అందరూ ఉన్న 'అనాథలు'!  | 10 to 15 Senior Citizens dying as orphans every month | Sakshi
Sakshi News home page

అందరూ ఉన్న 'అనాథలు'! 

Published Sun, Aug 26 2018 2:55 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

10 to 15 Senior Citizens dying as orphans every month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సరిగ్గా ఆరు నెలల క్రితం సికింద్రాబాద్‌ రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ వద్ద ఓ పెద్దాయన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వయసు 75 పైనే ఉంటుంది. ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ఆరా తీయగా.. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలిసింది. ఒక కొడుకు ఖమ్మంలో, మరో ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారికి సమాచారం ఇవ్వగా.. ఎవరూ   రాలేదు. గాంధీలో చికిత్స పొందుతూనే ఆ పెద్దాయన కన్నుమూశాడు. అందరూ ఉండి కూడా ఓ అనాథగా లోకాన్ని విడిచి వెళ్లాడు.

ఒక రిటైర్డ్‌ అధికారి, ఆయన భార్య మల్కాజిగిరిలో  ఉంటున్నారు. ఇద్దరు కొడుకులూ అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల అనారోగ్యంతో రిటైర్డ్‌ అధికారి భార్య కన్నుమూసింది. ఓ కొడుకు మాత్రమే వచ్చాడు. రాను, పోను విమానం టికెట్లు బుక్‌ చేసుకుని మరీ వచ్చాడు. తల్లి చితికి నిప్పంటించేందుకు అంగీకరించలేదు. చివరికి ఆ పెద్దాయనే భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు. అదే రోజు రాత్రి ఆ కొడుకు అమెరికాకు వెళ్లిపోయాడు. 

కొన్ని రోజుల క్రితం ఓ సుపుత్రుడు తన 80 ఏళ్ల తల్లిని అడిక్‌మెట్‌ బస్టాపులో వదిలేసి వెళ్లాడు. అప్పటికే తీవ్రమైన డిమెన్షియాతో బాధపడుతున్న ఆ పెద్దావిడ.. తన వివరాలను కూడా మరిచిపోయింది. ఒక స్వచ్ఛంద సంస్థ గుర్తించి ఆమెను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించింది. తర్వాత తెలిసిన వివరాల ప్రకారం ఇద్దరు కొడుకులు ఆమెను నెలకొకరు చొప్పున పోషించారు. ఇటీవల ఆమెకు డిమెన్షియా రావడంతో నగలు, నగదు అన్నీ తీసుకొని బస్టాపులో వదిలి వెళ్లారు. చికిత్స అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులే ఆమెను ఒక వృద్ధాశ్రమంలో చేర్పించారు. 

ఇలా వీరే కాదు.. హైదరాబాద్‌లో ఎంతోమంది వృద్ధుల పరిస్థితి ఇదే. జీవిత చరమాంకంలో పిల్లల నిరాదరణకే గురై అనాథల్లా బతుకుతున్నారు. కొడుకులు, కోడళ్ల వేధింపులను భరించలేక కొందరు ఇళ్లను వదిలేసి వీధుల్లోకి వస్తున్నారు. మరికొందరిని తమ పుత్రరత్నాలే వీధుల్లో వదిలేసి వెళ్తున్నారు. కాలధర్మం చేసిన కన్నవాళ్లకు అంత్యక్రియలు చేయాల్సిన నైతిక ధర్మాన్ని కూడా కొందరు విస్మరిస్తున్నారు. 

ఒంటరి వృద్ధులకు దినదినగండం.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 15 లక్షల మందికి పైగా సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నట్లు అంచనా. వారిలో కనీసం 2 లక్షల మంది ఒంటరిగానే ఉంటున్నారు. ఎలాంటి ఆధారం లేక, అయిన వాళ్ల పలకరింపులు లేక బిక్కుబిక్కుమంటూ బతికేస్తున్నారు. ఇదే అదనుగా వృద్ధులు ఒంటరిగా ఉండే ఇళ్లల్లో దొంగలు దాడులకు దిగుతున్నారు. హత్యలకు పాల్పడుతున్నారు. నగలు, డబ్బు దోచుకెళ్తున్నారు. 

చట్టం ఏం చెబుతోంది... 
- వృద్ధుల సంక్షేమ చట్టంలోని 6వ సెక్షన్‌ ప్రకారం సీనియర్‌ 
సిటిజన్స్‌ ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యత పోలీసులదే. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒంటరిగా ఉన్న వయోధికుల జాబితాను రూపొందించాలి. 
వారానికి రెండు సార్లు బీట్‌ కానిస్టేబుళ్లు వాళ్ల ఇళ్లకు వెళ్లి పలకరించాలి. రిజిస్టర్‌లో సంతకం తీసుకోవాలి. వారి యోగక్షేమాలను కనుక్కోవాలి. 
కాలనీ కమిటీల తరహాలోనే స్థానికంగా యూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి. రాత్రిపూట వృద్ధులకు మందులు, వైద్యం వంటి సహాయాన్ని అందజేసే బాధ్యతను ఈ కమిటీల ద్వారా నిర్వహించాలి. కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ పోలీసులు పాటించడం లేదు. 

నెలకు 15 మంది 
వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలను రూపొందించినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇక పెద్దల బాధ్యతను కొడుకులు, కూతుళ్లు భారంగా భావిస్తున్నారు. ఆస్తులను తమ పేరిట బదలాయించుకుని.. తర్వాత వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొందరైతే నిర్దాక్షిణ్యంగా బస్టాపుల్లో, పుణ్యక్షేత్రాల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇలా ప్రతి నెలా 10 నుంచి 15 మంది సీనియర్‌ సిటిజన్స్‌ అనాథల్లా చనిపోతున్నట్లు హెల్పేజ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వృద్ధాశ్రమాల్లో చనిపోయిన వాళ్లకు ఆశ్రమ నిర్వాహకులు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌ వంటి సంస్థలే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి శ్యామ్‌కుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు. హెల్పేజ్‌ ఇండియా నిర్వహిస్తున్న సహాయ కేంద్రానికి సీనియర్‌ సిటిజన్స్‌ నుంచి ప్రతి నెలా వచ్చే 300 ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం కొడుకులు, కోడళ్లు, కుటుంబ సభ్యుల వేధింపులకు సంబంధించినవే కావడం గమనార్హం. మరోవైపు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లే వృద్ధులను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్లను మనుషులుగా కూడా గుర్తించడం లేదని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

అధికారుల తీరు మారాలి..
వృద్ధుల సంరక్షణ చట్టం బలంగానే ఉంది. కానీ అమలు కావట్లేదు. గ్రేటర్‌లో ఒంటరిగా ఉండే వృద్ధుల రక్షణ గురించి 2007లో అప్పుటి కమిషనర్, ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీనియర్ల జాబితాను రూపొందించి, రక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.     
– వుప్పల గోపాల్‌రావు, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ 

వైద్యులకు చిన్నచూపేల?
అనారోగ్యంతో ఉన్న వృద్ధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం చేయించడం సవాల్‌గా మారుతోంది. సహాయకులు, పోలీసులు ఉంటే తప్ప వైద్యం చేయబోమని వైద్యులు అంటున్నారు. కొడుకులు, కోడళ్లు తరిమేస్తే బయటకు వచ్చిన వాళ్లకు ఎవరు సహాయకులుగా ఉంటారు. కొన్నిసార్లు 108 సిబ్బంది కూడా ఇబ్బంది పెడుతున్నారు.            
 – శ్యామ్‌కుమార్, హెల్పేజ్‌ ఇండియా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement