హిస్టరీ రిపీట్: 2.5 లక్షలకుపైగా ఫోన్లు అమ్మకం
షియోమి ఫోన్ల విషయంలో మరోసారి హిస్టరీ రిపీట్ అయింది. ఇటీవల లాంచ్ అయిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే ఈ స్మార్ట్ ఫోన్ హాట్ కేకులా అమ్ముడుపోయింది. ఎనిమిది నిమిషాల్లో రెండున్నర లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడుపోయినట్టు షియోమి ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ లలో విక్రయానికి వచ్చింది. యూజర్ల నుంచి రెడ్ మి 4 కోసం 2.3 మిలియన్లకు పైగా 'నోటిఫై మి' అనే అలర్ట్ లు వచ్చినట్టు అమెజాన్ ఇండియా కూడా వెల్లడించింది. నిమిషానికి 10 మిలియన్లకు పైగా హిట్స్ కూడా వచ్చినట్టు అమెజాన్ తెలిపింది. కస్టమర్ల ఈ అనూహ్య స్పందనకు తాము ఆశ్చర్యానికి గురయ్యామని పేర్కొంది. అమెజాన్.ఇన్ లో టాప్ సెల్లింగ్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్లు ఉంటాయని, నేటి సేల్ తో కస్టమర్లకు మరిన్ని బెస్ట్ ప్రొడక్ట్ లు అందించడానికి, ఎంపికచేసుకోవడానికి తమ ఫోకస్ ను మరింత విస్తరించాలని తెలిసిందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ కేటగిరీ మేనేజ్ మెంట్ నూర్ పటేల్ తెలిపారు.
అయితే నేడు వచ్చిన ఈ అనూహ్య స్పందనతో అమెజాన్ ఇండియా వెబ్ సైట్ కొద్దిసేపటి వరకు క్రాష్ కూడా అయింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ గతవారం లాంచైంది. ప్రస్తుతం 2జీబీ/16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్లు అమ్మకానికి వచ్చాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర 6999 రూపాయలు. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రీమియం ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో రెడ్ మి 4ను తీసుకొచ్చామని, తమ ఎంఐ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రేమ చాలా అద్భుతంగా ఉందని షియోమి ఇండియా ఆన్ లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి తెలిపారు. మూడు స్టోరేజ్ వేరియంట్లతో పాటు 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు.