చిన్నమ్మ శపథం నెరవేరింది
చెన్నై:విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థి వర్గమైన పన్నీరు శిబిరం పురిచ్చిత్తలైవి ’అమ్మ’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కుట్రలు చేసిందో, పనిచేసిందో ప్రతి ఒక్కరూ వీక్షించారని వ్యాఖ్యానించారు. అన్నా ద్రవడమున్నేట్ర కటగం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోనివ్వమని ప్రకటించారు. పార్టీని ద్రోహులు, అరాచక శక్తుల చేతుల్లోంచి కాపాడుకున్నామని, చిన్నమ్మ శపథం నెరవేరిందంటూ పళని ఆవేశంగా మాట్లాడారు. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ఎంజీఆర్, అమ్మ ఆశయాలను సాధిస్తాం. అమ్మ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాంమని పళని స్వామి ప్రకటించారు.
డీఏంకేతో చేతులు కలిపి పన్నీరు తీవ్ర తప్పు చేశారని విమర్శించారు. నిజమైన అమ్మ మద్దతు దారులెవరో ఈ రోజు తేలిపోయిందని పళని స్వామి చెప్పారు. సభలో విపక్షాల ప్రవర్తనా తీరు బాధాకరమన్నారు.
అంతకుముందు ఆయన మెరీనా బీచ్ లోని అమ్మసమాధిని దర్శించుకుని జయలలితకు నివాళులర్పించారు.