రేపటితో 'జియో ప్రైమ్' ఆఫర్ క్లోజ్
రేపటితో 'జియో ప్రైమ్' ఆఫర్ క్లోజ్
Published Thu, Mar 30 2017 3:08 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
హైదరాబాద్ : రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఆఫర్ రేపటితో(మార్చి 31) ముగియనుంది. ఉచిత కాల్స్ ఉచిత డేటాతో కూడిన హ్యపీ న్యూఇయర్ ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో జియో ప్రైమ్కు అప్ గ్రేడ్ అవ్వాలని కంపెనీ ఇది వరకే వినియోగదారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కంపెనీకి ఉన్న 10 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లలో దాదాపు 5 కోట్ల మంది ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంటే వీరందరూ రూ.99లతో రీఛార్జ్ చేసుకున్నారు. ఇంకా ఒక్క రోజులోనే ఈ ఆఫర్ ముగుస్తుండటంతో జియో సిమ్ కోసం క్యూలు కట్టిన మాదిరిగా ప్రస్తుతం ప్రైమ్ రీఛార్జ్ కోసం వినియోగదారులు క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ కింద ప్రస్తుతం జియో సిమ్ కలిగి ఉన్న వారు myJio యాప్ ద్వారా రూ.99 చెల్లించి ప్రస్తుతం అనుభవిస్తున్న సేవలను మరో ఏడాది పాటు కొనసాగించుకోవచ్చు.
ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న యూజర్లు తర్వాత అందుబాటులో ఉండే డేటా ఫ్యాక్స్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాయిస్ కాల్స్ ఉచితం. ప్రైమ్ యూజర్లకు నాన్ ప్రైమ్ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు ప్రయోజనాలు పొందుతారని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోజనాల కింద టెలికాం రంగంలో ఎన్నడూ లేనట్టుగా ప్రతి రోజూ 1జీబీ డేటాను కేవలం 10 రూపాయలకే అందించనుంది. వినియోగదారుల తమకు అనువైన రీఛార్జ్ ప్యాకేజీని ఎంచుకోవడానికి తమ మొబైల్ లోని myJio యాప్ ని కానీ, కంపెనీ వెబ్ సైట్ www.jio.com కానీ చూడవచ్చని రిలయన్స్ జియో చెప్పింది. రూ.99 అంతకంటే ఎక్కువ ప్లాన్లను జియో మనీ వ్యాలెట్, myJio యాప్, www.jio.com వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. మార్కెట్లో అన్ని రీఛార్జ్ స్టోర్లలలో కూడా జియో ప్రైమ్ వివరాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది.
Advertisement
Advertisement