మూవీ టిక్కెట్లపై పేటీఎం బంపర్ ఆఫర్
వీకెండ్లలో చాలామంది స్నేహితులతో సినిమాకు వెళ్దామని ప్లాన్స్ వేసుకుంటుంటారు. ఒక్కోసారి ఈ ప్లాన్స్ ఫ్లాప్ అవుతుంటాయి. కొంతమంది పొరపాటున వేరే సినిమాకు టిక్కెట్ బుక్ చేసుకోబోయే, మరో సినిమాకు బుక్ చేసుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో టిక్కెట్ క్యాన్సిలేషన్ చేసుకుందామంటే, ఆ డబ్బులు దండగ. ఇక అవి వెనక్కి రావు. ఏం చేయలేక పాలపోలేక చాలామంది తెగ తికమకపడిపోతుంటారు. ఈ చిక్కులను పరిష్కరించడానికి పేటీఎం తన ప్లాట్‌ఫామ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూవీ టిక్కెట్లను బుక్ చేసుకుని, క్యాన్సిల్ చేసుకుంటే, పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే దీనికోసం స్వల్పంగా తొమ్మిది రూపాయల ఛార్జీ చెల్లించాలి అంతే. అది కూడా టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే కట్టాలి. దీనికోసం పేటీఎం క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌తో షో ప్రారంభం కావడానికి మూడు గంటల ముందు టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చు.
పేటీఎం ప్రస్తుతం తీసుకొచ్చిన క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ దాని ప్రత్యేకమైన ఫీచరేమీ కాదు. బుక్‌మైషో ఇప్పటికే రిజర్వు టిక్కెట్ ఫీచర్‌తో ఇలాంటి సౌకర్యాన్నే అందిస్తోంది. రిజర్వు టిక్కెట్ ఫీచర్‌తో ఎలాంటి చెల్లింపులు లేకుండా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల నగదును కోల్పోయే అవసరం లేకుండానే షో ప్రారంభానికి గంట ముందు టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. బుక్‌మైషో దీన్ని పరిమితి సినిమాలకు మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే తాజాగా పేటీఎం తీసుకొచ్చిన ఈ ఫీచర్ కూడా యూజర్లందరికీ అందుబాటులో లేదంట. సైట్‌లో టిక్కెట్ల కోసం వెతికే కస్టమర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిసింది. క్యాన్సిలేషన్ అవసరం పడుతుంది అనుకునేవారు టిక్కెట్ కొనుగోలుతో పాటు ఒక్కో టిక్కెట్‌పై తొమ్మిది రూపాయలు చెల్లించాలి. మూడు గంటల ముందు టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వస్తే, పేటీఎం క్యాష్‌బ్యాక్ రూపంలో మొత్తం నగదు రీఫండ్ చేస్తోంది. ఒక్కో స్క్రీనింగ్‌కు పరిమితి సంఖ్యలో సీట్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచుతోంది. ఇది కూడా పరిమిత సినిమాలకు మాత్రమే.