ఆ ఫోన్లపై వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ మొబైల్ ఫోన్ తయారీదారు లావా ఇంటర్నేషనల్, వొడాఫోన్ ఇండియాతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎంపికచేసిన లావా ఫోన్లపై వొడాఫోన్ 900 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. 2017 అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను తన కొత్త, పాత కస్టమర్లందరికీ ఇవ్వనుంది. ఈ ఆఫర్ కింద, ఎంపికచేసిన లావా ఫోన్లను వాడే వొడాఫోన్ యూజర్‌కు నెలకు కనీస రీఛార్జ్ 100 రూపాయలపై 50 రూపాయల డిస్కౌంట్ ఇవ్వనుంది. అలా 18 నెలల పాటు అందించనుంది. దీంతో మొత్తంగా రూ.900 క్యాష్‌బ్యాక్ లభించనుంది.
ఈ ఆఫర్ వర్తించే ఎంపికచేసిన లావా ఫోన్లలో ఏఆర్‌సీ 101, ఏఆర్‌సీ 105, ఏఆర్‌సీ వన్ ప్లస్, స్పార్క్ ఐ7, కేకేటీ 9ఎస్, కేకేటీ పెర్ల్, కేకేటీ 34 పవర్, కేకేటీ 40 పవర్ ప్లస్, కెప్టెన్ కే1 ప్లస్, కెప్టెన్ ఎన్1లు ఉన్నాయి. లావాతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని, లావా మొబైల్స్ వాడే తమ కస్టమర్లకు పాకెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను తీసుకొచ్చామని వొడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అన్వేష్ కోస్లా చెప్పారు. కస్టమర్లకు వొడాఫోన్ ఆఫర్ చేసే క్యాష్‌బ్యాక్ మొత్తం, తమకు అత్యధికంగా అమ్ముడుపోతున్న ఫీచర్ ఫోన్ కెప్టెన్ ఎన్1 ధరకు సమానంగా ఉందని లావా ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్, సీనియర్ వీపీ గౌరవ్ నిగమ్ అన్నారు.