అట్టహాసం.. భారీ ర్యాలీలు
- తరలివచ్చిన టీఆర్‌ఎస్ శ్రేణులు
- ఆకట్టుకున్న కళాకారుల ఆటపాటలు
సరూర్‌నగర్: మీర్‌పేటలోని టీకేఆర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బుధవారం మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ ఎంఎల్‌సీ గంగాధర్ తదితరులు చేరిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది .
ముఖ్యమంత్రిని డీఎంఆర్‌ఎల్ చౌరస్తా నుంచి రంగారెడ్డి జిల్లా అమరవీరుల ప్రాంగణం వరకు (వేదిక) వందలాది వాహనాలతో ర్యాలీ జరిగింది. కేసీఆర్ వేదిక ఎక్కిన వెంటనే ‘జై తెలంగాణ నినాదాలతో’ సభా ప్రాంగణం మారు మోగింది. అంతకు ముందు సాయిచంద్ కళాకారుల బృందం తెలంగాణ ఆటపాటలతో ప్రజలను ఉత్తేజింపచేశారు. బడంగ్‌పేట్ నగరపంచాయతీ నుంచి పార్టీ నాయకులు కర్రె కృష్ణ, రాళ్లగూడె శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బైకుర్యాలీ నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా గులాబీమయం చేశారు. మైనారిటీ నేతలు తమతో తెచ్చుకున్న వాయిద్యాలతో ఆనందం వ్యక్తం చేశారు.
మహేశ్వరానికి వరాల జల్లు
మహేశ్వర నియోజకవర్గానికి ముఖ్యమంత్రికేసీఆర్ వరాలజల్లులు కురిపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గం అధివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆర్‌సీఐ రోడ్ నుంచి పహాడీ షరీఫ్ వరకు వెళుతున్న లింక్‌రోడ్‌ను నాలుగు లైన్‌ల రోడ్‌గా మార్చేందుకు సహకరించాలని, అలాగే భారీ విద్యుత్ ప్లాంట్‌ను మహేశ్వరంలోనే ఏర్పాటు చేయాలని తీగల కోరారు.
ఇందుకు స్పందించిన కేసీఆర్ సభా వేదిక నుంచే పహాడీ షరీఫ్‌రోడ్‌కు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు వేయి కోట్లతో ఏర్పాటు చేయనున్న భారీ విద్యుత్ ప్లాంట్‌ను మహేశ్వరంలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు మహేశ్వరం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం మాదిరి అభివృద్ధి చేసి చూపిస్తానని, తనపై భరోసా పెట్టుకోవచ్చని చెప్పారు.