అమ్మకు నివాళి.. కన్నీరు పెట్టిన పళని
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి తన మంత్రి వర్గసహచరులు, ఎమ్మెల్యేలతో అమ్మ సమాధి వద్దకు తరలి వెళ్లారు. అమ్మ గెలిచిందంటూ నినాదాలతో మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి మారుమోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సమాధి వద్దకు తన మద్దుతారుదలతో తరలి వెళ్లిన ఆయన అమ్మకు నివాళులర్పిస్తూ పళని స్వామి కన్నీరు పెట్టారు. దీంతో అమ్మ గెలిచిందంటూ నినాదాలు మిన్నంటాయి
అటు. బలపరీక్షలో పళని స్వామి నెగ్గడంతో పళని స్వామి వర్గీయులు సంబరాల్లో మునిగి తేలుతుండగా, అసెంబ్లీలో చోటు చేసుకున్న హైడ్రామాపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ లో గవర్నర్ కలిశారు. జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను డిమాండ్ చేశారు. అనంతరం మెరినా బీచ్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష దిగారు.
శనివారం ఉదయం సభ ప్రారంభంనుంచి తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. ప్రతిపక్షాల, ఆందోళన, ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్ మధ్య సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి మార్షల్స్ రంగ ప్రవేశంతో మరింత ఉద్రిక‍్తంగా మారిపోయింది. దీంతో సభను స్పీకర్ ధనరాజ్ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభం అయిన తరువాత ప్రతిపక్షంలేకుండా ఓటింగ్‌ను ముగించారు. సీఎం పళినిస్వామి విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్టు ప్రకటించారు.