ ఈ విధానాన్ని పునఃసమీక్షించాలి’అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. ద్విభాషా విధానాన్నే కొనసాగించాలంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించబోదని కుండబద్దలు కొట్టారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. -
ఐటీని వణికిస్తోన్న నీటి సంక్షోభం
సాక్షి, చెన్నై: చెన్నైలో రోజు రోజుకి పెరుగుతున నీటి సంక్షోభం అక్కడి ప్రజలతోపాటు ఐటీ సంస్థలను కూడా బెంబేలెత్తిపోతున్నాయి. నీటి సమస్యను తట్టుకోలేక కోన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. నీటి సమస్య తీవ్రతరం కావడం.. తమ కార్యాలయాల్లో కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఐటీ కంపెనీలే కాదు.. చెన్నైలోని రెస్టారెంట్లు కూడా నీటి సంక్షోభంతో చేతెలెత్తేసే పరిస్థితి నెలకొంది. వినియోగదారులకు తగినంత నీటిని అందుబాటులో ఉంచలేక పలు రెస్టారెంట్లు కేవలం టిఫిన్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. నీరు అందుబాటులో లేకపోవడంతో భోజనం సదుపాయం కల్పించలేకపోతున్నామని చెప్తున్నాయి. అంతేకాకుండా రెస్టారెంట్లు పనిగంటలు కూడా గణనీయంగా తగ్గించాయి. దీంతో ప్రజలు, టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటి సంక్షోభం మీద నివేదికను కోరినట్లు సమాచారం. నీటి సంక్షోభం వల్ల అనేక సంస్థలు మూసివేయబడ్డాయని, ఐటీ కంపెనీలయితే ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకునే పరిస్థతికి దిగజారాయని, ఇవేవి పట్టించుకోకుండా అవినీతితో బిజీగా ఉన్న మున్సిపల్ మంత్రి వేలుమణి దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని స్టాలిన్ డిమాండ్ చేశారు. -
వారిపై అనర్హత సబబే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలోని టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హులుగా ప్రకటించటాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ సత్యనారాయణన్ గురువారం ఈ తీర్పు వెలువరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా గత ఏడాది గవర్నర్‌కు 19 మంది ఎమ్మెల్యేలు లేఖ అందజేశారు. అయితే వారిలో ఒకరు తిరిగి పళనిస్వామి పక్షాన చేరగా మిగతా 18 మందిపై స్పీకర్ గత ఏడాది సెప్టెంబర్‌లో అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేటుపడిన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని జూన్ 14వ తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరాబెనర్జీ తీర్పు చెప్పగా, జస్టిస్ సుందర్ మాత్రం స్పీకర్ నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు. భిన్నమైన తీర్పులు వెలువడడంతో ఈ కేసు జస్టిస్ సత్యనారాయణన్ ముందుకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ సత్యనారాయణన్ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. దినకరన్ వర్గానికి షాక్ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోగా, టీటీవీ దినకరన్ వర్గం షాక్‌కు గురైంది. హైకోర్టు తీర్పు వెలువడగానే ఏఐఏడీఎంకే పార్టీ నేతలు మిఠాయిలు పంచుకుని సందడి చేశారు. పలువురు నేతలు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి అభినందించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం, గెలుపు ఖాయమని సీఎం పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మరో ఎమ్మెల్యే మరణంతో ఏర్పడిన రెండు అసెంబ్లీ స్థానాలను కలుపుకుని మొత్తం 20 నియోజకవర్గాల్లో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుచేసే విషయం, తదుపరి కార్యాచరణపై 18 మంది ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని టీటీవీ దినకరన్ తెలిపారు. ఉప ఎన్నికలు వస్తే పోటీకీ తాము సిద్ధమని దినకరన్ ప్రకటించారు. 2019లోనే అసెంబ్లీకి ఎన్నికలా? మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 కాగా, జయలలిత, కరుణానిధి మరణంతో సభ్యుల సంఖ్య 232కి పడిపోయింది. ఒక సభ్యుడిని స్పీకర్‌గా పక్కనపెడితే 231 అవుతుంది. 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను కోర్టు అనర్హులుగా ప్రకటించడంతో మిగిలింది 213 మంది. 20 సీట్లకు ఎన్నికలు జరిగే వరకు బలనిరూపణకు కావాల్సిన ఎమ్మెల్యేలు 107 మంది. పళనిస్వామికి కచ్చితంగా మద్దతు పలికేది 102 మంది ఎమ్మెల్యేలే అని పరిశీలకుల అంచనా. ఏఐఏడీఎంకేలో ఎంతమంది తిరుగుబాటుదారులున్నారో స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు బలపరీక్ష జరిగితే పాలకపక్షం నెగ్గడంపైనా అనుమానాలున్నాయంటున్నారు. బలపరీక్షలో స్పష్టత రాని పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని చాలామంది నేతలు ఆశిస్తున్న విధంగా 2019 లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, తక్షణం బలనిరూపణలో పళని స్వామి ప్రభుత్వం నెగ్గినా ఖాళీ అయిన 20 అసెంబ్లీ స్థానాల ఎన్నికల తర్వాత బలాబలాలు మళ్లీ మారే అవకాశం ఉంది. ఉప ఎన్నికల అనంతరం అసెంబ్లీలో స్పీకర్‌ను మినహాయిస్తే 233 మంది సభ్యులుంటారు. అప్పుడు మెజారిటీకి 117 సీట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 97 మంది సభ్యుల బలమున్న డీఎంకే.. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకోగలిగితే మెజారిటీ రావచ్చు. లేదంటే మెజారిటీకి దగ్గరిగా వెళ్లొచ్చు. ఆర్కే నగర్లో దినకరన్ విజయం ద్వారా జయలలితకు బలమైన వారసుడిగా ప్రజలు గుర్తించినట్టయింది. డీఎంకే గెలవకపోయినా లేదం టే దినకరన్, అతని అనుచరులు తమ సీట్లను దక్కించుకోగలిగినా పళని ప్రభుత్వం ప్రమాదంలో పడ్డట్టే. ఉప ఎన్నికలు జరిగే 20 సీట్లు అన్ని పార్టీల మధ్య చీలినా కూడా రాజకీయ అనిశ్చితి వెంటాడే ప్రమాదముంది. ఇది కూడా తమిళనాట సత్వర ఎన్నికలకు దారితీస్తుంది. 20 సీట్లకు జరిగే ఉప ఎన్నికలను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ప్రభావితం చేయనున్నారు. -
వైభవంగా హీరో కూతురి వివాహం
సాక్షి, పేరంబూరు: నటుడు, దర్శకుడు పార్థిబన్, సీత కూతురు కీర్తన వివాహ వేడుక అక్షయ్‌తో గురువారం ఉదయం స్థానిక రాజా అన్నామలైపురంలోని ఒక నక్షత్ర హోటల్లో ఘనంగా జరిగింది. కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్లాల్ చిత్రంలో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న కీర్తన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. అక్షయ్, కీర్తన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇటీవలే వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. గురువారం అక్షయ్, కీర్తనల పెళ్లికి ఈ శుభం కార్డు పడింది. వీరి వివాహ వేడుకను పార్థిబన్, సీత కలిసి ఘనంగా నిర్వహించారు. పార్థిబన్, సీత మనస్పర్థల కారణంగా చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కూతురి పెళ్లి పార్థిబన్, సీతల సమక్షంలో ఒక వేడుకలా జరగడం విశేషం. అక్షయ్, కీర్తన వివాహవేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, దయానిధిమారన్, ఎండీఎంకే నేత వైగోలతో పాటు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వంటి పలువురు రాజకీయనేతలతో పాటు నటుడు రజనీకాంత్, లతారజనీకాంత్, శివకుమార్, సూర్య, విశాల్, అరుణ్‌విజయ్, విజయ్‌కుమార్, నటి జ్యోతిక, మీనా, శ్రీప్రియ, లక్ష్మి, కుష్బూ, సందర్.సీ సత్యరాజ్, జయంరవి, ప్రభుదేవా, జీవీ.ప్రకాశ్‌కుమార్, విజయ్‌సేతుపతి, ఉదయనిధిస్టాలిన్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రోహిణి, రాధిక శరత్‌కుమార్, నిర్మాత ఆర్బీ.చౌదరి. ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, సంగీతదర్శకుడు హరీష్‌జయరాజ్, కే.భాగ్యరాజ్,శంకర్, సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అమ్మ’ సంవత్సరికానికి పళనిస్వామి అడ్డు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలితకు సంవత్సరిక తిథి కార్యక్రమాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించేందుకు వెళ్లిన పురోహితుల్ని గార్డెన్‌లోని వేదానిలయంలోకి అనుమతించక పోవడం వివాదానికి దారి తీసింది. చివరకు దినకరన్ పిలుపుతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలివీ.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి చెంది ఏడాది కావస్తోంది. ఆ కుటుంబ సంప్రదాయం మేరకు సంవత్సరిక తిథిని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. చిన్నమ్మ శశికళ, దినకరన్ ఆదేశాలతో పురోహితులు మంగళవారం తిథి ఇవ్వడానికి అవసరమైన సామగ్రితో పొయేస్ గార్డెన్‌లోని వేద నిలయానికి చేరుకున్నారు. అయితే, వారిని అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం పళనిస్వామి ఆదేశాల మేరకు లోపలికి ఎవ్వరినీ అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పురోహితులు వెనక్కు తగ్గారు. అయితే, సంఘటనను దినకరన్ శిబిరం తీవ్రంగా పరిగణించింది. ఇదేనా అమ్మ మీదున్న భక్తి, గౌరవం అంటూ సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంపై దుమ్మెత్తి పోస్తూ బుధవారం పొయేస్ గార్డెన్ వైపు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు ఆ పరిసరాల్లో భారీ ఎత్తున బలగాల్ని మోహరింప చేశారు. వేద నిలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో దినకరన్ జోక్యం చేసుకుని అక్కడున్న మద్దతుదారు వెట్రివేల్‌తో ఫోన్లో మాట్లాడారు. అసలే పరిస్థితులు బాగా లేదని, వెనక్కు వచ్చేయాలని సూచించడంతో అక్కడున్న వారంతా తగ్గారు. గార్డెన్ నుంచి వెనక్కు వచ్చేశారు. -
చిన్నమ్మ శపథం నెరవేరింది
-
అమ్మకు నివాళి కన్నీరు పెట్టిన పళని
-
చిన్నమ్మ శపథం నెరవేరింది
చెన్నై:విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థి వర్గమైన పన్నీరు శిబిరం పురిచ్చిత్తలైవి ’అమ్మ’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కుట్రలు చేసిందో, పనిచేసిందో ప్రతి ఒక్కరూ వీక్షించారని వ్యాఖ్యానించారు. అన్నా ద్రవడమున్నేట్ర కటగం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోనివ్వమని ప్రకటించారు. పార్టీని ద్రోహులు, అరాచక శక్తుల చేతుల్లోంచి కాపాడుకున్నామని, చిన్నమ్మ శపథం నెరవేరిందంటూ పళని ఆవేశంగా మాట్లాడారు. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ఎంజీఆర్, అమ్మ ఆశయాలను సాధిస్తాం. అమ్మ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాంమని పళని స్వామి ప్రకటించారు. డీఏంకేతో చేతులు కలిపి పన్నీరు తీవ్ర తప్పు చేశారని విమర్శించారు. నిజమైన అమ్మ మద్దతు దారులెవరో ఈ రోజు తేలిపోయిందని పళని స్వామి చెప్పారు. సభలో విపక్షాల ప్రవర్తనా తీరు బాధాకరమన్నారు. అంతకుముందు ఆయన మెరీనా బీచ్ లోని అమ్మసమాధిని దర్శించుకుని జయలలితకు నివాళులర్పించారు. -
అమ్మకు నివాళి.. కన్నీరు పెట్టిన పళని
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి తన మంత్రి వర్గసహచరులు, ఎమ్మెల్యేలతో అమ్మ సమాధి వద్దకు తరలి వెళ్లారు. అమ్మ గెలిచిందంటూ నినాదాలతో మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి మారుమోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సమాధి వద్దకు తన మద్దుతారుదలతో తరలి వెళ్లిన ఆయన అమ్మకు నివాళులర్పిస్తూ పళని స్వామి కన్నీరు పెట్టారు. దీంతో అమ్మ గెలిచిందంటూ నినాదాలు మిన్నంటాయి అటు. బలపరీక్షలో పళని స్వామి నెగ్గడంతో పళని స్వామి వర్గీయులు సంబరాల్లో మునిగి తేలుతుండగా, అసెంబ్లీలో చోటు చేసుకున్న హైడ్రామాపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ లో గవర్నర్ కలిశారు. జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను డిమాండ్ చేశారు. అనంతరం మెరినా బీచ్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష దిగారు. శనివారం ఉదయం సభ ప్రారంభంనుంచి తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. ప్రతిపక్షాల, ఆందోళన, ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్ మధ్య సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి మార్షల్స్ రంగ ప్రవేశంతో మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో సభను స్పీకర్ ధనరాజ్ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభం అయిన తరువాత ప్రతిపక్షంలేకుండా ఓటింగ్‌ను ముగించారు. సీఎం పళినిస్వామి విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్టు ప్రకటించారు. -
బలాబలాలు తేలేది రేపే
-
బలాబలాలు తేలేది రేపే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఉత్కంఠ భరిత రాజకీయాలకు శనివారం తెరపడ నుం ది. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం బలాబలాలు తేలేందుకు 18న అసెంబ్లీ సమావేశం వేదిక కానుంది. పళనికి గవర్నర్ విద్యాసాగర్‌రావు బల నిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈ సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మరికొంద రిని ఆకట్టుకోవాలని పన్నీర్ ఎత్తుగడవేశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పళని వేగంగా స్పందించారు. బల పరీక్షకు 15 రోజుల సమయం తీసుకోకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడోరోజునే అంటే శనివారం నాడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేం దుకు 15 రోజులు చాలనే పన్నీర్ ఆశలపై నీళ్లు చల్లారు. ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌కు వచ్చిన ఎమ్మెల్యేలను ఎంతో జాగ్రత్తగా మరలా రిసార్టుకు చేర్చారు. రిసార్టులోని ఎమ్మెల్యేలను ఇక నేరుగా శనివారం నాటి అసెంబ్లీ సమావేశంలోనే హాజరుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. తిరుప్పూరు ఉత్తర ఎమ్మెల్యే విజయకుమార్ పినతల్లి ఈనెల 15న చనిపోగా ఆయనను అంత్యక్రియలకు కూడా వెళ్లనివ్వలేదు. ఎనిమిది రోజుల గడువులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మాత్రమే తనవైపు తిప్పుకోగలిగిన పన్నీర్‌సెల్వం కేవలం రెండు రోజుల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడం ఎంత వరకు సాధ్యమనే అనుమానం నెలకొంది. శశికళ శిబిరంలో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలకు విముక్తి కల్పిస్తే తన వద్దకు రావడం ఖాయమని పన్నీర్ చెబుతున్నారు. తమకు 124 మంది ఎమ్మెల్యే స్పష్టమైన మద్దతు ఉన్నందునే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని మంత్రి జయకుమార్ అన్నారు. పైగా పన్నీర్‌సెల్వం మినహా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి స్వీకరించేందుకు సిద్ధమని శశికళ వర్గీయుడైన డిప్యూటీ స్పీకర్ తంబిదురై ప్రకటించడం ద్వారా 11మంది ఎమ్మెల్యేలకు ఎరవేశారు. ఆ రెండింటిపైనే పన్నీర్ ఆశ ప్రస్తుతం కువత్తూరు శిబిరంలో 124మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి బలపరీక్ష నుంచి సీఎం పళనిస్వామి గట్టెక్కడం ఖాయం. అయితే అమ్మ సెంటిమెంట్, ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్ వద్ద పరిశీలనలో ఉన్న ఫిర్యాదు తనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనబెడతాయని పన్నీర్ సెల్వం ఆశపడుతున్నారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకునే సమయం లేకపోవడంతో పళనిస్వామికి అనుకూలంగా ఓటుపడకుండా ప్రజలను ఉత్తేజితులను చేసేందుకు శుక్రవారం సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళపై అనర్హత వేటువేయాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్‌ను కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించి శశికళపై అనర్హత వేటుపడిన పక్షంలో పార్టీ మళ్లీ మాజీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, పన్నీర్‌సెల్వం చేతుల్లోకి వస్తుంది. శశికళ ఎంపికపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించవచ్చు. ఈ రెండు కోణాలు బలపరీక్ష నుంచి గట్టెక్కించగలవని పన్నీర్ సెల్వం నమ్మకంతో ఉన్నారు. చివరి ఘట్టం: సీఎం పదవికి తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని ప్రక టించడం ద్వారా శశికళపై తిరుగుబావుటా ఎగురవేసిన పన్నీర్‌ను పార్టీ బహిష్కరించింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళను ప్రజలు హర్షించరని, ఎమ్మెల్యేలను బెదిరించి, మభ్యపెట్టి సీఎం అయ్యేందుకు ఆమె సిద్ధమయ్యారని పన్నీర్ చేసిన ఆరోపణలతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడం పన్నీర్‌కు అనివార్యమైంది. అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 136 కాగా, జయ మరణంతో 135కి తగ్గింది. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో పన్నీర్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించగా క్రమేణా ఈ సంఖ్య 11కు పెరిగింది. అలాగే 12 మంది ఎంపీలు సైతం పన్నీర్ పక్షాన చేరారు. శశికళ తన వర్గంలోని ఎమ్మెల్యేలతో చెన్నైకి 93 కిలోమీటర్ల దూరంలోని గోల్డన్ బే రిసార్టులో శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను గవర్నర్ ఆహ్వానించడంలో జరుగుతున్న జాప్యం తనకు కలిసి వస్తుందని ఆశించిన పన్నీర్‌సెల్వంకు భంగపాటే మిగిలింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ జైలు కెళ్లినా ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు పయనించలేదు. శశికళ, ఎడపాడిల చేత కిడ్నాప్‌నకు గురైన ఎమ్మెల్యేకు విముక్తి ప్రసాదించేలా పోలీసుశాఖను ఆదేశించాలంటూ కువత్తూరు శిబిరం నుంచి పన్నీర్‌వైపునకు వచ్చిన ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదును హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలను రాబట్టుకునేందుకు పన్నీర్ చేసిన కిడ్నాప్ కేసు ప్రయత్నం ఫలించలేదు. దీంతో పన్నీర్‌కు మద్దతు పలికే ఎమ్మెల్యేల సంఖ్య 11తోనే ఆగిపోయింది.